మోగిన నగారా...


Sun,April 21, 2019 02:11 AM

సుబేదారి, ఏప్రిల్ 20: స్థానిక పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సైరన్ మోగించింది. శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు పూర్తిచేయాలని నిర్ణయించగా..వరంగల్ అర్బన్ జిల్లాలో మాత్రం రెండు విడుతలు ఎన్నికలు పూర్తికానున్నాయి. జిల్లాలో హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలు ఉండగా అధికారులు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఏడు జెడ్పీటీసీ- 86 ఎంపీటీసీ
వరంగల్ అర్బన్ జిల్లాలో 7 మండలాలు, 130 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఏడు జెడ్పీటీసీ, 86 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికోసం 457 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హసన్‌పర్తి మండలంలో 9, ఎల్కతుర్తిలో 12, కమలాపూర్‌లో 18, భీమదేవరపల్లిలో 13, ధర్మసాగర్ 13, వేలేరు 8, ఐనవోలు 13 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మండలంలోని ఎంపీడీవో కార్యాలయాలోన్లే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇంతకుముందు జెడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థులు జిల్లా పరిషత్‌లో నామినేషన్లు దాఖలు చేసేవారు. ఈసారి మాత్రం మండలస్థాయిలో నామినేషన్ల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీకి బరిలో ఉండే అభ్యర్థులు మాత్రం పాత పద్ధతిలోనే ఎంపీడీవో ఆఫీస్‌లోనే నామినేషన్ వేస్తారు.

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
వరంగల్ అర్బన్ జిల్లాలో తొలివిడతలో నాలుగు మండలాలు హసన్‌పర్తి 9 ఎంపీటీసీ, ఎల్కతుర్తి 12, భీమదేవరపల్లి 13, కమలాపూర్ 18 స్థానాలకు సోమవారం నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. వీటికోసం 273 పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 600 మంది ఓటర్లు ఉండేలా చూశారు. వచ్చేనెల 6వ తేదీన ఓటింగ్ ఉంటుంది. మొత్తం 7 మండలాల్లో 2,24, 188 మంది ఓటర్లు ఉన్నారు. హసన్‌పర్తి మండలంలో 21, 442 ఓటర్ల్లు, భీమదేవరపల్లి 36,154 మంది, ఎల్కతుర్తి 30, 545, కమలాపూర్ 49,582మంది ఓటర్లు ఉన్నారు. రెండో విడతలో ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మండలాల్లో 34 ఎంపీటీసీ స్థానాలు 184 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈనెల 22నుంచి 24వరకు మండల కేంద్రాల్లో ఆర్‌ఓలు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

ఏర్పాట్లు పూర్తి
పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యా యి. జిల్లా అధికార యంత్రాంగం నెల రోజుల క్రితమే రిజర్వేషన్లు ఖరారు చేసింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, ఎన్నికల నిర్వహణపై శిక్షణ సైతం ముగిసింది. పోలింగ్ కేంద్రాల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండలస్థాయిలో సమీక్షలు చేశారు. ఎప్పటికప్పుడు ఆర్‌ఓలు , ఏఆర్‌ఓలు, ఎంపీడీవోలు ఎంపీటీసీ స్థానాల వారీగా పోలిం గ్ కేంద్రాల వద్ద తగిన చర్యలు తీసుకుంటున్నారు.

పరిషత్ ఎన్నికల్లో రికార్డు సృష్టించాలి
ధర్మసాగర్, ఏప్రిల్ 20 : త్వరలో జరుగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మళ్లీ రికార్డు సృష్టించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్‌లో మండల పార్టీ అధ్యక్షుడు గుడివెనుక దేవేందర్ అధ్యక్షతన శనివారం ధర్మసాగర్, వేలేరు మండలాల టిఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం సన్నాహాక సమావేశం జరిగింది. కార్యక్రమానికి నియోజకవర్గానికి ఎన్నికల ఇన్‌చార్జిగా రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 146 సర్పంచ్‌లకు గాను 132 మంది టిఆర్‌ఎస్‌కు చెందిన వారు గెలుపొందారని పేర్కొన్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రికార్డు సృష్టించాలని అన్నారు. పార్టీలో మొదటి నుంచి పని చేసిన వారికి, వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిన వారికి అందరిని కలుపుకోని గ్రామాల్లో పని చేయాలని అన్నారు. అభ్యర్థి గెలుపుకోసం ఆయా గ్రామాల్లోని గ్రామ కమిటీలు పని చేయాలని సూచించారు.

పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు
- వాసుదేవరెడ్డి
మే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ టికెట్ ఇవ్వలేదని పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగబోతుందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవరెడ్డి అన్నారు. పార్టీలో మొదటి నుంచి పని చేసిన వారికి ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు కలిసిరాకుంటే ఎన్నికలు పూర్తయిన జూన్ తర్వాత పలు కార్పొరేషన్లలో డైరెక్టర్స్ పదవులు, పార్టీలో పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎవనైతే టికెట్లు ఆశిస్తున్నారో పార్టీ తమ పేర్లను ఇవ్వాలని ఎంపిక చేయడంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, జిల్లా కమిటీ కూడ పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో వేలేరు మండల పార్టీ అధ్యక్షుడు రాంగోపాల్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మి రమణరెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ వీరన్న, జిల్లా నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, బొడ్డు ప్రభుదాసు, ఎన్నికల మండల ఇన్‌చార్జిలు సురేష్, ఆకుల కుమార్, కరంచంద్, సర్పంచ్‌ల ఫోరం మండలాల అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి, మాధవరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల కమిటీల అధ్యక్షులు, మహిళలు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...