వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలి


Sun,March 24, 2019 02:12 AM

అర్బన్ కలెక్టరేట్, మార్చి 23: రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను తట్టుకునేందుకు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఏప్రిల్ మాసం నుంచి జూన్ నెల వరకు వాతావరణంలో ఉన్న వేడివల్ల వడగాలలు వీస్తాయన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వడగాలుల నుంచి తట్టుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం సైతం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వడదెబ్బ లక్షణాల గురించి ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. వడదెబ్బ తగిలిన వ్యక్తులను కాపాడేందుకు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్లూయిడ్స్, గ్లూకోజ్, పోటాషియం క్లోరైడ్‌తో పాటు చర్మ వ్యాధుల నుంచి కాపాడే క్రీములను, పౌడర్లు సమృద్ధిగా నిల్వ ఉంచాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిని ఆయన ఆదేశించారు. అత్యవసర వైద్యసేవలను అందించేందుకు 108తోపాటు 1077 నెంబర్లు సక్రమంగా పని చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైద్యాధికారులు, అత్యవసర వైద్యసేవలు అందించే ఫోన్ నెంబర్లు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల ఫోన్ నెంబర్లను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో రాయించాలని సూచించారు. అలాగే ప్రజల సౌకర్యార్థం కూడళ్లు, బస్‌స్టాపులు, పర్యటక ప్రదేశాలు, జంక్షన్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. వైద్యశాలలకు నిరంతర విద్యుత్, నీటిసరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు కూడా నీటి తొట్లను ఏర్పా టు చేసి నింపాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఆదేశించారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...