నియోజకవర్గానికో గురుకులం


Mon,June 17, 2019 03:33 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్వరాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు గుణాత్మకమై న విద్యను అందించాలనే సంకల్పంతో మహాత్మాజ్యోతిరావుఫూలే పేరున బీసీ గురుకులాలను నెలకొల్పుతున్నది. దీనిలో భాగంగానే ఇప్పటికే జిల్లాలో ఉన్న రెండు గురుకులాలకు తో డుగా జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మూడు గురుకులాలను మంజూరుచేసి ఈ విద్యాసంవత్సరంలోనే పేద విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటు గా విద్యాబోధనను కూడా అందించాలని సంకల్పించింది. ఈ మేరకు ఈ గురుకులాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లను పూర్తిచేసింది. 17వ తేదీ సోమవారం మంజూరుచేసిన మహాత్మా జ్యోతిరావుఫూలే బీసీ గురుకులాలను నేడు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. గతేడాది వరంగల్ రూరల్ జిల్లాలోని నెక్కొండ, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామాల్లో 5, 6, 7వ తరగతులతో ఈ గురుకులాలను ప్రారంభించింది. సత్ఫలితాలివ్వడంతో జిల్లాలోని వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలకు ఒక్కొక్క బీసీ గురుకులం చొప్పున మూడింటిని మంజూరు చేసింది. గతేడాది మంజూరు చేసిన నెక్కొండ, పెద్దాపూర్ గురుకులాలను ఈ విద్యాసంవత్సరంలో 8, 9వ తరగతులకు అప్‌గ్రేడ్ చేశారు. దీంతో 800 మంది విద్యార్థులు ఈ రెండు గురుకులాల్లో నిర్వహిస్తున్న 5, 6, 7, 8, 9 తరగతుల్లో 800మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు.

ఈ ఏడాది ప్రారంభించాలని సంకల్పించిన నియోజకవర్గానికో బీసీ గురుకులాల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి మంజూరైన బీసీ గురుకులాన్ని ఇదే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేస్తుండగా రూరల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గానికి మంజూరైన గురుకులాన్ని గిర్నిబావి వద్ద, పరకాల నియోజకవర్గానికి మంజూరైన పరకాల పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసి ప్రారంభించేందుకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కొత్తగా జిల్లాలో ప్రారంభమవుతున్న పరకాల, గిర్నిబావి గురుకులాల్లో 240 మంది విద్యార్థులు కొత్తగా చేరబోతున్నారు. 5, 6, 7వ తరగతులకు సంబంధించి ఒక్కొక్క తరగతికి 80 మంది చొప్పున మొత్తం 240మందికి ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్ విధానంలో హాల్‌టికెట్లను జారీచేసి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ కొలమానంగా పారదర్శకతే లక్ష్యంగా నిజమైన నిరుపేద బీసీ విద్యార్థులకు మేలు జరిగేలా ఎంపికను పూర్తి చేశారు. ఈ మేరకు గత ఏప్రిల్ నెలలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించిన అధికార యంత్రాంగం మార్కులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ ఎంపికను పూర్తిచేసింది. కొత్తగా ఏర్పాటయ్యే రెండు గురుకులాలు, గతంలో జిల్లాలో ఏర్పాటైన రెండు గురుకులాలతో కలిపి జిల్లాలో మొత్తంగా నాలుగు జ్యోతిరావుఫూలే బీసీ గురుకులాలు ఏర్పాటయ్యాయి. పరకాల, గిర్నబావిలలో మంజూరైన బీసీ గురుకులాలను అద్దె భవనాల్లో కొనసాగించనున్నారు. ఈ గురుకుల పాఠశాలలను నేడు (సోమవారం) ఉదయం 10 గంటలకు గిర్నిబావిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరిత, బీసీ సంక్షేమ అధికారి నర్సింహస్వామి తదితర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభిస్తారు. పరకాల పట్టణంలో ఏర్పాటయ్యే గురుకులాన్ని అక్కడి శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఇదేరోజు సాయంత్రం 3గంటలకు ప్రారంభించనున్నారు. పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని, కార్పొరేట్ విద్యను అందించేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ గురుకులాల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ గురుకులాల్లో చదివే విద్యార్థులకు సకల సౌకర్యాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తున్నది. గతేడాది ప్రారంభమైన ఈ గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు క్రీడా, యోగా, సాంస్కృతిక రంగాల్లో ఆ గురుకులాల విద్యార్థులు కనబరుస్తున్న ప్రతిభను చూసి మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకులాల్లో చేరేందుకు పోటీపడుతున్నారు. దీంతో గతేడాదికన్నా ఈ ఏడాది ఎంట్రన్స్ రాసిన విద్యార్థులు ఒక్క సీటుకు 5 నుంచి 10మంది పోటీపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.

విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు..
మహాత్మాజ్యోతిరావుఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో గుణాత్మక విద్యతోపాటుగా పుస్తకాలు, నోటు పుస్తకాలు, నిర్ధేశిత యూనిఫాంలు, బెడ్డింగ్ మెటీరియల్, ట్రాక్‌సూట్లు, పెన్నులు, పెన్సిల్‌లు, జామెట్రీ బాక్సులను కూడా ఉచితంగా అందిస్తారు. అవసరమైన కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, క్రీడాసామగ్రి అందుబాటులో ఉంచుతారు. మగ, ఆడ పిల్లలకు ప్రతీ నెల కాస్మోటిక్ చార్జీలను అందజేయడంతోపాటు పౌష్టికాహారాన్ని మెనూప్రకారం అందజేస్తారు. ఆట, పాటలు, నూతన పద్ధతుల్లో విద్యాబోధన ఈ గురుకులాల ప్రత్యేకత.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...