బాలింత మృతితో బంధువుల ఆందోళన


Fri,July 19, 2019 03:52 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జూలై 18 : వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి దుబ్బతండాకు చెందిన ధరవాత్ దివ్య(32) ప్రసవం కోసం బుధవారం వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. బుధవారం రాత్రి దివ్య కు నొప్పులు రావడంతో వైద్యులు సిజేరియన్‌తో ప్రసవం చేశారు. బిడ్డకు ఇబ్బందిగా ఉండడంతో వరంగల్‌కు తీసుకువెళ్లాని డాక్టర్లు సూచించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు బిడ్డను వరంగల్‌కు తీసుకువెళ్లారు. తల్లిని ఇక్కడే ఉంచి వైద్య పరీక్షలు చేశారు. కానీ, అర్ధరాత్రి వరకు దివ్య పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే దివ్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల గురువారం మధ్యాహ్నం మృతి చెందిందని మృతురాలి బంధువులు తెలిపారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే దివ్య మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం రాస్తారోకో చేశారు. రహదారిపై ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సీఐ శ్రీనివాస్, ఎస్సై సంపత్ సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి కుటుం బ సభ్యులు, బంధువులను ఒప్పించి రాస్తారోకోను విరమింప చేశారు. కాగా ఈ విషయంపై దరఖాస్తు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వామి వివరణ ఇస్తూ బాలింత దివ్యకు అకస్మాత్తుగా ప్లేట్‌లేట్స్ పడిపోయాయని చెప్పారు. ప్రసూతి తర్వాత డ్యూటీ డాక్టర్లు మెరుగైన చికిత్స అందించి బిడ్డను ఎంజీఎంకు రెఫర్ చేశారని వివరించారు. వేల మందిలో ఒకరికి ఇలాం టి ప్రసవం తర్వాత ఇలా జరుగుతుందని చెప్పారు. దివ్య కు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి పొరపాట్లు చేయలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వామి వివరించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...