అటు పంద్రాగస్టు.. ఇటు రక్షాబంధన్!


Wed,August 14, 2019 02:02 AM

శాయంపేట/చెన్నారావుపేట/నర్సంపేట రూరల్, ఆగస్టు 13: ఒకే రోజు రెండు పండుగలు.. రెండూ విభిన్నమైనవి. దేశం పరాయి పాలన నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు ఒకటైతే.. అన్నాచెల్లళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రోజు మరొకటి. స్వాతంత్య్ర దినోత్సవం, రాఖీ పండుగ ఒకే రోజు గురువారం వస్తున్నాయి. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఇలా ఒకే రోజు రెండు పండుగలు రావడం అరుదుగా జరుగుతుంది. జెండా పండుగలో పిడికిలెత్తి జైహింద్ అని నినదిస్తూనే... సోదరుల చేతికి చెల్లి రాఖీ కట్టి తనకు ఎల్లప్పుడూ రక్షగా ఉండాలని కోరుకునే సందర్భం. ఇప్పటికే జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే, సోదరులకు రాఖీలు కట్టేందుకు సోదరీమణులు పల్లెలకు పయనమవుతున్నారు. దీంతో ఎటు చూసినా అంతటా పండుగ సందడి కనిపిస్తోంది.

ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్
రక్షాబంధన్ ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుంది. రక్ష కల్పించాలనే ప్రతిజ్ఞ ఆత్మీయులకు భరోసా కల్పించడం కోసం ఈ పండుగను జరుపుకుంటారని ధర్మశాస్త్రం చెబుతోంది. ఒకరినొకరు రక్షించుకోవడం కోసం ఈ పండుగను జరుపుకుంటారని ఒక నమ్మకం. పూర్వం రాజ వంశాల నుంచే ఈ పండుగ ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. రాజులు యు ద్ధాలకు వెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే సమయంలో రక్షను కట్టుకునే వారు. రాఖీ పౌర్ణమి నాడు కట్టే రక్షలో అసమాన్యమైన శక్తి ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. పూర్వకాలంలో భర్తకి భార్య రక్షణ కోసం రాఖీ కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది. కుల మతాలకతీతంగా ఆనాటి కాలంలో అంతటి విశిష్టతను సంపాదించుకున్న రాఖీ పండుగను నేటి యుగంలో నూ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు.

పెరిగిన దుకాణాలు...
రాఖీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాల్లో భారీగా రాఖీల దుకాణాలు వెలిశాయి. వ్యాపారులు ముందుగానే రకరకాల రాఖీలను తీసుకొచ్చి అమ్మకాలు చేపట్టారు. సిల్వర్, గోల్డ్ కోటింగ్‌లతో పాటు చూపరులను ఆకర్శించేలా రాఖీలు ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాల్లో రెండు, మూడు రాఖీల షాపులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వీధి, వీధికీ రాఖీల దుకాణాలు ఏర్పాటు చేశారు. అలాగే, స్వీట్ షాపులకు కూడా గిరాకీ పెరిగింది.

ఆన్‌లైన్‌లో ఆత్మీయత...
ఆడపడుచుల పెళ్లి తర్వాత ఎంత దూరంలో ఉన్నప్పటికీ రాఖీ పండుగ రోజు మాత్రం సోదరులకు రాఖీలు కట్టడానికి ఇంటికి వస్తుంటారు. ఎవరైనా ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో స్థిరపడి తప్పని పరిస్థితుల్లో రాలేని పక్షంలో కొరియర్ లేదా పోస్ట్‌ల ద్వారా రాఖీలు పంపి తమ ఆప్యాయత, అనురాగాన్ని చాటుకునేవారు. కానీ ట్రెండ్ మారిపోయింది. ఆన్‌లైన్ రాఖీల కాలం నడుస్తోంది. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్, మెయిల్, ఇతర ఇంటర్నెట్ సాధనాల ద్వారా కూడా రాఖీల చిత్రాలను పంపించి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...