ఘనంగా మహంకాళి బోనాలు


Mon,July 15, 2019 02:58 AM

హసన్‌పర్తి, జూలై 14: మండల కేంద్రంలోని మహంకాళి దేవాలయం ఆవరణలో బోనాల జాతర కోలాహలంగా సాగింది. శివసత్తులు సాయిలింగమూర్తి, శివ, సావిత్రి, సమ్మక్క, వనక్కలు పూనకాలతో బోనమెత్తి కోలాటమాడుతూ ఉరేగింపుగా మహంకాళి ఆలయం వరకు చేరుకున్నారు. గ్రామంలోని వివిధ కులాలకు చెందిన భక్తులు బోనాలతో అమ్మవారికి మొక్కులు సమర్పించారు. దేవాలయ ప్రాంగణంలో శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్థానిక కార్పొరేటర్‌ నాగమల్ల ఝాన్సీలక్ష్మీ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ సాంప్రదాయ పండుగలకు పెద్ద పీట వేశారని తెలిపారు. ఆలయ భూములు కబ్జాకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే ఆలయాల పునరుద్ధరణ చేపట్టడం జరుగుతుందన్నారు. మహంకాళి ఆలయ భూమి కబ్జాకు గురికాకుండా కబ్జాదారులపై వేటు వేసిందన్నారు. ఆ స్థలాన్ని కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే కబ్జాకు గురైన స్థలంలో డబ్బాలను, ఇతర వస్తువులను కార్పొరేషన్‌ సిబ్బందితో తొలగించడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో దేవాలయ భూమి కబ్జాకు గురికాకుండా చుట్టూ ఫెన్షింగ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కార్యక్రమంలో వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్‌ అనుమాండ్ల విద్యాసాగర్‌, భక్తమార్కండేయ దేవస్థానం ఆలయ పూజారి గురుమూర్తి భద్రదేవ్‌, కమిటీ సభ్యులు సట్కూరి సంతోష్‌రాజ్‌, పోరండ్ల శ్రీకాంత్‌, గడ్డం వెంకటేశ్వర్లు, గురుమూర్తి శివకుమార్‌, దేవులపల్లి ప్రమోద్‌, రవిందర్‌, వెంకటేశ్వర్లు, కుమారస్వామి, టీఆర్‌ఎస్‌ నాయకులు నాగమల్ల సురేశ్‌, పెద్దమ్మ శ్రీనివాస్‌, వల్లాల గణేష్‌ పాల్గొన్నారు.
పోలీసు బందోబస్తు నడుమ వేడుకలు
మండల కేంద్రం బస్టాండు సమీపంలోని మహంకాళి దేవాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన బోనాల జాతరకు స్థానిక ఇన్‌స్పెక్టర్‌ తిరుమల్‌ పర్యవేక్షణలో పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. కార్పొరేటర్‌ నాగమల్ల ఝాన్సీలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో బురద లేకుండా ఆలయం చుట్టూ క్రషర్‌ డస్ట్‌ పోయించి శుభ్రం చేశారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...