వ్యయ లెక్కింపులో అప్పమత్తంగా ఉండాలి


Wed,March 20, 2019 03:01 AM

సుబేదారి,మార్చి 19: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచార ఖర్చుల లెక్కింపు విషయంలో రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు నరేశ్‌కుమార్‌సైనీ, విజయ్‌అగర్వాల్ ఆదేశించారు. జిల్లా పరిషత్ హాల్‌లో మంగళవారం వరంగల్ లోక్‌సభ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ లోక్‌సభ ఎన్నికల నియామక అధికారులు, తీసుకున్న చర్యలను మానిటరింగ్ కమిటీ నోడల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ దయానంద్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించారు. నరేశ్‌కుమార్‌సైనీ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కోసం ఎన్నికల సంఘం నిర్ధేశించిన రూ.70లక్షల వరకు మాత్రమే ఖర్చుచేయాలని, ఎప్పటికప్పుడు అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించడంలో రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ అంశాన్ని రికార్డు చేయాలని, అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. సి-విజిల్ యాప్ 1950 ఓటర్ హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. విజయ్‌అగర్వాల్ మాట్లాడుతూ.. వీడియో సర్వేలెన్స్ టీంలు అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలను ఎప్పటికప్పడు వీడియో తీయాలన్నారు. ఎన్నికల ప్రచార ఖర్చుపై షాడో పరిశీలన రిజిస్టర్ నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అభ్యర్థులు ప్రచారం కోసం వినియోగిస్తున్న వాహనాలు, ర్యాలీలు, సమావేశాలు, ఉపకరణాలను ప్రతీ రోజు వీడియో కవరేజ్ చేసి ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని అన్నారు. ప్రచార కార్యక్రమాలకు రిటర్నింగ్ అధికారి సువిధ ద్వారా పొందిన అనుమతి పత్రాలను పరిశీలించాలన్నారు. అకౌంట్ టీం నిర్ధేశించిన ప్రకారం ప్రచార ఖర్చులను లెక్కించి చార్ట్ ప్రకారం షాడో రిజిస్టర్‌లో నమోదు చేయాలని అన్నారు. సమావేశంలో స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, భూపాలపల్లి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...