తూర్పులో కాంగ్రెస్ ఖతం


Sun,March 24, 2019 02:12 AM

వరంగల్,నమస్తేతెలంగాణ: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖతమైపోయింది. ఆ పార్టీకి.., నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు పెద్దదిక్కు లేకుండాపోయింది. దీంతో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోని కాంగ్రెస్ నాయకులంతా గులాబీ గూటికి చేరారు. సుమారు మూడు వేల మంది నాయకులు, కార్యకర్తలు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత అన్ని పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసల జోరు సాగుతున్న నేపథ్యంలో తూర్పులో కాంగ్రెస్ నేతలంతా మూకుమ్మడిగా చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వద్దిరాజ్ రవిచంద్ర ఎన్నికల తర్వాత తూర్పు నేతలను పట్టించుకోవడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన సైతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే ఊహగానాలు వినిపిస్తుండటం గమనార్హం.

కేటీఆర్ సమక్షంలో చేరిక
తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలంతా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో ఆయన తూర్పు నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో తూర్పు కాంగ్రెస్ నేతలు అంతా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గమంతా గులాబీ మయమైంది. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేసిన సీనియన్ నాయకులు మందా వినోద్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంట్ల రాజు, మాజీ కార్పొరేటర్లు రోకుల భాస్కర్‌తో పాటు తూర్పు నియోజకవర్గంలో దశాబ్ధాల నుంచి కాంగ్రెస్‌లో ఉంటూ పలు కీలక బాధ్యతలు నిర్వహించిన నేతలంతా ఎమ్మెల్యే నేతృత్వంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఫలించిన ఎమ్మెల్యే నరేందర్ కృషి
తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి ఫలించింది. మొన్నటికి మొన్న 19వ డివిజన్ ఎన్నికలను ఏకగ్రీవం చేయడంలో సఫలీకృతమైన ఎమ్మెల్యే మరోసారి తనదైన మార్క్‌ను చూపారు. తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులను గూలాబీ గూటికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయింది. కాంగ్రెస్ జెండా మోసేవారు కరువయ్యారు. అన్ని డివిజన్లలో క్రియాశీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మరో 15 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండగా తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్లు అయింది.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...