ఆరు జెడ్పీలపై గులాబీ జెండా


Mon,April 22, 2019 03:09 AM

-పక్కా వ్యూహంతోఎన్నికల కార్యాచరణ
-టీఆర్‌ఎస్ ప్రాదేశిక పట్టు
-నేడే తొలి దశ నోటిఫికేషన్
-సమర్థులకే టికెట్లు
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: అదే ఒరవడి. అదే దూకుడు. అదే స్ఫూర్తి. అదే కార్యాచరణ. అదే సమన్వయం. వెరసి ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లపై గులాబీ జెండా రెపరెపలు. ఇదే గులాబీదారుల వ్యూహం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో అభిమానం. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న విశ్వాసం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఉన్న సానుకూల వైఖరిని టీఆర్‌ఎస్ శ్రేణులు పల్లెపల్లెనా గులాబీ జెండా ఎగురవేసేందుకు అనువైన మార్గాలుగా భావిస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి జిల్లాల పునర్విభజన అనంతరం ఆవిర్భవించిన ఆరు జిల్లాల్లోని 780 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), 71 జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) స్థానాలను టీఆర్‌ఎస్ సునాయాసంగా గెలుచుకుంటుందన్న వాతావరణం నెలకొన్నది. ప్రాదేశిక స్థానాలకు ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు.., అంతకుముందు వెలువడిన గ్రామ పంచాయతీ ఫలితాల్లా కచ్చితంగా టీఆర్‌ఎస్ వైపే మొగ్గుచూపుతాయనే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అక్కడక్కడా ఉనికి ఉన్నట్టు కనిపించినా.. అది ఎన్నికల్లో గెలిచేందుకు ప్రభావం చూపదనే పరిస్థితి ఉన్నది. ఇక టీడీపీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పోటీ చేయని దుస్థితి. ప్రస్తుతం జరిగే ప్రాదేశిక ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతం కాబోతున్నదా? అంటే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.

బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల ప్రభావం దాదాపుగా ఉండకపోవచ్చని, ఒకవేళ ఉన్నా స్థానిక పరిస్థితుల కారణంగా టీఆర్‌ఎస్ ప్రజాబలం ముందు నిలవలేమనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. ఇక పోటీ ఎటొచ్చి టీఆర్‌ఎస్‌లోనే. టీఆర్‌ఎస్‌కు టీఆర్‌ఎస్‌కు పోటీ ఏమిటీ? అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల శ్రేణులన్నీ టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఆశిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆశావహులు ఎక్కువ మంది ఉండటం వల్ల అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు కత్తిమీద సాముల మారింది. ఈ కారణాల నేపథ్యంగానే పార్టీ ప్రజల్లో ఉన్న నాయకులకు, సమర్థులకు టికెట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, వారికి సహాయకారిగా పార్టీ, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నియమించిన పరిశీలకులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, శాస్త్రీయంగా ప్రజాబలం ఉన్న వారిని రకరకాల మార్గాల ద్వారా సర్వేలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక చేయాలని భావించారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...