స్థానిక సమరం..!


Sun,April 14, 2019 02:40 AM

వరంగల్ ఫ్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: స్థానిక సమరానికి దాదాపు ముహూర్తం ఖరారైనట్టే. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు సూచనప్రాయంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించినట్టుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సైతం మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నది. అయితే దీనిపై రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నీ సిద్ధం చేస్తుంది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరమే ఫలితాలు వెలువరచాలా? లేక అంతకుముందే ఫలితాలు వెల్లడించాలా అన్నది తేలాల్సి ఉంది. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు (జెడ్పీటీసీ), మండల ప్రాదేశిక నియోజకవర్గాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది.

అదే విధంగా బీసీ ఓటర్ల గణన కూడా పూర్తిచేసుకొని అందుకు సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం తలమునకలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు ఆవిర్భావం కాబోతున్న విషయం తెలిసిందే. ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌లోపే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి అనుమతి కూడా లభించండతో లోకల్‌బాడీ ఎలెక్షన్స్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ఈనెల 11వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. రెండు,మూడు రోజుల్లో అధికారింగా స్థానిక పోరుకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన వస్తుందనే సమాచారంతో ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ అధికారులు స్థానిక ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

రిజర్వేషన్లు ఖరారు..
లోక్‌సభ ఎన్నికల కోడ్ మే 23తో ముగిస్తున్నందున ఈ కోడ్‌లోపు ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనతో 20రోజుల క్రితమే స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియను అదికారులు పూర్తిచేశారు. ఉమ్మడి వరంగల్ (వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్‌భూపాలపల్లి, ములుగు, మహబుబాబాద్, జనగాం) ఆరు జిల్లాలకుగాను గ్రామాలు, మండలవారీగా 791 ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ 71, ఎంపీపీ71 స్థానాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం విధితమే. అర్బన్ జిల్లాలోని ఏడు మండలాల్లోని హసన్‌పర్తి, ధర్మసాగర్, ఐనవోలు, భీమదేవరపల్లి, కమలాపూర్, ఎల్కతుర్తి, వేలేరు మండలాల్లో 86 ఎంపీటీసీ ,ఏడు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను చేస్తున్నారు. 600 ఓటర్లకు పోలింగ్ కేంద్రం చొప్పు న గ్రామాల వారీగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్‌నోటిఫికేషన్‌ను ఎంపీడీవోలు ఆయా మండలాల వారీగా జారీ చేశారు. పాత వరంగల్ జిల్లాలో 50 మండలాలు ఉండగా కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాల్లో అదనంగా 21 మండలాలు పెరిగాయి. ఈమేరకు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయి.

ఎన్నికల అధికారుల నియామకం
స్థానిక ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం జిల్లాల వారీగా పూర్తయింది. వారంరోజుల క్రితం ఆర్వో, ఏఆర్‌ఓలకు జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని సైతం ముగించారు. ప్రస్తుతం ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణ కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది బ్యాలెట్ పత్రాలతో జరుగుతున్నందున ఈసారికూడా ఇదే పద్ధతిని రాష్ట్ర ఎన్నికల సంఘం కొనసాగించడానికి నిర్ణయం తీసుకోవడంతో అధికారులు జిల్లాల వారీగా బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ కోసం టెండర్లు నిర్వహించారు. అంతేకాకుండా ఎన్నికల సంబంధించిన స్టేషనరీ తయారీ దాదాపుగా ఉమ్మడి జిల్లాలో పూర్తయినట్లు తెలుస్తుంది. వారం రోజుల క్రితమే ఈ ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. ఇక మిగిలింది ఎన్నికల నిర్వహణే కావడంతో కలెక్టర్లు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైనట్లు సోషల్‌మీడియాలో వైరల్ అయింది. తొలి విడత నామినేషన్లకు ఈనెల 22 నుంచి 24వ తేదీ, రెండో విడత 26నుంచి 28, మూడో విడత 30నుంచి మే 2వ తేదీ, స్క్రూట్నీ 25 వ తేదీ ఫస్ట్ ఫేజ్, 29 తేదీ సెకండ్ ఫేజ్, మే 3వ తేదీ థర్డ్‌ఫేజ్, నామినేషన్ల ఉపసంహరణకు 28 మొదటి విడత,రెండో విడత మే 2, మూడవ విడతకు మే 6 వతేది చివరి తేదీ, పోలింగ్ మొదటి విడుత మే 6, రెండో విడుత 10, మూడో విడత మే 14వ తేదీ అని సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఆశవాహులు ఎన్నికల బరిలో దిగడానికి ఆసక్తితో ఉన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా షెడ్యూల్ ఉత్తర్వులు రాలేదని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా రెండు, మూడు రోజుల్లో అధికారికంగా షెడ్యూల్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల అధికారుల నియామకం జరిగి, శిక్షణ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది కొద్ది రోజుల్లోనే ఉంటుందనే సంకేతాలు రావడంతో మళ్లీ గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు జరిగి వారం రోజులు గడువక ముందే , మళ్లీ స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వస్తున్నాయో సంకేతాలు రావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైనది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. నిజానికి రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపు ఇదే తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్టు, అదే వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, జిల్లా యంత్రాంగం కానీ దీన్ని ఇంకా ధ్రువీకరించకపోవడం విశేషం.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...