అక్రమ లే ఔట్లు


Fri,July 12, 2019 02:18 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో అక్రమ లే ఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అడ్డగోలుగా స్థిరాస్తి మోసాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. ఈ అక్రమ లే ఔట్లను అరికట్టాల్సిన వరంగల్ మహానగరపాలక సంస్థ, మున్సిపల్, గ్రామపంచాయతీల అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నులు రాకుండాపోతున్నాయి. రియల్టర్ల చేతుల్లో వేతనజీవులు, మధుపరులు నిలువునా మోసపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపానపోవడం లేదు. జిల్లాలోని గూడెప్పాడ్ నుంచి భూపాలపల్లి వరకుగల జాతీయ రహదారి వెంట, వరంగల్ నుంచి నర్సంపేట వరకు గల రాష్ట్ర రహదారుల వెంట, వరంగల్ నుంచి వర్ధన్నపేట మీదుగా ఖమ్మం వెళ్లే రహదారుల వెంట ఇరువైపులా అక్రమ లేఔట్లు కనిపిస్తున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

సాగు భూములను ప్లాట్లుగా మార్చి..
జిల్లాలోని రియల్టర్లు, బ్రోకర్లు ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములను గ్రామీణ ప్రజల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా లే ఔట్లు చేస్తున్నారు. ప్రధానంగా నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిల్లో అక్రమ లేఔట్లు వెలుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు గా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల సాగు భూములను ప్లా ట్లుగా మార్చి అన్ని అనుమతులు ఉన్నట్లు భ్రమింపజేసి వే తన జీవులు, మధుపరులకు అమ్ముతున్నారు. తీరా ప్లాట్లు కొనుగోలు చేసి నిర్మాణాల అనుమతుల కోసం మహానగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు వెళ్తే అసలు విషయం బయటపడుతుండడంతో కొనుగోలుదారులు, మధుపరులు లబోదిబోమంటున్నారు.

జాతీయ రహదారి పక్కనే ఉండడంతో..
నిబంధనల ప్రకారం వెంచర్లు చేయకుండా అక్రమ లేఔట్లను ఏర్పాటు చేసుకుని కొనుగోలుదారులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయించింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గకేంద్రాల్లో గల మున్సిపాలిటీలు జాతీయ రహదారులపైనే ఉండడం, అభివృద్ధికి నిధులు రావడంతో ఈ వెంచర్ల వ్యవహారం కూడా పెరిగిపోతున్నది. శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి వేతనజీవులు, మధుపరులు ప్లాట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్ అవసరాలకు, పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల రెండుమూడేళ్లలో రెట్టింపు లాభం వస్తుందనే ఆలోచనతో రహదారుల వెంట వెలిసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే మోసపోకతప్పదంటున్నారు కొనుగోలుదారులు. ప్రధాన రహదారుల వెంట నిత్యం లేఔట్లు, క్రయవిక్రయాలు, మధ్యవర్తుల వాహనాలు, కొనుగోళ్లు, అమ్మకాల సందడి, రహదారుల వెంట అక్రమ లేఔట్లపై జరుగుతున్న పంచాయితీలు నిత్యం కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంతో కొనుగోలుదారులు ఇబ్బందులుపడుతుండగా మధ్యవర్తులు కమీషన్ల కోసం మాయమాటలు చెప్పి బోల్తా కొట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వీటిని నియంత్రించాల్సిన ప్రణాళికావిభాగాలు, పంచాయతీల కార్యదర్శులు పట్టించుకున్న పాపానపోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భూముల ధరలకు రెక్కలు..
జిల్లాలోని రహదారుల వెంట సాగుభూములను కొనుగోలు చేసి లేఔట్లతో ప్లాట్లను చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన ఈ అక్రమ లేఔట్లు వల్ల రాళ్లతో దర్శనమిస్తున్నాయి. దీనికితోడు మున్సిపాలిటీలకు నిధులు వరదలా వెల్లువెత్తడం, అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతుండడం, వరంగల్-నర్సంపేట రహదారికి సమీపంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకావడంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రూ. 30 లక్షలున్న ఎకరం భూమి రూ.కోటికి పెరిగింది. ఇప్పుడు కాస్త ఎకరానికి రూ.2 కోట్లకు చేరింది.

హడావుడే కానీ... చర్యలు ఏవీ..
జిల్లాలో అక్రమ లే ఔట్లపై ఫిర్యాదులు అందినప్పుడు హడావుడి చేసే మహానగరపాలక సంస్థ, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల అధికారులు, రహదారుల వెంటగల గ్రామపంచాయతీల సిబ్బంది హడావుడి చేయడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ ములుగురోడ్డు నుంచి కటాక్షపూర్ వరకుగల రహదారిపై ఇటీవల హడావుడి చేసిన అధికారులు.. ఆ తర్వాత చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

అక్రమ లేఔట్ల సర్వేనంబర్లను రిజిష్టర్ కార్యాలయాల్లో అందజేసి, సాగు భూములను లేఔట్ ప్లాట్లుగా రిజిష్టర్ చేయకుండా బ్లాక్ లిస్టులో పెట్టించాల్సిన అధికారయంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ లే ఔట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...