ఎస్సీ హాస్టళ్లలో బయోమెట్రిక్


Sun,August 11, 2019 03:44 AM

-పక్కాగా హాజరు నమోదుకు కసరత్తు
-ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలన
-పకడ్బందీగా అమలు
-త్వరలోనే ప్రారంభం

అర్బన్ కలెక్టరేట్, ఆగస్టు 10: హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. ఇప్పటికే వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. దీంతో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించి రోజువారి హాజరు పక్కాగా తెలిసే అవకాశం ఉంటుం ది. దీంతోపాటు హాస్టళ్లలో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలకు చెక్ పెట్టవచ్చనే ఉద్దేశంతో బయోమెట్రిక్ మిషన్ల్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను సైతం రూపొందించినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా వార్డెన్‌తో పాటు సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన జిల్లా అధికారి, హైదరాబాద్‌లో ఉండే ఉన్నతాధికారులు సైతం పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా అధికారుల వద్ద ఉన్న సెల్ ఫోన్‌లోనే వివరాలు చూసే వీలును కల్పించారు.

జిల్లాలో 31 ఎస్సీ హాస్టళ్లు
వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 31 వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 19, పోస్టు మెట్రిక్ (కాలేజీ ) హాస్టళ్లు 12 ఉన్నాయి. ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో 951 మంది, కాలేజీ హాస్టళ్లలో 1717 మంది విద్యార్థులు కలిపి మొత్తం 2668 మంది మంది లబ్ధిపొందుతున్నారు. వీరితోపాటు వార్డెన్లు, సిబ్బంది సైతం బయోమెట్రిక్ విధానంలోనే హాజరు వేయనున్నారు. వీటన్నింటికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బయోమెట్రిక్ యంత్రాలను బిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ యం త్రాలు జిల్లాకు చేరుకోగా, మంగళవారం నుంచి వీటిని బిగించడం ప్రారంభిస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. అయితే హాజరు వేసే వారందరికీ ఒక ఐడీ నెంబర్ ఇచ్చి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ఐడీ నెంబర్ నమోదు చేస్తే అతడికి సంబంధించిన పూర్తి సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ విధానంతో జిల్లా స్థాయితో పాటు, హైదరాబాద్ నుంచి విద్యార్థుల హాజరును పరిశీలించే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఏదైనా కారణంతో బయోమెట్రిక్ యంత్రం పనిచేయకపోతే వెంటనే సరిచేసేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

అదే రోజు బిల్లు
హాస్టల్ విద్యార్థులకు సంబంధించి బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు అవుతుంది. ఈ క్రమంలో ఆ రోజులో ఎంత మంది విద్యార్థులు హాస్టల్‌లో బయోమెట్రిక్ ద్వారా వేలి ముద్రలు వేస్తారో వారికే హాజరు ఆన్‌లైన్‌లో రికార్డు అవుతుంది.అంతమందికే ఆ రోజు భోజనానికి సంబంధించిన బిల్లు జనరేట్ అవుతుంది. అలా నెల రోజుల పాటు హాజరైన విద్యార్థుల బిల్లును నెల నాడు సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ అధికారి తీసుకొని బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చదివే వారికే భోజనం
ప్రస్తుతం మాన్యువల్ హాజరు పద్ధతి ద్వారా కొన్ని హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులే కాకుండా వార్డెన్లకు నచ్చజెప్పి, బెదిరించి, ఇతర కారణాలతో కొందరు విద్యార్థులు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా అమలు చేయనున్న బయోమెట్రిక్ విధానంతో బయటి విద్యార్థులు, వ్యక్తులు హాస్టల్‌లో ఉన్నప్పటికీ భోజనం పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే విద్యార్థులుగా నమోదైన వారికి ఒక ఐడీ నెంబర్ ఇస్తారు. దీంతోనే వేలిముద్రలు నమోదవుతాయి. ఈ నేపథ్యంలో ఇంత కాలం చూసీచూడనట్లుగా వ్యవహరించిన వార్డెన్లు నమోదు కాని వారికి భోజనం పెట్టే అవకాశం ఉండదు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...