అభినందనల వెల్లువ..


Fri,April 26, 2019 01:37 AM

జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ:విధుల నిర్వహణలో చిత్తశుద్ధి కనబర్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు తమ కృషికి గుర్తింపు లభించడంతో ఖుషీ అవుతున్నారు. నీతి అయోగ్ అభివృద్ధి ర్యాంకింగ్‌లో జిల్లా ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీతి అయోగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంపికైన 115 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి ర్యాంకింగ్‌లో జిల్లా అగ్రభాగాన నిలిచేందుకు పని చేసిన జిల్లాలోని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అలాగే నీతి అయోగ్ ర్యాంకింగ్‌లో జిల్లాకు ప్రథమ స్థానం వచ్చేందుకు దోహదపడిన కలెక్టర్ వెంకటేశ్వర్లుకు, ఆయన మార్గదర్శకత్వంలో పని చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అభినందనలు తెలియజేస్తూ గురువారం ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన జిల్లాలుగా గుర్తించబడి విద్య, వైద్య, పౌష్టిక ఆహారం, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆర్థిక సాధికారత, నైపుణ్య శిక్షణ, మౌళిక వసతుల కల్పనలో అభివృద్ధిని సాధించేందుకు నీతి అయోగ్ ద్వారా దేశంలో ఎంపికైన 115 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 4జిల్లాలు ఎంపిక కాగా.. వాటిలో జయశంకర్ భూపాలపల్లి ఒకటి. నీతి అయోగ్ జిల్లాకు అందజేసిన నిధులను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నిరంతర పర్యవేక్షణలో సద్వినియోగం చేసుకొని.. నీతి అయోగ్ నిర్ధేశించిన రంగాల్లో అభివృద్ధిని సాధించడంలో జిల్లా అధికార యంత్రాంగం విజయవంతమైంది. దీంతో నీతి అయోగ్ అభివృద్ధి ర్యాంకులో 2019 మార్చి నెలకు గాను.. జయశంకర్ జిల్లా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

కలెక్టర్ పకడ్బందీ ప్రణాళికలతో..
నీతి ఆయోగ్ అభివృద్ధి ర్యాంకింగ్స్‌లో జిల్లా మొదటి స్థానంలో నిలిచేందుకు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమల్లో పెడుతున్నారు. ఆయన గత ఆగస్టు 31న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో నీతి అయోగ్ అభివృద్ధి ర్యాంకింగ్‌లో జిల్లా దేశంలోని 115 వెనుకబడిన జిల్లాల్లో 86వ స్థానంలో ఉంది. కలెక్టర్ వెంకటేశ్వర్లు చొరవతో ఇటీవల నీతి అయోగ్ అభివృద్ధి ర్యాంకింగ్‌లో జిల్లా 35వ స్థానానికి చేరింది. చివరకు ఆయన కృషి ఫలించింది. దీంతో గత మార్చి నెలలో.. ఈ ర్యాంకింగ్స్‌లో జిల్లా దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో పని చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్లు పలువురి అభినందనలు అందుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలోని పలువురు పెద్దలు ఫోన్ ద్వారా కలెక్టర్ వెంకటేశ్వర్లుకు అభినందనలు తెలిపారు. నీతి అయోగ్ అభివృద్ధి ర్యాంకింగ్‌లో జిల్లా ప్రథమ స్థానం సాధించడంపై కలెక్టర్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ నీతి అయోగ్ అందించిన ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొని అత్యంత వెనుకబడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. జిల్లా మరింత అభివృద్ధి సాధించేందుకు అంకితభావంతో పని చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. మొత్తానికి నీతి అయోగ్ అభివృద్ధి ర్యాంకింగ్‌లో దేశంలో వెనుకబడిన 115 జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రథమ స్థానం సాధించడం పట్ల జిల్లాలోని అధికారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...