జీపీల్లో విద్యుత్ ఆదాకు చర్యలు


Thu,August 22, 2019 03:10 AM

-సెన్సార్ ఆన్ ఆఫ్ స్విచ్ యూనిట్లు
-మొదటగా 50 గ్రామాల్లో..
-కలెక్టరేట్ కార్యాలయంలో సోలార్ చార్జర్ బాక్స్ ఏర్పాటు
-ఒక్కొక్క యూనిట్ ధర రూ.3వేలు
-కసరత్తు చేస్తున్న పీఆర్ అధికారులు

అర్బన్ కలెక్టరేట్, ఆగస్టు 21: గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ను ఆదా చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్యేక చొరవతో పంచాయతీల్లో విద్యుత్ దీపాల నియంత్రణకు సెన్సార్‌తో కూడిన ఆటోమెటిక్ ఆన్ ఆఫ్ స్విచ్చ్‌లు ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు గాను ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోలా ర్ చార్జర్ బాక్స్ ఏర్పాటు చేసిన నర్సంపేటకు చెందిన ఇన్నోవేటర్ ముప్పారపు రాజు ఈ ఆన్‌ఆఫ్ స్విచ్‌లు రూపొందించారన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజును పిలిపించి మాట్లాడారని జిల్లా పీఆర్ అధికారులు తెలిపారు. మొదటి విడతలో భాగంగా మూడో లైను ఉన్న 50 గ్రామాలను గుర్తించి 100 యూనిట్లను బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ ధర రూ.3వేల చొప్పున మొత్తం వంద యూనిట్లకు రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. కలెక్టర్ క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ (సీబీఎఫ్) నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతునారు. అయితే ఒక్కొక్క యూనిట్ సుమారుగా 30 నుంచి 40 విద్యుత్ లైట్లను నియంత్రిస్తుందని చెప్పారు. ఈ యూనిట్ల్ల పనితీరు, విద్యు త్ ఎంత మేరకు ఆదా అవుతుంది పరిశీలించిన అనం త రం జిల్లాలోని మిగిలిన జీపీ పరిధిలో అమర్చనున్నారు.

విద్యుత్ ఆదా..
గ్రామ పంచాయతీల్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటం, అందుకు అనుగుణంగా బిల్లు కూడా వేలు, లక్షల రూపాయల్లో వస్తుండటంతో బకాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించి నియంత్రణ సక్రమంగా లేకపోవడంతో 24 గంటలు వెలుగుతూనే ఉన్నట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొట్ట మొదట హసన్‌పర్తి మండలంలోని మడిపల్లిలో ఒక యూనిట్ ఏర్పాటు చేసి పరిశీలించారని, విజయవంతం కావడంతో జిల్లాలో అలాంటి యూనిట్ల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించినట్లు పీఆర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడో ఏదో ప్రాంతంలో స్విచ్‌లు, బ్రేకర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వీధిలైట్లకు వినియోగించే కరెంటు నియంత్రణ సాధ్యం కావడం లేదని పంచాయతీ సిబ్బంది అంటున్నారు. వీధిదీపాల నిర్వహణకు ఒక ఆపరేటర్ ఉన్నప్పటికీ జీపీ నిధులు, ఇతరత్రా కారణాలచే ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ పంచాయతీల విద్యుత్ బిల్లులు తప్పకుండా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో ఇలాంటి చర్యలు తీసుకుంటే కొంత మేలు జరుగవచ్చని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా అమర్చనున్న సెన్సార్ స్విచ్చ్ యూనిట్ల ఏర్పాటుతో ఆపరేటర్ అవసరం ఉండదు, చీకటి అవ్వగానే ఆటోమెటిక్‌గా ఆన్ కావడం, తెల్లారగానే ఆటోమెటిక్‌గా ఆప్ అవ్వడం జరుగుందన్నారు. తద్వారా వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో మూడో విద్యుత్ లైన్ లేక పోవడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ యూనిట్‌ను మూడో లైన్ ఉన్న గ్రామాలలోని ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

50 గ్రామాలు.. 100 యూనిట్లు
జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ప్రత్యేక చొరవతో జీపీల పరిధిలో విద్యుత్ నియంత్రణకు కొత్తగా ఏర్పాటు సెన్సార్ ఆన్ ఆఫ్ స్విచ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో భాగంగా మూడోలైన్ ఉన్న 50 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో రెండు చొప్పున మొత్తం 100 యూనిట్లు బిగించనున్నారు. భీమదేవరపల్లి మండలంలో భీమదేవరపల్లి, కొప్పూర్, కొత్తకొండ, కొత్తపల్లి, ముల్కనూర్, ముత్తారం, రత్నగిరి, వంగర గ్రామాలు ఉన్నాయి. అలాగే ధర్మసాగర్ మండల పరిధిలోని ధర్మసాగర్, జానకిపురం, కరుణాపురం, నారాయణగిరి, నర్సింగరావుపల్లి, పెద్ద పెండ్యాల, రేపాకపల్లి, ఎల్కతుర్తి మండల పరిధిలో బావుపేట, దామెర, దండెపల్లి, ఎల్కతుర్తి, గోపాల్‌పూర్, కోతులనడుమ, వల్బాపుర్, హసన్‌పర్తి మండలంలో జయగిరి, మడిపల్లి, మల్లారెడ్డిపల్లి, నాగారం, పెంబర్తి, ఐనవోలు మండలంలోని ఐనోలు, పంథిని, పున్నేలు, కొండపర్తి, వనమాలకనపర్తి, వెంకటాపూర్, నందనం, కమలాపుర్ మండలంలోని అంబాల, శ్రీరాములపల్లి, కన్నూర్, కమలాపుర్, గూడూర్, శంభునిపల్లి, కనిపర్తి, ఉప్పల్, శనిగరం గ్రామాలు గుర్తించారు. అదే విధంగా వేలేరు మండలోని గుండ్లసాగర్, కమ్మరిపేట, కన్నారం, మల్లికుదురు, వేలేర్ గ్రామాలలో ఈ సెన్సార్ ఆన్ ఆఫ్ స్విచ్చ్ యూనిట్లను బిగించనున్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...