అంగరంగ వైభవంగా నవగ్రహ, గరుడ స్తంభ ప్రతిష్ఠాపన


Sat,April 20, 2019 02:02 AM

మిల్స్‌కాలనీ, ఏప్రిల్ 19 : గ్రేటర్ పరిధిలోని 4వడివిజన్ ఖిలావరంగల్ తూర్పుకోటలో శుక్రవారం అంగరంగ వైభవంగా నవగ్రహ, గరుడస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం జరిగింది. మూడు రోజుల పాటు కనులపండుగగా సాగిన ఈ ఉత్సవాల్లో మూడో రోజు స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణాలతో అత్యంత వైభవోపేతంగా నవగ్రహ, గరుడస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం చేపట్టగా వందలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. ఏడాదిపాటు ఇంటిల్లిపాది సల్లంగ ఉండాలని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఉత్సవాల కార్యనిర్వహక సమితి అధ్యక్షుడు సిరబోయిన ఎల్లయ్య ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ బిల్లా కవిత పర్యవేక్షణలో వేదపండితులు కోటయ్యశర్మ తదితర బ్రాహ్మణోత్తములు మూడురోజుల పాటు గరుడస్తంభానికి గణపతిపూజ, గోపూజ ద్వారాతోరణంతో పాటు హోమం లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు ఉదయం 7గంటల నుంచే పూజరులు, నిత్యాహ్నికం, దిక్షుస్థలండిల హోమం, సంపాదజల అభిషేకం, ధ్వజస్తంభ నవగ్రహాల స్థలం నందు రత్నన్యాసం, బీజన్యాసం, దాతున్యాసం లాంటి పూజలు నిర్వహించారు.

ఉదయం 11 గంటల 20 నిమిషాలకు కర్కాటక లగ్నం నందు యంత్ర ప్రతిష్ఠాపన, విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్థంభ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, అఘోర మంత్ర హోమం పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజలు సమర్పించి నవగ్రహ గరుడ స్తంభాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ మహోత్సవానికి తూర్పుకోటకు చెందిన వందలాది మంది భక్తజనం, బంధువర్గంతో పెద్దఎత్తున తరలివచ్చి హాజరయ్యారు. భక్తులకు ఆలయకమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల సందర్భంగా ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో పెద్దఎత్తున చలువపందిళ్లతో పాటు పురవీధుల్లో మైక్‌సిస్టం, లైటింగ్ సౌకర్యం కల్పించారు. ఉత్సవ మహోత్సవాల సందర్భంగా స్థానిక తూర్పుకోట హనుమాన్ జంక్షన్ ప్రాంతమంతా జనసంద్రంగా మారి జాతర వాతావరణం తలపించింది. ప్రతీ ఇంట్లో కుటుంబసభ్యులు, ఆడపడుచులు, బంధువులతో కళకళలాడుతూ పండుగ వాతావరణం తలపించింది.

హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంపీ బండా ప్రకాశ్
తూర్పుకోటలో మూడురోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఈ ఉత్సవ వేడుకల ముగింపు సందర్భంగా శుక్రవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంపీ బండా ప్రకాశ్, అర్బన్ కో ఆపరేటీవ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బిల్లా కవిత, టీఆర్‌ఎస్ డివిజన్ నేత బిల్లా శ్రీకాంత్, ఉత్సవాల కార్యనిర్వాహక సమితి అధ్యక్షుడు సిరబోయిన ఎల్లయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సంగరబోయిన చందర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు పోశాల వెంకటేశ్వర్లు, కందిమల్ల రఘుప్రసాద్, సిరబోయిన జనార్ధన్, మేకల కుమారస్వామి, కందిమల్ల మహేశ్, సిరబోయిన వాసుదేవ్, అర్సం రాంబాబు, వనపర్తి కరుణాకర్, నల్లెల రాజేందర్, మంద శ్రీధర్ రెడ్డి, ముడిదె లింగమూర్తి, పోకల సాంబయ్య, రాయినేని అయిలయ్య పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...