సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలి


Thu,April 25, 2019 03:25 AM

న్యూశాయంపేట, ఏప్రిల్ 24: ప్రతీ కుటుంబం తమ పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని, దీనిని తమ బాధ్యతగా తీసుకోవాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఉద్భోదించారు. వరంగల్ హంటర్ రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాల్‌లో బుధవారం మహోపాధ్యాయ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల 94వ తిరునక్షత్రోత్స వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆచార్యస్వామి వారి తిరునక్షత్రోత్సం ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సముద్రాల శఠగోపాచార్యులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సత్సంప్రదాయ సభకు ముఖ్యఅతిథులుగా చినజీయర్ స్వామితో పాటు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్రరామానుజ జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీసంపత్కుమార రామనుజ జీయర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. రఘునాథాచార్యులు లేకుండా మొదటిసారి తిరునక్షత్రోత్సం జరుపుకుంటున్నామన్నారు. వారు భౌతికంగా మన మధ్య లేకున్నా జ్ఞాన స్వరూపంలో ఇక్కడే ఉన్నారని చెప్పారు. ప్రతీ గురువు తనలాంటి వారసులు కావాలని కోరుకుంటారన్నారు. వారి జ్ఞానాన్ని, వారు అనుగ్రహించిన గ్రంథాలను పది మందికి పంచాలన్నారు. గ్రంథాల్లోని విషయాలను ప్రవచన రూపంలోకి తేవాలనుకోవడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు విజ్ఞానానికి సంబంధించిన విషయాలను సాధారణ పద్దతుల్లో బోధించేవారని కొనియాడారు.

సంప్రదాయానికి మనం వారసులమని, భారతీయ విజ్ఞానానికి మనమే అధికారులమని అన్నారు. సంప్రదాయాలు ఇంకా జీవించి ఉండాలంటే అమ్మాయిలకు వాటి విలువను తెలియజేయాలని, ఇందుకోసం కన్యకా పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మొదటగా హైదరాబాద్, తరువాత ప్రతీ జిల్లాలో కన్యకా పాఠశాలలను ఏర్పాటు చేస్తే సంప్రదాయాలపై తాము అవగాహన కల్పిస్తామని వివరించారు. తదనంతరం మగపిల్లకు పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. రామానుజుల వారసులమైన మనం సంప్రదాయాల సంకల్పం చేసుకుని ముందుకుపోవాలన్నారు. అనంతరం కంచి శ్రీమాన్ పీబీ. రాజహంస స్వామి, ప్రొఫెసర్ నరసింహాచార్య స్వాములకు శ్రీరఘునాథదేశిక విశిష్ట పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సత్సంప్రదాయ పరిరక్షణ సభ అధ్యక్షులు సముద్రాల పురుషోత్తమాచార్యులు, ఆహ్వాన సంఘం కార్యదర్శి ఎలగందుల వదరారెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, నమిలిగొండ బాలకిషన్, శ్రీరాంగాచార్యులు, నరసింహాచార్యులు, మనోహారాచార్యులు, వనం లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...