షరా మాములే..!


Wed,April 17, 2019 02:25 AM

-నిచ్చెనమెట్ల వసూళ్ల పర్వం
-కబ్జాదారులకుకొందరు రెవెన్యూ అధికారుల సహకారం
-మామూళ్లకు ఆశపడి ఇష్టారాజ్యం
-యథేచ్ఛగాకొనసాగుతున్న దందా
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ఎల్కతుర్తి మండలం సూరారం. నాలుగైదు నెలల కింద బయటపడి బద్నాం అయింది. కానీ బయటపడకుండా లోపాయికారీగా మాములు వ్యవహరాలే అనేకం వెలుగుచూస్తున్నాయి. సూరారం రైతులు అక్కడి వీఆర్వో వ్యవహారంతో విసిగివేసారి గ్రామమంతా ఫ్లెక్సీలు కట్టి నిరసనకు దిగిన ఉదంతం రెవెన్యూలో యథేచ్ఛగా కొనసాగుతున్న అవినీతికి పరాకాష్టగా మారింది. రైతులను భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు తీసుకున్న వ్యక్తికి ప్రమోషనా.. అని నిలదీస్తూనే సూరారం గ్రామ రైతుల దగ్గర డబ్బులు తీసుకోవడమే కాకుండా వాళ్ల పనులు చేయకపోవడం, డబ్బులు ఇవ్వకపోతే బెదిరించి పనులు ఆపడం జరిగింది. ఇట్టి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు గ్రామ రైతులు ఊరంతా ఫ్లెక్సీలు కట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఇదే మండలంలో సీతంపేట గ్రామానికి చెందిన రైతు రాజయ్య ఏకంగా తహసీల్దార్ చొక్కాపట్టుకున్న ఘటన కలకలం రేపింది. ఆ రైతుపై డీటీ సహా ఇతర ఉద్యోగులు దాడికి దిగడం, రైతు భార్య తన భర్తను రెవెన్యూ అధికారులు ఇబ్బందుల పాలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతం రాష్ట్రస్థాయిలో కలకలం రేపింది.
హసన్‌పర్తి మండలం భీమారం శివారులోని సర్కారు భూమి..

అది కూడా ప్రభుత్వమే సేకరణ చేసి గూడులేని నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన అసైన్డ్‌భూమి అక్షరాల 5.03 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం వంటి ఉదంతంపై నలుగురు అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సర్వేయర్ జీ రాములు, (ప్రస్తుతం భూపాలపల్లి రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్నారు). గిర్దావార్, ప్రస్తుతం ఐనవోలు మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న పీ అనిత, ఇదే మండలంలో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న పీ రోజారాణి, భీమారం వీర్వో జీ సర్వేశ్వర్. ఈ నలుగురిపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ గత ఫిబ్రవరి 18న (18-02-2019న) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు ఉదంతాలు వెలుగుచూసినవి మాత్రమే. ఇట్లా ప్రతీ మండలంలో, ప్రతీ గ్రామంలో యథేచ్ఛగా చోటుచేసుకునే సర్వసాధారణ పరిణామాలే. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా ఏళ్ల తరబడి తిరిగినా సరే పనులు కాక అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. గొలుసుకట్టుగా నిచ్చెనమెట్ల అవినీతికి అడ్డాగా మారిన ధైన్యస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్‌గా.. యథేచ్ఛగా వసూళ్ల పర్వం కొనసాగుతున్నది.

ఏజెంట్ల వ్యవస్థ
అక్రమార్జనే ధ్యేయంగా అసలు కంటే కొసరెక్కువలా వీఆర్‌ఏ, వీఆర్వో ఇలా అన్ని స్థాయిల్లో త్వరగా పని కావాలనే బాధితుల అవసరాన్ని గుర్తించిన సిబ్బంది ఎక్కడికక్కడ తమ అవినీతి సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నారనే ఆరోపణుల వినిపిస్తూనే ఉన్నాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల నుంచి మొదలుకొని రేషన్‌కార్డుల్లో పేరు నమోదు చేసుకోవడానికి, కార్డు బదిలీ ఇలా ప్రతీ పనికి రేటుగా కొనసాగుతున్నది. వీఆర్‌ఏ, వీఆర్వోలు గ్రామానికో ఏజెంట్లను పెట్టుకొని దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాన్నారు. కాసులు ఇవ్వందే పనులు కావు అన్న వాతావరణాన్ని సృష్టించి దళారీ దందాను మూడు పువ్వు లు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. నిచ్చెనమెట్ల వ్యవస్థను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పహాణీలో ఎక్కించాలంటే ఒకరేటు అది కూడా ప్రాం తాన్ని బట్టి ఆ రేటు మారుతుంది. పట్టణ ప్రాంతానికి చేరువగా ఉన్న ప్రాంతానికో రేటు, మండల కేంద్రంలో ఓ రేటు, మిగితా ప్రాంతాలకు మరో రేటు ఇలా నేరుగా వాళ్లే తలదూర్చకుండా తమ విధేయులను బంట్లుగా పెట్టుకొని (ఏజెంట్లుగా) యథేచ్ఛగా వసూలు చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అయితే ఇందు లో చిత్తశుద్ధితో పనిచేసే వాళ్లు కూడా ఇటువంటి వారి చర్యలకు కొన్నిసార్లు బలికావాల్సి వస్తుందనే వాదన ఉంది.

ఇదీ 360/బీ ఉదంతం
జిల్లాలోని హసన్‌పర్తి మండలం భీమారం గ్రామంలో రెవెన్యూ అధికారులు చేసిన నిర్వాకం ఇది. వరంగల్ మహానగర పరిధి విస్తరించడం, భూముల ధరలకు కోట్లలో రెక్కలు తొడగడంతో కన్నేసిన కబ్జారాయుళ్లు కిందిస్థాయి రెవెన్యూ యంత్రాంగం పరోక్ష సహకారంతో కోట్ల రూపాయల సర్కార్ భూమి స్వాహా పర్వానికి తెరతీశారు. భూ కబ్జాకు అడ్డూ అదుపులేకుండా పోయిందనడానికి ఇదే నిదర్శనం. భీమారంలోని సర్వే నెంబర్ 360/బీలో ఉన్న 5.03 ఎకరాల భూమిని 1983లో స్థానికంగా ఇళ్లులేని ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వమే భూ సేకరణ చేసి (ప్రొసీడింగ్స్ నెంబర్: ఎల్‌ఎ/హెచ్.2062/1983 తేదీ 1983) పంపిణీ చేసింది. అయితే ఎంతమందికి పంపిణీ చేసింది? ఎవరెవరికీ పంపిణీ చేసింది? వంటి వివరాలేవీ అందుబాటులో లేవు. అంతేకాకుండా ప్రభుత్వం పట్టాదారుల నుంచి కొనుగోలు చేసినా.. సరే రికార్డుల్లో మాత్రం మార్పు చేయలేదు. దీంతో పట్టాదారులైన సూరం పద్మారెడ్డి, సూరం వేణుమాధవ్‌రెడ్డి, సూరం రాయపురెడ్డి పేర్ల మీదున్న పట్టా ఆధారంగా ఆ పట్టాదారులు మునిగాల రమేశ్‌బాబు, పోతు అమరేందర్‌రెడ్డి పేర్ల మీద జీపీఏ చేశారు. జీపీఏ చేసుకున్న ఆ ఇద్దరు సదురు భూమిని 2007లో రిజిస్ట్రేషన్ (4560/2007, 08-08-2007) చేయించుకున్నారు.

వీరి నుంచి కేవలం నెల వ్యవధిలోనే కొక్కర్ల రవీందర్‌రావు, సూరం శ్రీనివాస్‌రెడ్డికి అదే సంవత్సరం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నెంబర్: 5566/2007 తేదీ: 20-09-2007న) చేయించుకున్నారు. అయితే అది ప్రభుత్వం నిరుపేదలకు అందునా ఎస్సీ, ఎస్టీలకు నివేశన స్థలాల కోసం సేకరించి ఇచ్చిన భూమి అని, కొంతమంది కావాలనే కాజేస్తున్నారని స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు విచారణ చేయగా.. అది ఎస్సీ, ఎస్టీలకు ఇంటి కోసం ఇచ్చిన భూమి అని నిర్దారణ అయింది. అంతేకాకుండా సదరు భూమి నివేశన స్థలం అయినా ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారనే నెపంతో 2008లో వీఆర్వోగా పని చేసిన బండా రాజిరెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. ఆయనను సస్పెండ్ చేశారే కానీ రికార్డుల్లో మార్పు చేయలేదు. పై పెచ్చు దాన్ని పట్టాభూమిగా ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగిస్తూనే ఉన్నారు.

ఈ రికార్డుల ఆధారంగా ఆ భూమి తమదేనని క్లెయిమ్ చేస్తూ ఉండటంతో తిరిగి స్థానికులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఉన్నతాధికారులు విచారణ చేసి ఆ భూమి సర్కారుదేనని తేల్చారు. అంతేకాకుండా రెండు దఫాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చెల్లవని వాటిని రద్దు చేయడమే కాకుండా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు కోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరి 7న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఆధారంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ హసన్‌పర్తి తహసీల్దార్‌కు భూమిని స్వాధీనం చేసుకొని, రికార్డులన్నీ మా ర్చాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలను హసన్‌పర్తి మండల రెవెన్యూ అధికారులు బేఖాతరు చేశారు. అంతేకాకుండా ఒక్కరోజు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పాతి ఆ తెల్లారే తొలగించేలా చేశారని స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే నిరుపేదలకు అది కూడా నివేశన స్థలాల కోసం ఇచ్చిన భూమి వ్యవసాయ భూమిగా ఎలా మారింది? అన్నది ఇప్పటికీ అంతుబట్టని వ్యవహారంగా మారింది.

ఇప్పుడు స్టెటస్ కో
రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో, పరోక్ష సహకారంతో అక్కడ బోర్డు తొలగించడమే కాకుండా సదరు కబ్జాదారులకు హై కోర్టుకు వెల్లమని సలహా ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది కబ్జాదారులతో మిలాఖత్ కావడం, వారి సూచనలతోనే సదరు కబ్జాదారులు ఈ ఫిబ్రవరి 12న హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ భూమిని సర్కార్ స్వాధీనం చేసుకోకుండా స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని ఆర్డర్ జారీ చేసింది. దీంతో దాదాపు పదేండ్లుగా స్థానికులు చేసినా పోరాటాలకు ఫలితం లేకుండా పోయిందనే ఆవేదన కొంతమంది రెవెన్యూ సిబ్బందిలో వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన అసైన్డ్ భూమికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఎలా జారీ చేశారు? ఆ జారీ చేయడంలో నడిచిన వ్యవహారం ఏమిటీ? 2008లో వీఆర్వో కబ్జాదారులతో మిలాఖత్ అయ్యాడని ఆరోపిస్తూ సస్పెన్షన్‌కు గురి అయ్యాడు. కానీ రిజిస్ట్రేషన్లు అయ్యేలా ప్రోత్సహించిన అధికారులది తప్పా, ఒకవేళ ఆ వీఆర్వో బాధ్యుడు అయితే ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారు తప్పించుకోవడానికి కారకులు ఎవరు? అన్నవి పూర్తిస్థాయి విచారణ చేస్తే కానీ తేలే అంశాలు కావు. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని అది కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి సేకరించిన భూమిని వ్యవసాయ భూమిగా మార్చింది ఎవరు? నివేశన స్థలాలకు చెందిన భూమికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేసింది ఎవరు? వారిపై చర్యలు తీసుకోకపోవడానికి గల ఒత్తిళ్లు లేదా మిలాఖత్ మర్మం ఏమిటీ? వంటి వాటిపై ఆసక్తికర చర్చ సాగుతున్నది.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...