ప్రతిష్టాత్మకంగా 60 రోజుల ప్రణాళిక


Sat,August 24, 2019 03:20 AM

-సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేయాలి
-కొత్త పంచాయతీరాజ్ చట్టంపై 30న కార్యదర్శులకు పరీక్ష
-సెప్టెంబర్ 8లోగా వంద శాతం కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలి
- త్వరలోనే ఖాళీ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ
-ప్రతీ జీపీలో కో-ఆప్షన్, స్థాయి సంఘాలను ఎంపిక చేయాలి
-అధికారులతో సమీక్షలో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్

అర్బన్ కలెక్టరేట్, ఆగస్టు23: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 60 రోజుల ప్రణాళిక అమలుకు గ్రామ పంచాయతీలు సిద్ధం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్లు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక, స్థాయి సంఘాల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 130 గ్రామ పంచాయతీలకు 105 జీపీల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారన్నారు. ఖాళీగా ఉన్న 25 పోస్టులను ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనుందని చెప్పారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల బాధ్యతలపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆబ్జెక్టీవ్ పద్ధతిలో ఈ నెల 30న పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ పరీక్షలో కనీ సం 50 శాతం మార్కులు సాధించిన రెగ్యులర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఇటీవల నియామకమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు ఈ పరీక్షను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం పై ఎంపీడీవోల అవగాహనను పరిశీలించేందుకు పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లు రెండు కళ్లు
కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుకు ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వానికి రెండు కళ్లలా వ్యవహరించాలని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అన్నారు. స్వచ్ఛదర్పణ్‌లో భాగంగా జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధుల నుంచి 94 గ్రామ పంచాయతీల్లో మంజూరు చేసిన కమ్యూనిటీ మరుగుదొడ్ల పనులను సెప్టెంబర్ 8వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం పెంపొందించేందుకు మంజూరు చేసిన 88 డంపింగ్ యార్డుల్లో 47 డంపింగ్ యార్డుల పనులు పూర్తయ్యాయని, మరో 13 చోట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 72 గ్రామ పంచాయతీల్లో మంజూరు చేసిన శ్మశాన వాటికల నిర్మాణ పనులను వేగంగా పూర్త్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోలకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ప్రసూనరాణి, డీఆర్డీవో రాము, జిల్లా పంచాయతీ అధికారి మహమూద్ పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...