మహాఘట్టానికి కౌంట్‌డౌన్!


Wed,June 19, 2019 02:27 AM

జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ మహా ఘట్టానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోమశాలలు, హెలీప్యాడ్‌లు, రహదారులు, శిలాఫలకాల నిర్మాణ పనులు జెట్ స్పీడ్‌తో సాగుతున్నాయి. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ప్రారంభోత్సవ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్, తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవానికి హాజరు కానున్న దరిమిలా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం ఉదయం ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు, ఇతర ప్రముఖులు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ జరిగే హోమంలో పాల్గొని బ్యారేజీ గేట్లు ఎత్తి ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తారని అధికారులు చెబుతున్నారు. అనంతరం కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు చేరుకొని, హోమంలో పాల్గొంటారు. పంపుహౌస్ మోటర్ల వెట్న్ ప్రారంభిస్తారు. వెంటనే ఈ పంపుహౌస్ నుంచి మోటర్లు గోదావరి నీటిని ఎత్తిపోసే డెలివరీ సిస్టం వద్దకు చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 13 హెలీప్యాడ్‌లను సిద్ధం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏడు హెలీప్యాడ్‌లు రెడీ అవుతున్నాయి. ఈ బ్యారేజీ వద్ద ప్రస్తుతం రెండు హెలీప్యాడ్‌లు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా మరో ఐదు హెలీప్యాడ్‌లను అధికారులు నిర్మిస్తున్నారు. బ్యారేజీ వ్యూ పాయింట్ వద్ద హోమశాల నిర్మాణ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు మేడిగడ్డ బ్యారేజీలో ఏడు గేట్లు మూసివేసి గోదావరి జలాలను నిల్వ చేస్తున్నారు. వర్షం కురిస్తే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద అధికారులు బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద హెలీప్యాడ్‌ల నుంచి హోమశాల, బ్యారేజీ గేట్ల వరకు చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణ పనులు వాయువేగంతో కొనసాగుతున్నాయి. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద మంగళవారం శిలాఫలకం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

కన్నెపల్లి పంపుహౌస్ వద్ద..
కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద ఆరు హెలీప్యాడ్‌లను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మూడు హెలీప్యాడ్‌లు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా మరో మూడు హెలీప్యాడ్‌లు నిర్మిస్తున్నారు. పంపుహౌస్ వ్యూ పాయింట్ వద్ద మహాజల సంకల్ప యాగం కోసం హోమశాలను సిద్ధం చేస్తున్నారు. దీనికి గ్రానైట్ (పాలరాయి)ని వాడారు. వెట్న్ ప్రారంభం కోసం గోదావరిలో నిల్వ చేసిన నీటిని అప్రోచ్ కెనాల్ నుంచి హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఫోర్‌బేలోకి విడుదల చేశారు. నీటితో నిండిన పంపుహౌస్ ఫోర్‌బే ప్రస్తుతం నిండుకుండను తలపిస్తున్నది. పంపుహౌస్ వద్ద వెట్న్ ప్రారంభించిన తర్వాత సీఎంలు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు సమీపంలోని డెలివరీ సిస్టం వద్దకు చేరుకుంటారు. కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా మోటర్లు ఎత్తిపోసే గోదావరి నీటిని ఇక్కడ పరిశీలిస్తారు. దీనికోసం అధికారులు పంపుహౌస్ ప్రాంతంలో బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. పంపుహౌస్ నుంచి డెలివరీ సిస్టం వరకు, హెలీప్యాడ్‌ల నుంచి పంపుహౌస్ వరకు బీటీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద మంగళవారం శిలాఫలకం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తెలుగు, ఇంగ్లీష్‌లో తయారవుతున్న శిలా ఫలకాలను ఇక్కడ అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. కన్నెపల్లి పంపుహౌస్ హోమశాల వద్ద అతిథులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌లను సందర్శించి, ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పనుల ప్రోగ్రెస్‌ను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలిచ్చారు. ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి, కార్యనిర్వాహక ఇంజినీర్ రమణారెడ్డితో పాటు డీఈలు పలువురు వెంట ఉన్నారు.

మొహరించిన పోలీసులు
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ ప్రాంతాలు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సరిహద్దులో ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి దిగువన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉంది. గడ్చిరోలి, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులు తమ పార్టీ కార్యకలాపాలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. సరిహద్ధులో గోదావరి పరీవాహక ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ ఉండడంతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మీడియాతో సహా ఎవరినీ బ్యారేజీ ప్రాంతానికి వెళ్లనీయడం లేదు. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. డ్రోన్ కెమెరాలు, వాహన తనిఖీలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడవులను జల్లెడ పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో అనువనువూ గాలిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఐజీలు నవీన్‌చంద్, నాగిరెడ్డి, ప్రమోద్‌కుమార్, ఎంకే సింగ్, డీఐజీ రాజేశ్‌కుమార్, ఎస్పీ ఆర్ భాస్కరన్, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఇంటెలిజెన్సీ అడిషనల్ ఎస్పీ రవీందర్‌రావు, కాటారం, ఏటూర్‌నాగారం ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్‌చంద్రపవార్, ములుగు ఓఎస్‌డీ సురేష్‌కుమార్ తదితరులు డీజీపీ వెంట ఉన్నారు. భద్రతా ఏర్పాట్లపై వీరితో డీజీపీ మహేందర్‌రెడ్డి కన్నెపల్లి పంపుహౌస్ వద్ద సమావేశమై సమీక్షించారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బందోబస్తుపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...