ఖైదీ ఒంటరి


Sat,August 10, 2019 03:21 AM

-ఉరికన్నా భయానక శిక్ష
-ఉరి తీర్పు అనంతరం తీవ్రమైన పరిణామాలే
-ఖైదీ పోలేపాక ప్రవీణ్ నంబర్ 9768
-సింగిల్ బ్యారెక్.. 24 గంటలు ప్రత్యేక గార్డ్ పర్యవేక్షణ

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ)జైలుకు వెళ్లడమంటే సినిమాకు పోయినట్టు కాదు. సినిమాల్లో చూసినట్టూ కాదు. జైలు అంటేనే పుట్టెడు దుఃఖం. చూసేందుకు వెళ్లినవారే నరకం అనుభవిస్తారు. అటువంటిది శిక్ష అనుభవించడానికి వెళ్లిన వారి పరిస్థితి ఊహిస్తేనే భయానకం. నరకప్రాయం. సాధారణ శిక్షలు పడినవారికి, యావజ్జీవ శిక్షలు పడిన వారి పరిస్థితి ఊహిస్తేనే చెప్పనలవి కాని వేదన. దారి తెన్నూలేని దయనీయం. ఇంకా తీవ్రాతి తీవ్రమైన నేరానికి పాల్పడి, ఆ నేరం శాస్త్రీయ పద్ధతుల ద్వారా సాక్షాధారాలతో రుజువైన తర్వాత ఉరిశిక్ష విధించబడిన ఖైదీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ఉరి శిక్షను ఎప్పుడు అమలు చేస్తారు? అమలు చేయడానికి పాటించే నియమాలు ఏమిటీ? ఆ శిక్ష ఎప్పుడు అమలు అవుతుంది? అలా అమలు కావడానికి ఎంత కాలం పడుతుంది? ఇందులో అనుసరించే విధానాలు ఏమిటీ? ఉరిశిక్ష పడగానే తక్షణమే అమలు చేస్తారా? ఇందులో పాటించే సూత్రాలు ఏమిటీ? జైలు నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనేది ఆసక్తిగా మారింది. తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితను అత్యంత అమానవీయంగా, అనాగరికంగా, సమాజం అంతా కుతకుత ఉడికేలా చేసిన ఉన్మాద ఘాతుకానికి వరంగల్ జిల్లా కోర్టు రికార్డు స్థాయిలో సంచలన తీర్పు ఇచ్చింది.

ప్రవీణ్ అనే ఉన్మాదికి ఉరిశిక్షను విధిస్తూ గురువారం తీర్పు వెలువడిన మరుక్షణం నుంచి జైలుకు పోగానే ఉరి తీస్తారా? అన్న ఉత్కంఠ, సందేహాలు అందరి మనసుల్ని తొలిచివేస్తుంది. అయితే తీర్పు వెలువడగానే ఆ తెల్లారో మర్నాడో శిక్షను అమలు చేసే పద్ధతి లేదు. జైలు నిబంధనల ప్రకారం అనేక అంచెలా వారి లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలేపాక ప్రవీణ్ అనే ఉన్మాదికి ఉరిశిక్షను చివరగా ఖరారు చేసి అమలు చేయాలని, ఈ దేశ తొలిపౌరుడు (రాష్ట్రపతి) ఆమోదం కావాలి అనేది న్యాయసూత్రాలు, జైలు మ్యాన్యువల్స్ స్పష్టం చేస్తున్నాయి. అప్పటి దాకా ప్రవీణ్ జైల్లో ఒంటరి ఖైదీగానే ఉండాలి.

ఒంటరి ఖైదీ.. గార్డ్ పర్యవేక్షణ
సాధారణంగా ఉరిశిక్షను ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు ప్రతి అందిన తర్వాత వరంగల్ కేంద్ర కారాగారంలో అప్పటి దాకా హై సెక్యూరిటీ బ్యారెక్‌లో ఉన్న ప్రవీణ్‌ను ప్రత్యేక బ్యారెక్‌లో వేశారు. కేవలం ఒకే ఒక్కడు ఉండే బ్యారెక్ అది. ఉరిశిక్షపడిన ఖైదీల పట్ల అనుసరించాల్సిన జైలు మ్యాన్యువల్స్ ప్రకారం జైలు అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. బయటి ప్రపంచమే కాదు జైలు ప్రపంచం సైతం చూడలేని దుర్భర సెల్ అది. ఎవరితో తను మాట్లాడకూడదు. ఎవరూ తనతో మాట్లాడకూడదు. తనలో తానే మాట్లాడుకోవాలి. తనకు తానుగానే ఉండాలి. ఉరిశిక్ష కన్నా తీవ్రమైన శిక్ష ఇది. మరణం కన్నా మహావేదన భరిత శిక్ష ఇది. కొద్దిసేపు తనచుట్టూ ఉన్నవారు మాట్లాడకపోతేనే చిరాకు వేస్తుంది. మనసు ఉక్కపోతగా ఉంటుంది. ఆ ఉరిశిక్షను అమలు చేసిన దానికంటే ఎక్కువ తీవ్రతగా ఉంటుంది. అసలు ఉరిశిక్ష ఖరారు చేస్తే బావుండు అన్న మానసిక ఒత్తిడికి గురయ్యే భయానక వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు పోలేపాక ప్రవీణ్‌ది అదే స్థితి. ఆ మాటకు వస్తే ఉరిశిక్ష పడిన ఎవరికైనా ఇదే దుస్థితి. జైలు మ్యాన్యువల్స్ ప్రకారం ఉరిశిక్ష పడిన ఖైదీని ఒంటరిగా ఉంచాలనే లాంఛనాలను అనుసరిస్తున్నారు జైలు అధికారులు. అయితే మిగితా ఖైదీలకు పెట్టే ఆహారమే ఉరిశిక్ష పడిన ఖైదీకి అందిస్తున్నారు. మిగాతా ఖైదీల మాదిరిగా కాకుండా అనారోగ్యం పాలైతే ఖైదీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డాక్టరే ఖైదీ దగ్గరికి వెళ్తాడు. అంతేకాదు ఉరిశిక్ష పడిన ఖైదీని ఉంచిన సింగిల్ బ్యారెక్ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గార్డ్ ఉంటారు. జైలర్ పర్యవేక్షణలో గార్డ్ డ్యూటీ రౌండ్ ది క్లాక్ (24 గంటలు) షిఫ్టుల వారీగా ఖైదీ ప్రవర్తనను కనిపెట్టుకుంటూ ఉంటారు.

వరంగల్ కేంద్ర కారాగారానికి ఇదే ఫోక్స్ చట్టంలో ఉరిశిక్షపడిన ఖైదీ కరీంనగర్ నుంచి వచ్చాడు. వెంకటస్వామి అనే ఖైదీకి 2016లో కరీంనగర్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఇక్కడికి పంపించారు. అయితే జైలు మ్యాన్యువల్స్ ప్రకారం అన్నీ లాంఛనాలు పూర్తయ్యే సరికి ఏడాది పట్టింది. జాతీయ స్థాయికి వెంకటస్వామి వెళ్లకముందే రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును పునఃసమీక్షించి యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ తిరిగి తీర్పు ఇచ్చింది. ఇది 2017లో జరిగింది. అంటే కేవలం ఏడాదిపాటు ఇది కొనసాగింది. సంవత్సరకాలం పాటు వెంకటస్వామి ఒంటరి ఖైదీగా సింగిల్ బ్యారెక్‌లోనే ఉన్నాడు. అయితే వెంకటస్వామి ఉదంతానికి, పోలేపాక ప్రవీణ్ ఉదంతానికి మధ్య ఫోక్స్ చట్టం ప్రకారం నమోదైన కేసు, విధించిన శిక్ష ఒకటే అయినా అత్యంత హేయంగా ప్రవీణ్ వ్యవహరించాడని దేశమంతా అట్టుడికిన నేపథ్యంలో ఈ కేసు ఎలా ఉంటుంది? వెంకటస్వామి విషయంలో తన బంధువులు కలిసి వచ్చి బాసటగా నిలిచారు. కానీ ప్రవీణ్ ఉదంతం అందుకు భిన్నం.

ప్రవీణ్‌ను ఇల్లు, ఇంటివాళ్లు వెలేశారు. బంధువులు బంధూకు వంటి చూపులతో ఛీదరించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జైలు మ్యాన్యువల్స్ ప్రకారం నడుచుకోవలసింది. ఆ తీర్పు అమలుకు లేదా పునఃసమీక్షకు యేడాది పట్టొచ్చు, రెండేండ్లు పట్టొచ్చు అంతకన్నా ముందే తేలిపోవచ్చు. అప్పటి దాకా ప్రవీణ్ అనే ఉన్మాది తను చేసిన ఘాతుకానికి వేలరెట్ల ఒంటరిశిక్షను అనుభవించాల్సిందే. ఊహిస్తే ఉరికన్నా భయంకరమైన శిక్ష. ఏం జరుగుతుందో చూడాలి. ఉరిశిక్ష అమలు అవుతుందా? ఎప్పుడు అమలు అవుతుంది అన్న ఉత్కంఠ కొనసాగాల్సిందే...!

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...