ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి


Tue,June 18, 2019 02:38 AM

రెడ్డికాలనీ, జూన్ 17: తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద 12,270 దేవాలయాలు ఉన్నాయని వాటిని పరిరక్షించడానికి ఆధ్యాత్మిక భావనతో ఆలయాలు నిర్వహించుకునే విధంగా ఉండాలంటే పరిపాలన సౌలభ్యం కోసం ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో సీఎం కేసీఆర్‌ని గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు వల్లూరి పవన్‌కుమార్, జీవీఎస్ శ్రీనివాసాచారి, రాజ్‌కుమార్, పురుషోత్తం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఆలయాల్లో ధార్మిక భావన తగ్గి రాజకీయ వ్యవహారాలు ఎక్కువయ్యాయని దేవాదాయశాఖ అధికారుల అలసత్వంతో ఆలయాల వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి కనిపిస్తుందని, సక్రమంగా దేవాలయాల్లో నిర్వహణ జరగాలంటే భక్తుల్లో ఆధ్యాత్మిక భావన ఏర్పడి మానసిక ప్రశాంతంత కోసం దేవాలయాల్లోకి వచ్చేవిధంగా ఆగమశాస్త్ర ప్రకారంగా పూజా కార్యక్రమాలు కొనసాగాలంటే ధార్మిక పరిషత్ ఒక్కటే శరణ్యమన్నారు.

ఆధ్యాత్మిక భావన అర్చక లోకానికి వరంగా మారిందని 2015 జనవరి 9న శ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి సమక్షంలో అర్చక సదస్సులో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా అర్చక ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సెక్షన్ 144 ప్రకారం రూ.2 లక్షల ఆదాయం కల్గిన దేవాలయాలను అర్చకులకే వదిలేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో పురాతన దేవాలయాల్లో పనిచేస్తున్న ధూప, దీప, నైవేద్య అర్చకులకు పెరిగిన ధరల దృష్ట్యా రూ.6 నుంచి రూ.10 వేలకు పెంచాలని కోరారు. ఎందరో దాతలు దేవాలయాలకు, అర్చకులకు భూములు దానంగా అందజేశారని అర్చకుల ఆధీనంలో ఉన్న ఇనాం భూములను అర్చకులకే వదిలివేసి పట్టాదారు పాసుపుస్తకాలు అందించి గ్రామీణ సహకార బ్యాంకులలో రుణాలు అందించే విధంగా, రైతు బంధు పథకం కూడా ఈ ఇనాం భూమి అర్చకులకు అందించాలని వారు ఆ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ మఠాధిపతులు పీఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసుకుందామని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...