కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట


Sat,August 17, 2019 03:30 AM


వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, ఆగస్టు 16 : సమైక్య రాష్ట్రంలో నిర్వీర్యమైన కులవృత్తుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని కోనారెడ్డి చెరువులో శుక్రవారం ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేపవిత్తనాలను మత్స్యశాఖ అధికారులు, కార్మికులతో కలిసి కలిపారు. ఈ సందర్భంగా ఫిషరీస్ జిల్లా అధికారి బాలాజీ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం కోసం ఉచితంగా చేపవిత్తనాలను అందజేస్తున్నదని తెలిపారు. దీంతో మత్స్యకారులు, వ్యాపారులు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారని చెపారు. ప్రధానంగా ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి నేరుగా అధికారుల ద్వారానే సొసైటీలకు చేప విత్తనాలను అందజేస్తున్నదని వివరించారు. గతంతో కాంట్రాక్టు పద్ధతి ఉండడం వల్ల కాంట్రాక్టర్ నాసిరకమైన విత్తనాలను సరఫరా చేసేవాడని, దీంతో కార్మికులకు అనుకున్న మేరకు ప్రయోజనం లభించలేదన్నారు. కానీ, ఈ సంవత్సరం అధికారులే చేపవిత్తనాలను వరంగల్ కేంద్రంగా తీసుకువస్తున్నారని తెలిపారు. చేపలు 35 నుంచి 40 మిలీమీటర్ల సైజు ఉండడంతో పాటు చనిపోయి ఉన్నట్లయితే మత్స్య సొసైటీ ప్రతినిధులు నిరభ్యంతరంగా వెనక్కి పంపించాలని సూచించారు.

296 చెరువుల్లో చేప విత్తనాలు
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది 86.48 లక్షల చేపవిత్తనాలను కలిపేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే రమేశ్ తెలిపారు. రూరల్ జిల్లాలోని పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో ఉన్న 106 చెరువుల్లో 35.75 లక్షల చేపవిత్తనాలు, అర్బన్ జిల్లా పరిధిలోని మడికొండ, హసన్‌పర్తి, ఐనవోలు, ఖిలావరంగల్ మండలాల్లో ఉన్న 190 చెరువుల్లో 48.93 లక్షల చేపవిత్తనాలను కలిపేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. శుక్రవారం మడికొండ, వర్ధన్నపేట చెరువుల్లో చేప విత్తనాలను పోసి కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. కోనారెడ్డి చెరువులో లక్ష రవ్వులు, లక్ష బొచ్చలు, 86 వేల బంగారుతీగ చేపవిత్తనాలను కలుపుతున్నట్లు తెలిపారు. కార్మికులంతా అధికారుల సహకారంతో చేపవిత్తనాలను నాణ్యతగా పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్‌ఎస్ రైతు విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...