నకిలీ విత్తనాలు నిల్వ చేస్తే చర్యలు


Sat,May 18, 2019 01:52 AM

-వర్ధన్నపేట ఏడీఏ సురేశ్‌కుమార్
పర్వతగిరి : నకిలీ విత్తనాలు నిల్వ చేసి అమ్మకాలు చేస్తే లైసెన్స్ రద్దు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట సహాయ వ్యవసాయ శాఖ సంచాలకులు వీ సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం వ్యవసాయ కార్యాలయంలో జరిగిన పర్వతగిరి, రాయపర్తి మండలాల ఫర్టిలైజర్స్ డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు నాణ్యమైన సేవలను అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. బిల్‌బుక్కులు, రికార్డుల నిర్వహణ సమగ్రంగా ఉండాలని కోరారు. సదస్సులో ఏవో ప్రశాంత్‌కుమార్, వీరభద్రం, వ్యవసాయ విస్తర్ణాధికారులు, డీలర్లు పాల్గొన్నారు.
అనుమతి లేని విత్తనాలు విక్రయించొద్దు పరకాల ఏడీఏ విద్యాసాగర్
పరకాల, నమస్తే తెలంగాణ : అనుమతి లేని విత్తనాలను రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఏడీఏ విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలోని స్వర్ణగార్డెన్స్‌లో పరకాల, నడికూడ మండలాల్లోని విత్తన, పురుగు మందుల డీలర్లతో ఏవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ పత్తి విత్తనాలు బీజీ-3 అనుమతి వాటిని తీసుకొచ్చి విక్రయించొద్దని అన్నారు. ప్రతీ షాపుల నిర్వాహకులు స్టాకుబోర్డులో ధరల పట్టిక, స్టాకు వివరాలను కనపడే విధంగా ప్రదర్శించాలని చెప్పారు. అధిక ధరలకు విక్రయాలు చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.

వ్యాపారులూ.. లాభాపేక్ష వద్దు..
రాయపర్తి : మండలంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో నకిలీలను ప్రోత్సహించ వద్దని, నకిలీలను ప్రోత్సహించే దుకాణాలు, వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జలగం లక్ష్మణ్‌రావు హెచ్చరించారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులను రైతులకు అంటగట్టే ప్రమాదం పొంచి ఉందన్నారు. మండలంలో ఉన్న సీడ్స్, ఫర్టిజర్స్, పెస్టిసైడ్స్ దుకాణాల వ్యాపారులు అధిక లాభాపేక్షకు పోయి ముప్పును కొని తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. ఎవరైనా వ్యక్తులు విత్తనాలు, పురుగు మందులు విక్రయాలు జరిపించేందుకు వచ్చినట్లయితే వెంటనే సమాచారం అందించాల్సిందిగా కోరారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ కాన్ఫరెన్స్‌లో సూచించినట్లు ఆయన వివరించారు. సమావేశంలో ట్రైనీ ఎస్సై నండ్రూ సాయిబాబు, ఏఎస్సైలు లింగారెడ్డి, సదయ్య పాల్గొన్నారు.

రైతులు బిల్లులు తీసుకోవాలి
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : మార్కెట్‌లో నకిలీ విత్తనాలు రాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్సై బండారి సంపత్, ఏవో రాంనర్సయ్య అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ఎస్సై, ఏవో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా తీసుకునే చర్యలకు రైతులు సహకారం అందించాలని సూచించారు. డీలర్లు ఏమాత్రం తప్పుడు విధానాలకు పాల్పడి నకిలీ విత్తనాలను విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా గుర్తింపు పొందిన కంపెనీలకు సంబంధించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయడంతో పాటు దుకాణదారుడి నుంచి విధిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆయా గ్రామాల ఏఈవోలు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు : నెక్కొండ సీఐ
నెక్కొండ : ఫర్టిలైజర్ షాపుల యజమానులు నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నెక్కొండ సీఐ పెద్దన్న కుమార్ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి బంజరుపల్లిలోని ఫర్టిలైజర్ షాపులను సీఐ తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్స్‌ను పరిశీలించారు. తనిఖీల్లో ఎస్సై నవీన్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...