జాబ్‌మేళా సక్సెస్


Sun,July 21, 2019 01:44 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జూలై 20 : సీమాంధ్ర పాలకుల వివక్షతతో తెలంగాణలో పెరిగిన నిరుద్యోగతను సమగ్రం గా తగ్గించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట ని యోజకవర్గ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి జాబ్‌మేళాకు ఆయన హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి జాబ్‌మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇటీవల పాలకుర్తి నియోజకవర్గస్థాయి, ప్రస్తుతం వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి మేళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో క్రమంగా అన్ని నియోజకవర్గాల స్థాయిలో కూడా డీఆర్డీఏ ద్వారా జాబ్‌మేళాలను నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తనను ఆదరించిన పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలు రెండు కళ్లలాంటివని ఆయన అన్నారు. అందుకనే పాలకుర్తిలో జాబ్‌మేళాను ఏర్పాటు చేయగానే ఎమ్మెల్యే రమేశ్ కోరిక మేరకు వెంటనే వర్ధన్నపేటలో జాబ్‌మేళాను ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే పేరున్న 36 కంపెనీల ప్రతినిధులను ఈ మేళాకు ఆహ్వానించినట్లు చెప్పారు. నిరుద్యోగులు విధిగా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని ఉద్యోగాలు సాధించుకోవాలని సూచించారు.

2వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాట్లు
తొర్రూరులో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు 11 వేల మంది నిరుద్యోగులు హాజరైనట్లు చెప్పారు. వీరిలో 7 వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినట్లు గుర్తు చేశారు. వర్ధన్నపేటలో ప్రస్తుతం 6 వేల మంది వరకు నిరుద్యోగులు వచ్చినట్లు తెలుస్తున్నదన్నారు. వీరిలో 3 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. మేళాలో ఉద్యోగాలు సా ధించలేని నిరుద్యోగులకు మూడు నెలల పాటు భోజనం, వసతిని ఏర్పాటు చేసి మూడు నెలలపాటు వ్యక్తి గత నైపుణ్యతను పెంచేందుకు ఉచితంగా శిక్షణ కూడా డీఆర్డీఏ ద్వారా ఇప్పించనున్నట్లు వెల్లడించారు. ఏ మాత్రం నిరుద్యోగులు అధైర్యపడవద్దని ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే తక్కువ జీతం వస్తుందని, దూర ప్రాం తాల్లోని పట్టణాలలో ఉద్యోగాలు చేసేందుకు ఏమాత్రం భయపడొద్దని సూచించారు. కొంతకాలం కష్టపడితే క్రమంగా జీతా లు పెరిగి తల్లిదండ్రులు గర్వించేలా జీవిస్తారని ఎర్రబెల్లి వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి కూడా అవకాశం ఉన్న కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు డీఆర్డీఏ సిద్ధంగా ఉందన్నారు. ఈ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

వర్ధన్నపేట అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు
నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి నిధు లు మంజూరు చేయిస్థానని మంత్రి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. జాబ్‌మేళా కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మంజూరైన మరో రూ.10కోట్లకు సంబంధించిన ప్రొసీడింగ్‌ను ఎమ్మెల్యే రమేశ్‌కు సమావేశంలో అందజేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే వర్ధన్నపేట పట్టణంతో పాటుగా విలీనంగా ఉన్న తండాల అభివృద్ధి కోసం రూ.20 కోట్ల మేరకు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కోరిక మేరకు మరో రూ.10 కోట్లను కూడా మంజూ రు చేసినట్లు చెప్పారు. ఇవేకాకుండా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అవరమైన ఎన్ని నిధులైనా మంజూరు చేయిస్తానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. తనకు రాజకీయ జన్మనిచ్చి తల్లిలా ఆదరించిన వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎప్పటికీ మరిచిపోనని ఆయన అన్నారు. కాగా, వర్ధన్నపేట అభివృద్ధికి రూ.30 కోట్లను మంజూరు చేయించిన మంత్రి దయాకర్‌రావుకు ఎమ్మెల్యే రమేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీచైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ హరిత, డీఆర్డీవో సంపత్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ, అర్బన్ జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీలు అప్పారావు, మార్నేని మధుమతి, జెడ్పీటీసీలు మార్గం భిక్షపతి, సింగ్‌లాల్, కార్పోరేటర్ చింతల యాదగిరి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, వివిధ విభాగాల అధికారులు, రాష్ట్రంలోని వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు.

ఏజీఎఫ్ శిక్షణతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జూలై 20 : నిరుద్యోగ సమస్యను నిర్మూళిస్తేనే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందనే లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం లో డీఆర్డీఏ, ఈజీఎంఎంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, ఎమ్మెల్యే రమేశ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర యువతకు గత సీమాంధ్ర పాలకులు ఉద్యోగాలు కల్పించకపోవడం మూలంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య జఠిలంగా మారిందన్నారు. దీనిమూలంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు, నీళ్లు, నియమకాల పేరుతో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర అభివృద్ధికి భారీగా నిధులను వాడుకోవడంతో పాటుగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో సాగునీటిని కూడా త్వరలోనే కోటి ఎకరాల మాగాణికి తరలించుకోనున్నామని అన్నారు. అలాగే నియమాకాలు కూడా చేపట్టాలనే లక్ష్యంతో సీం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా అనేక ప్రైవేట్ కంపెనీలలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రధానంగా మంత్రి దయాకర్‌రావు సహకారంతో వర్ధన్నపేటలో జాబ్‌మేళా నిర్వహించి మూడు వేల మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలి : జెడ్పీచైర్ పర్సన్ గండ్ర జ్యోతి
జాబ్‌మేళా కార్యక్రమాన్ని పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల తరహాలో అన్ని నియోజకవర్గాలలో కూడా ఏ ర్పాటు చేయాలని జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావును కోరారు. జాబ్‌మేళా ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడుతూ చదువుకున్న యువతకు ప్ర భుత్వం పూర్తిస్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం వీలుకాదన్నారు. అందుకని ప్రైవేట్ కంపెనీలలో కూడా మంచి వేతనాలు, గౌరవాలు ఉన్నందున నిరుద్యోగులు వ్యక్తిగత నైపుణ్యతను పెంచుకొని ఉద్యోగాలు సంపాదించుకోవాలని సూచించారు. ఇదేతరహాలో మంత్రి చొరవ తీసుకొని అన్ని నియోజకవర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా డీఆర్డీఏ ద్వారా జాబ్‌మేళాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు.

వ్యక్తిగత నైపుణ్యం సాధించాలి : కలెక్టర్ హరిత
గ్రామీణ ప్రాంతాల్లోని యువత వ్యక్తిగత నైపుణ్యత సా ధించాలని వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత సూచించారు. కొంత మంది యు వతీ యువకులు పెద్ద చదువులు చదివినప్పటికీ ఇంటర్వ్యూలు జరిగే సమయంలో ఇబ్బంది పడడం వల్ల ఉద్యోగాలు రాకుండా పోతున్నాయ న్నారు. అందుకని యువతీ, యువకులు ఏవిధంగా ఇంటర్వ్యూలకు హాజరై కంపెనీ ప్రతినిధులను ఆకట్టుకోవాలనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉద్యోగాలు రానివారు ఏమాత్రం నిరుత్సాహ పడకుండా తిరిగి డీఆర్డీఏ ఏర్పాటు చేసే శిక్షణకు రావాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మహేందర్‌జీ, ఈడీ మధూకర్, ఏపీడీ పరమేశ్వర్, ప్రజాప్రతినిధులు అన్నమనేని అప్పారావు, మార్నేని మధుమతి, మార్గం భిక్షపతి, సింగ్‌లాల్, అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...