నిందితుడిని వెంటనే ఉరితీయాలి


Thu,June 20, 2019 03:34 AM

రెడ్డికాలనీ, జూన్ 19: అభం.. శుభం తెలియని 9 నెలల చిన్నారి శ్రీహితపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడు ప్రవీణ్‌ను వెంటనే నడిరోడ్డులో ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం హన్మకొండలోని అశోకా జంక్షన్‌లో పలు సంఘాల నాయకులు పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు. అత్యాచారం, హత్య చేసిన నిందుతుడిని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల నాయకులు, పలు సంఘాల నాయకులు, యువకులు, స్థానిక ప్రజ లు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్లకార్డులు పట్టుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. అశో కా జంక్షన్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించి ఎక్కడికక్కడే వాహనాలను నిలిపివేశారు. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న హన్మకొండ ఏసీపీ శ్రీధర్, ఇన్‌స్పెక్టర్ ఆవిర్నేని సంపత్‌రావు, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌తో పాటు సుబేదారి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు. హన్మకొండ ఏసీపీ శ్రీధర్ చిన్నారి శ్రీహిత తల్లిదండ్రులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నాలు చేసినా వారు వినలేదు. వాహనదారులకు ఇబ్బందులు కల్గకుండా రాస్తారోకోను విరమించాలని కోరారు. నిందితుడిని నడిరోడ్డులో ఉరితీయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటసేపు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వివిధ మార్గాల్లో డైవర్షన్ చేశారు.

మోహరించిన భారీ బలగాలు..
అశోకా జంక్షన్‌లో భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. సుమారు గంటకుపైగా రాస్తారోకో చేయడంతో ఆందోళనకారులను తొలగించేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హన్మకొండ, సుబేదారి పోలీసులతో పాటు ఇతర పోలీసు బలగాలు దిగాయి. పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసి ప్రయత్నాలు చేసినా వారు వినలేదు. చిన్నారికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లమని రాస్తారోకో చేపట్టారు. హన్మకొండ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నాలు చేశారు. మహిళా సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ప్రవీణ్‌ను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
చిన్నారి శ్రీహిత మృతదేహాన్ని సాయంత్రం అంత్యక్రియలకు తీసుకెళ్లే క్రమంలో హన్మకొండ పోలీస్‌స్టేషన్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిందితుడు ప్రవీణ్‌ను ఉరితీసేవరకు చిన్నారికి దహనసంస్కారాలు చేయమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ ఎదుట చిన్నారి మృతదేహంతో భీష్మించుకుని కూర్చున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒకదశ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మృతదేహంతో పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని గేట్లు మూసివేశారు. ఆందోళనకారులను శాంతింపజేసి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినా వినకుండా ఆందోళనకారులు వీ వాంట్ జస్టీస్, పోలీస్ కమిషనర్ రావాలి నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు. నిండితుడిని ఉరితీసేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితుడి తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసులు తగిన న్యాయం చేస్తాం, నిందితుడికి శిక్షపడే విధంగా చూస్తామని తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చిన్నారి మృతదేహానికి పద్మాక్షికాలనీలోని గంగపుత్ర సంఘం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...