గ్రామాలను అభివృద్ధి చేస్తా


Thu,March 21, 2019 01:17 AM

- ఆరు నెలల్లో తొర్రూరు రూపురేఖలు మారుస్తా
- సాగు, తాగునీరుకు శాశ్వత పరిష్కారం
- రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- టీఆర్‌ఎస్‌లో చేరిన సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు
- కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి

తొర్రూరు, నమస్తే తెలంగాణ, మార్చి 20 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తు న్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్ కనుమరుగవుతుందని అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే ఆ పార్టీ నాయకులు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా.. మీకో న్యాయం మాకో న్యాయమా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇటీవల ఎమ్మెల్యేలు గా గెలుపొందిన కాంగ్రెస్ నేతలు పార్టీ కన్నా సొంత ఇమేజ్ తోనే గెలిచారని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. పార్టీ పిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ నేడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎన్నికలంటే భయం లేదని, టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు అవసరమైతే రాజీనామాకు సిద్ధంగా ఉంటారని చెప్పారు. పాలకుర్తితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు
తొర్రూరు రూరల్ : సీఎం కేసీఆర్ తనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం పని చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగు తున్నాయని చెప్పారు. గ్రామాల్లో కాంగ్రెస్ ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వెలికట్ట, గుడిబండ తండా, నాంచారిమడూర్ గ్రామాల కాంగ్రెస్ సర్పంచులు పోసాని పుష్పలీల, లకావత్ శోభన, గుంటుక యాదలక్షి, మాజీ ఎంపీటీసీ, ఉప సర్పంచ్ దీకొండ సంధ్య, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు కోమళ్ల లింగారావు, పోసాని రాములు, సుమన్, బోగ భాస్కర్, రాములు, ఐలయ్య, బందు వెంకన్న, దేవమ్మ, సుధాకర్, వైకుంఠంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రెండు పార్లమెంట్ సీట్లు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తాం..
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని అన్నారు. ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో రాష్ర్టాల్లో పర్యటించి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు గెలిపించి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీ వచ్చేలా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...