అద్వితీయ ప్రగతి


Fri,August 16, 2019 04:43 AM

-తెలంగాణ సర్కార్ పాలన దేశానికే ఆదర్శం
-స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: రాష్ర్టాన్ని సాధించిన ఐదేళ్లల్లోనే అన్ని రంగాల్లో అద్వితీయ ప్రగతిని సాధించి దేశానికే తలమానికంగా నిలిచామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల ఈసారి వర్షాలు ఆలస్యంగా కురిసినా ..చెరువులన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, దార్శనికతతో సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మహోన్నతంగా, తెలంగాణ ఆకాంక్షలకు అద్దంపట్టేలా, ప్రపంచమే అబ్బురపడేలా నిర్మించి జాతికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన హన్మకొండలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు దేశ స్వాతంత్య్రం, తెలంగాణ అమరవీరుల త్యాగాలను, రాష్ట్ర సాధన వల్ల అందుతున్న ప్రయోజనాలను ఆవిష్కరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా దేవాదుల ప్రాజెక్టు నిలుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి యజ్ఞంలో 2020 మార్చి నాటికి దేవాదులను పూర్తి చేస్తామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం లింగంపల్లి-మల్కాపూర్‌లో 10.17 టీఎంసీల నీటినిలువ సామర్థ్యంతో నిర్మించే ప్రాజెక్టు పనులు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అన్ని రంగాల్లో ముందుంచేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలను రూపొందించి ఇక్కడి చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని విరాజిల్లేలా చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే దాదాపు రూ.20 వేల కోట్ల అంచనాతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) 2041 మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామన్నారు. దానికి త్వరలోనే సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గురువారం పరేడ్ గ్రౌండ్స్‌లో జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..

ఉద్యమాల పుట్టిల్లు..ప్రగతికి మెట్టిల్లు
దేశంలో తెలంగాణ ప్రాంతానికి గొప్ప విశిష్టత ఉంది. పోరాటాలకు, ఉద్యమానికి పుట్టినిల్లు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. నీరు, నిధులు, నియామకాల్లో జరిగిన వివక్షకు ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని ఆరు దశాబ్ధాల పాటు ఉద్యమించింది. రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచింది. నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయాన్ని, గ్రామీణవృత్తులను పునరుద్ధరించడాకి ముఖ్యమంత్రి దీక్ష, పట్టుదల, దూరదృష్టితో చేపట్టిన పనులు ప్రపంచస్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచాయి. తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మార్చేందుకు, గోదావరి జలాలను సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు మళ్లించేందుకు ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డుస్థాయిలో మూడేళ్లలోనే పూర్తి చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుంది.

2020 మార్చి నాటికి దేవాదుల పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సార్‌ఎస్పీని నింపేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎక్కువ లబ్ధి కలుగుతుంది. అలాగే రూ.14వేల కోట్లతో నిర్మిస్తున్న జే. చొక్కారావు-దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను 2020 మార్చి లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా మల్కాపూర్-లింగంపల్లి వద్ద 10.17 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నాం.

ప్రపంచం అబ్బురపడేలా మేడారం
ఆదివాసీ గిరిజనుల పండుగ మేడారం జాతరకు తెలంగాణ ఏర్పాటుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. రాష్ట్ర పండుగ అయిన మేడారం జాతరను 2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఘనంగా నిర్వహించేందుకు, శాశ్వత వసతులు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

గ్రామ పంచాయతీలు
పనితీరులో గుణాత్మక మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీల అభ్యున్నతికి 60 రోజుల కార్యాచరణను ముఖ్యమంత్రి ప్రకటించారు. సంపూర్ణ పారిశుధ్య పనులతో పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల పనితీరును మానిటరింగ్ చేసి మెరుగుపర్చే బాధ్యతను, అధికారాలను కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం కల్పించింది. పచ్చదనం-పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించాలని సర్పంచ్‌లను దయచేసి కోరుతున్నాను. జవాబుదారీ తనాన్ని పెంపొందించుటకు సర్పంచులతో పాటు ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం జరిగింది.

భద్రకాళీ గుట్టపై లైటింగ్
భద్రకాళీ గుట్టపై అంతర్జాతీయ ప్రమాణాలతో త్రీడీ సౌండ్, లైటింగ్ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ఐనవోలు దేవస్థానం, కాజీపేట దర్గా, ఫోర్ట్ వరంగల్, ఓ సిటీ అభివృద్ధితో పాటు నగర పాలక సంస్థలో విలీనం చేసిన వర్ధన్నపేట, పరకాల, ఘన్‌పూర్ నియోజకవర్గాలకు చెందిన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. రూ.150 కోట్ల కుడా నిధులతో ఇన్నర్ రింగ్‌రోడ్ నిర్మాణానికి, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట అభివృద్ధికి అవసరమైన భూ సేకరణ చేస్తున్నాం. నగరంలో విలీనం చేసిన 42 గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అమృత్ పథకం కింద రూ.550కోట్లతో పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణంచేపట్టాం.

రైతుబంధు పథకం
మొదటి విడతగా 2019-20 వానకాలంలో ఎకరాకు రూ.5వేల చొప్పున జిల్లాలో 53వేల మంది రైతులకు రూ.52కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించింది. అలాగే మృతి చెందిన 193 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.9.65కోట్లను రైతు బీమాగా ప్రభుత్వం అందించింది. రూ.2.54 కోట్లతో ఉద్యాన వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. 3500 ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని 114 మత్స్య సహకార సంఘాల్లోని12వేల మంది సభ్యుల జీవనోపాధి పెంపుదలకు కోటి 52లక్షల చేప పిల్లలను చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా వేస్తున్నది.

మెరుగైన వైద్యం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడమే సీఎం సంకల్పం. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది. 2019-20లో జూలై వరకు జిల్లాలో 4వేల డెలివరీలు నమోదయ్యాయి. వీటిలో 3,700 డెలవరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగాయి. వీరికి కేసీఆర్ కిట్‌లు అందజేశాం. అమ్మఒడి కింద 11,500మంది గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు 102 వాహన సేవలను ఉచితంగా అందించాం. 108 వాహనాల ద్వారా15వేల మంది అత్యవసర రవాణా వైద్య సేవలు పొందారు. కంటివెలుగు ద్వారా 40 నెట్‌వర్క్‌ల ఆస్పత్రులలో 2019-20లో 13వేల మందికి మొత్తం రూ.30కోట్ల విలువైన చికిత్సలను ప్రభుత్వం అందించింది. ఎంజీఎం ఆస్పత్రిని పేదల పెన్నిధిగా అభివృద్ధి చేసేందుకు 1996 నుంచి కృషి చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీసుకున్న చొరవ వలన 2014లో 4లక్షలు ఉన్న అవుట్ పేషెంట్ల సంఖ్య 2018 నాటికి 11లక్షలకు పెరిగింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎంజీఎంలో డిజిటల్ రేడియోగ్రఫీ యంత్రాన్ని ప్రారంభించాం. అత్యవసర పనులకు రూ.5.33 కోట్ల నిధులను ఇటీవలనే మంజూరు చేయడం జరిగింది. ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధికి సహకరించాలని కాకతీయ మెడికల్ కాలేజీ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పూర్వ విద్యార్థులను కోరడం జరిగింది. విరాలాలు సేకరణకు కలెక్టర్ పేరున ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేస్తున్నాం.

ఆసరా పింఛన్లు
జిల్లాలో సుమారు 1,20,000 మందికి నెలనెలా రూ.24.23 కోట్లను ప్రభుత్వం అందిస్తున్నది. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3016, మిగిలిన పెన్షన్లను రూ.1000 నుంచి రూ.2016 కు 2019 జూన్ నుంచి పెంచి ఇస్తున్నాం. జిల్లాలో 36,395 మంది వృద్ధులు, 42,537మంది వితంతువులు, 15,251మంది దివ్యాంగులు, 2,717 మంది చేనేత కార్మికులు, 2,512 మంది కల్లుగీత కార్మికులు, 7,087మంది బీడి కార్మికులు, 2,725మంది ఒంటరి మహిళలు, 495మంది బోదకాలు బాధితులు, 2281మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు లబ్ధి పొందుతున్నారు. పేదలకు పక్కా వసతి కల్పించుటకు రూ.320కోట్లతో 5221 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

తెలంగాణకు హరితహారం
జిల్లాలో అటవీ ప్రాంతం మూడు శాతం లోపే ఉంది. తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో కోటి మొక్కలను నాటి, ప్రతీ మొక్కను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాం. ప్రతీ గ్రామ పంచాయతీలో కనీసం 4కిలో మీటర్ల పొడవున మొక్కలు పెంచాలని సర్పంచులను, కార్యదర్శులను కోరుతున్నాను. వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో ఖైదీలతో దేశంలోనే అతిపెద్ద నర్సరీ ఏర్పాటైంది. దీనిలో 14లక్షల మొక్కలను పెంచుతున్నాం. గుండు చెరువు వద్ద జపాన్ టెక్నాలజీతో 10వేల మొక్కలను నాటుతున్నాం.

బాలికలు..మహిళల భద్రతపై...
బాలికలు, మహిళల భద్రతపై ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, కళాశాలలతో పాటు గ్రామాలు, నగరంలోని వాడల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మేధావులను, ప్రజా సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను కోరుతున్నాను. జిల్లా అభివృద్ధిలో, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అంకిత భావంతో కృషి చేస్తున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు, పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ రవీందర్, ఇతర అధికారులకు మరోసారి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అని తన ప్రసంగాన్ని ముగించారు. ఈ వేడుకల్లో మేయర్ గుండా ప్రకాశ్‌రావు, జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్, మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్, టీఆర్‌ఎస్ నాయకులు మార్నెని రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...