పోలింగ్ ప్రశాంతం


Fri,April 12, 2019 03:01 AM

- వరంగల్ పార్లమెంట్ పరిధిలో 63.49 శాతం , మహబూబాబాద్‌లో 69.02 శాతం పోలింగ్
- పట్టణ ప్రాంతాల్లో పలుచగా.. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మెరుగ్గా
- వరంగల్ పశ్చిమలో42.03 శాతం అత్యల్ప పోలింగ్
- పాలకుర్తి, పరకాల నియోజకవర్గాల్లో పోటాపోటీ పోలింగ్
- మందకొడిగా మొదలు.. చివరి వరకు అదే స్థితి

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. కట్టుదిట్టమైన భద్రతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 63.49 శాతం ఓట్లు పోలవగా, మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో 69.02 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పాలకుర్తి నియోజకర్గంలో అత్యధికంగా 73.75 శాతం పోలింగ్ నమోదు కాగా, పరకాల నియోజకర్గంలో 71.87 శాతం పోలింగ్ నమోదైంది. పట్టణప్రాంతాలతో కూడిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 42.03 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పుంజుకున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగింది. ఎండ తీవ్రంగా ఉండడంతో పదకొండు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం పలుచపడ్డారు. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన స్వగ్రామమైన పర్వతగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ బొల్లికుంట గ్రామంలో, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వరంగల్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ముగియడంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ శాతం 63.49గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పుంజుకున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం మందకొడిగా సాగింది. ఎండ తీవ్రంగా ఉండటంతో 11 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం పలుచపడ్డారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రావడానికి ఎండ తీవ్ర ప్రభావం చూపింది. 12 తర్వాత పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోయాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడం, వాతావరణం చల్లగా ఉండటంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి బారులు తీరారు. మళ్లీ సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడాయి. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వర్ధన్నపేట, పాలకుర్తిలో ఓటింగ్‌లో పోటాపోటీగా నిలిచాయి. పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధిక ంగా 73.75 పోలింగ్ శాతం నమోదు కాగా, పరకాలలో 71.87 ఓటింగ్ నమోదైంది. పట్టణప్రాంతాలతో కూడిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ అతి తక్కువ శాతం నమోదైంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో 67.61 శాతం, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 64.85 శాతం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 62.80 శాతం, భూపాలపల్లి నియోజకవర్గంలో 61.55 శాతం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 42.03 శాతం పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.

ప్రత్యేక ఆకర్షణగా మోడల్, సఖి కేంద్రాలు
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికో మోడల్ పోలింగ్ కేంద్రం, సఖి కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవి పోలింగ్ కేంద్రాలుగా కాకుండా పెళ్లి మంటపాలుగా ముస్తాబయ్యాయి. పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే ఓటర్లకు రెడ్‌కార్పేట్ స్వాగతం పలికాయి ఈ కేంద్రాలు. బెలూన్లతో ప్రత్యేకంగా అలంకరించారు.

ఎన్నికల సంఘం నినాదాలు, ఓటు ప్రాధాన్యత నినాదాలతో పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునేవాళ్లు తాము తొలిసారి ఓటేసి ఆనందం ముఖంలో వెల్లివిరిసినట్టు ఈ కేంద్రాలు సైతం ఓటర్లను ఆకర్షించడం విశేషం.

పర్వతగిరిలో ఓటేసిన మంత్రి దయాకర్‌రావు
పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని తన స్వగ్రామమైన పర్వతగిరిలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పసునూరి దయాకర్ బొల్లికుంటలో ఓటు వేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సకుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ వడ్డెపల్లిలోని పింగిళి కళాశాలలో సతీసమేతంగా ఓటేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని పెరకవాడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి వరంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రాలకు ఎండదెబ్బ
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, (టీఆర్‌ఎస్ మినహా) రాజకీయ పార్టీలు నిర్వహించిన పేలవమైన ప్రచారానికి తోడు ఎండత్రీవతతో ప్రజలు ఓటు వేయడానికి పెద్దగా ముందుకు రాని పరిస్థితి నెలకొన్నది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి గురువారం జరిగిన పార్లమెంట్ స్థానానికి జరిగిన పోలింగ్‌కు మధ్య ఓటేసినవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మునుపెన్నడూ లేనివిధంగా పోలింగ్ కేంద్రాలన్నీ వెలవెలబోయాయి. ఉదయం 7 నుంచి దాదాపు పది గంటల వరకు ఓ మోస్తరు జనం ఓటేసేందుకు కేంద్రాల వద్ద బారులు తీరినట్టు కనిపించినా.. ఆ తర్వాత ఓటర్లు రాక పోలిం గ్ కేంద్రాల్లోని సిబ్బంది గిరాకీ లేని దుకాణంలో కూర్చున్న షావుకారిలా దర్శనమిచ్చారు. అయితే అధికార యంత్రాంగం పోల్ చిట్టీలు పంపిణీని చేసినా పెద్దగా ఓటేయడానికి జనం ముందుకు రాకపోవడం విశేషం.

ఓటు పట్టణివాసులు
నగరంలో ఉండే మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కడ పది మంది గుమిగూడినా మస్తు ముచ్చట్లు చెబుతారు. దేశ, విదేశీ రాజకీయాల గురించి ధారాపాతంగా చర్చోపచర్చలు చేస్తారు. కానీ ఎన్నికల్లో ఓటింగ్‌కు రావడానికి మాత్రం సుముఖత చూపరు అనేది మరోసారి రుజువైంది. అందులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఓటరు మరోసారి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు. సాధారణంగా ఏ ఎన్నికలైనా సరే పట్టణ ఓటరు ప్రత్యేకించి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఓటరు మస్తు ముచ్చట్లు, చర్చలు చేస్తారు.కానీ ఓటింగ్ రావడానికి బద్ధకస్తులు అనే మాట మరోసారి తేలిపోయింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్‌శాతంలో అత్యల్పంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కేవలం 42.03శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్ పశ్చిమ నియోజకర్గం తర్వాత ఆ స్థానంలో వరంగల్ తూర్పు నిలిచింది. ఈ నియోజకర్గంలో మునుపెన్నడూ లేనివిధంగా ఓటింగ్ నమోదు కావడం విశేషమే. ఈ నియోజకవర్గంలో 63.49 శాతం పోలింగ్ నమోదైంది.

పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు భేష్
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు, ఎన్నికల నిర్వహణ సిబ్బందికి అసాధారణ రీతిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కొంత స్వాంతన చేకూరినట్టు అయింది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయడం వల్ల సిబ్బందికి బయటి ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగిందనే చెప్పాలి. అంతేకాకుండా సాధ్యమైన మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ సిబ్బందికి కూల్ వాటర్ (క్యాన్) అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా ఓటింగ్‌కు వచ్చే వారి కోసం మంచినీటి సౌకర్యం కల్పించారు. వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీల్ చైర్లు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వాలంటీర్లు, పోలీసుల సేవలపై ఓటర్లు సంతృప్తి చెందారు. అంతేకాకుండా ప్రతీ పోలింగ్ కేంద్రం ప్రాంగణంలోని ఓటరు సహాయ కేంద్రాలు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల మెడికల్ క్యాంపులను ఓటర్లు సద్వినియోగం చేసుకున్నారు. మొత్తంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆయా నియోజకవర్గాల సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చేసిన ఏర్పాట్లపై, ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలు స్వాంతన చేకూర్చాయి.

మంత్రి నియోజకవర్గం టాప్..
పాలకుర్తి నియోజకవర్గంలో పోలింగ్‌లో టాప్‌లో నిలిచింది. ఓటు శాతం పెంచడంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తనదైన శైలిలో ప్రచారం, తన వ్యూహాలు ఫలించాయి. పాలకుర్తి తర్వాతి స్థానంలో పరకాల 71.87 శాతంతో నిలిచింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గానికి, పరకాల నియోజకవర్గానికి మధ్య కొద్దిపాటి తేడా ఉండటం విశేషం. ఏడు నియోజకవర్గాల్లో వర్థన్నపేట నియోజకవర్గం 73.75 శాతం పోలింగ్ నమోదు కాగా, పరకాలలో 71.87 శాతం పోలింగ్ నమోదు చేసుకున్నది.

స్ట్రాంగ్‌రూంకి చేరిన ఈవీఎంలు, వీవీప్యాట్లు
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1859 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీపీప్యాట్లు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు చేరుకున్నాయి. వచ్చేనెల 23న ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో అప్పటి దాకా ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రత బయటి నుంచే కాదు లోపల కూడా వాటికేం కాకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అటు రాజకీయ పార్టీలు, ఇటు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఎటొచ్చి వరంగల్ పార్లమెంట్ చరిత్రలో అత్యంత తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంపై బరిలో నిలిచిన అభ్యర్థులు ఎందుకిలా జరిగిందని ఆలోచన చేసి.. ఎండపై నెపమేసి చల్లగా ఊపిరి పీల్చుకుకోవడం విశేషం.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...