పూర్వ వరంగల్‌కు గోదావరి జలాలు


Thu,August 15, 2019 03:08 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పూర్వ వరంగల్ జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్నది. కోనసీమను మరిపిస్తది. ప్రతీ నియోజకవర్గంలో ఒక లక్షా యాభైవేల ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయి. చుక్కనీరు వృథాకాకుండా సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకుసాగి సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా ప్రగతిసింగారంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి చల్లా మల్లారెడ్డి దశదినకర్మకు బుధవారం సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాట్లాడారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి దేవాదుల లిఫ్ట్‌పై సమీక్షను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తుపాకులగూడెం పూర్తిచేయడంతోపాటు మల్కాపూర్ రిజర్వాయర్ కూడా పూర్తిచేస్తే వరంగల్ పూర్వజిల్లాకు 365 రోజులూ నీరు అందుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దేవాదులను వరంగల్ జిల్లాకే పరిమితం చేయాలని, దీంతో 75 టీఎంసీల నీరు లిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని, వీటిపై త్వరలోనే ఒక రివ్యూ నిర్వహించాలని సీఎంను కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరం నీరు ఎల్‌ఎండీకి రెండు మూడు రోజుల్లో చేరుతుందని, సంవత్సరాంతం నిండుగా నీటితో కళకళలాడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నీటితో వరంగల్ జిల్లా ఆయకట్టు మొత్తానికి సమృద్ధిగా నీరందుతుందని తెలిపారు.

ఈ కాల్వల ద్వారా పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు నీరందే అవకాశం ఉంటుందన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2లను పూర్తిచేస్తే ఎల్‌ఎండీ దిగువనున్న సుమారు 9లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని సీఎం దృష్టికి కడియం తీసుకొచ్చారు. గోదావరి జలాలతో వరంగల్ పూర్వ జిల్లా సస్యశ్యామలం కానున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు వరకు ఒక్క నీటిబొట్టు కూడా వృథాకాకుండా సద్వినియోగమయ్యేలా చూడాలని కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో ఇరిగేషన్ ప్రాజెక్టులు, జిల్లాకు జరిగే మేలుపై సుదీర్ఘంగా సీఎం చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలస్వామి, బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సత్యవతిరాథోడ్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రాజయ్య, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, బండా ప్రకాశ్, మాజీ ఎంపీలు సీతారాంనాయక్, గుండు సుధారాణి, జెడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, శ్రీహర్షిణి, సుధీర్, బిందునాయక్, కుసుమ జగదీశ్వర్, రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, హస్తకళాభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి పాల్గొన్నారు.

ప్రగతిసింగారానికి రూ.10కోట్లు
ప్రగతిసింగారం గ్రామానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆ గ్రామ సర్పంచ్ పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు స్పందించిన సీఎం గ్రామాభివృద్ధి కి రూ.10కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును కలెక్టర్ హరితను సీఎం అడిగి తెలుసుకున్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...