అన్నను చూసి.. చెరువులో దిగి..


Tue,April 16, 2019 02:10 AM

నర్మెట : తన తల్లి దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లగా అక్కడ సరదాగా ఆడుకుందామని తల్లి వెంటే చెరువులోకి వెళ్లాడు ఆదొడ్డి కమలాకర్(7) అనే బాలుడు. త న అన్న ఈత కొట్టడాన్ని గమనించిన ఆ బాలుడు తాను కూడా ఈత కొట్టేందుకు వెళ్లి నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటనతో నర్మెటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. ఎన్నో ఏళ్లుగా గంగిరెద్దుల కులవృత్తినే నమ్ముకుంటూ.. పొట్టకూటి కోసం నర్మెట మండలానికి వచ్చి ఆదొడ్డి దుర్గయ్య-సారమ్మ దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం తన ముగ్గురు కుమారులు, కుమార్తెతో తల్లి సారమ్మ నర్మెట మండలకేంద్రంలోని ఊర చెరువు వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. కాగా తన పెద్ద కుమారుడు రమేశ్ చెరువులో దిగి ఈత కొడుతున్నాడు.

తన అన్న ఈత కొట్టడాన్ని గమనించిన కమలాకర్.. తాను కూడా వెళ్తానని చెరువులోకి ఒక కర్ర సాయంతో లోతును చూసుకుంటూ వెళ్లాడు. ఒక్కసారిగా అక్కడ ఎక్కువ లోతు ఉండి మట్టిలో కాళ్లు జారిపోవడంతో నీటిలో మునిగిపోయాడు. వెంటనే గమనించిన అతడి తల్లి, అన్న కమలాకర్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే మునిగిపోవడంతో ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో వారు తమ బంధువులకు సమాచారం అందించి చెరువులో గాలింపు చేపట్టి కమలాకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా దవాఖానాకు తరలించినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...