ఉమ్మడి జిల్లాలో 18,01,344 పశు సంపద


Thu,April 25, 2019 03:24 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పశు సంపద వృద్ధి కోసం ప్రధాన దృష్టిసారించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా యాదవులకు గొర్రెల యూనిట్ల పంపిణీని విస్తృతంగా చేపట్టింది. పశుగ్రాసం కోసం సబ్సిడీ విత్తనాలు అందజేస్తుంది. ప్రధానంగా పశువులు, గొర్రెలు, మేకలకు మెరుగైన వైద్యం అందించడానికి సంచార వైద్యశాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన సమయంలో పశువులు, గొర్రెలు, మేకలకు తగు టీకాలు కూడా వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాడి కూడా రాష్ట్రంలో వృద్ధి చెందుతోంది. ఉమ్మడి జిల్లాలో గొర్రెలు, మేకలు, బర్రెల సంఖ్య గతంలో కంటే గణనీయంగా పెరిగింది. అదే సమయంలో కోళ్లు, బాతుల సంఖ్య కూడా పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి జిల్లాలో 20వ జాతీయ పశుగణన లెక్కల ప్రకారం పశు సంపద గణనీయంగా వృద్ధి చెందింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పశు గణన లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం పశు సంపద 14,30,492 ఉంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 20వ జాతీయ పశు గణనలో ఆ సంఖ్య 18,01,344కి చేరింది. 2011-12 ఆర్థిక సంవత్సరం కంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3,70,852 పశుసంపద పెరిగింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో పశువులు (ఆవులు, ఎద్దులు) 1,89,469, బర్రెలు 1,28,391, మేకలు 1,45,487, గొర్రెలు 2,93,914, కోళ్లు 6,65,247, పందులు 5,417, కుక్కలు 2,567 ఉన్నాయి. అదే 2018-19 ఆర్థిక సంవత్సరంలో జంతు గణన ప్రకారం పశువులు (ఆవులు, ఎద్దులు) 1,68,454, బర్రెలు 1,46,740, గొర్రెలు 1,28,916, మేకలు 1,51,559, కోళ్లు 8,96,289, పందులు 1943, కుక్కలు 5,831, బాతులు 1,612 ఉన్నాయి. ఈ సంఖ్య కొద్ది పాటిగా పెరిగే అవకాశం ఉందని జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి జిల్లా పశు వైద్యాధికారి ఎం బాలకృష్ణ నమస్తే తెలంగాణకు తెలిపారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...