వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి


Tue,March 19, 2019 03:48 AM

రెడ్డికాలనీ, మార్చి18: వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. సోమవారం హన్మకొండ బస్‌స్టేషన్‌లో ఆయన ఓఆర్‌ఎస్ డిపోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక లీటర్ నీటిలో ఒక ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌ను కలిపిన ద్రావణం పలువురికి అందించారు. అనంతరం డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్ మాట్లాడుతూ వరంగల్ అర్బన్ జిల్లావ్యాప్తంగా 1063 ఓఆర్‌ఎస్ డిపోలను ఏర్పాటు చేసినట్లు, ప్రతి డిపోల్లో 74,400ఓఆర్‌ఎస్ ప్యాకెట్స్, 5165గ్లూకోజ్ బాటిల్స్ (ఫ్లూయిడ్స్)ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మొత్తం 11తహసీల్దార్, 11ఎంపీడీవో, 10బస్‌స్టేషన్లు, 2రైల్వేస్టేషన్స్, 129 గ్రామపంచాయతీలు, 735అంగన్‌వాడీ కేంద్రాలు, 171సబ్‌సెంటర్లలో, 68పబ్లిక్ ప్రాంతాల్లో ఓఆర్‌ఎస్ డిపోలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హరీశ్‌రాజ్ వెల్లడించారు. వడదెబ్బ తగలకుండా ఎక్కువగా నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, ద్రవపదార్థాలు, లేతవర్ణం, తేలికైన కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. మండు వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తిరగరాదని చెప్పారు. మద్యం సేవించరాదని, రోడ్డు పక్క్న విక్రయించే కలుషిత ఆహారపదార్థాలు తీసుకోవద్దని తెలిపారు. తాజా ఆకు కూరగాయలు తీసుకోవాలని, ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలన్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ, గాలి తగిలే ప్రదేశానికి తరలించాలన్నారు. ఐస్ నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలని, ఉప్పు, మజ్జిగ కలిపిన ద్రావణం తాగించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్‌రాజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేలైన్స్ అధికారి డాక్టర్ క్రిష్ణారావ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ యాకుబ్‌పాషా, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ మదన్మోహన్, డీఐవో డాక్టర్ గీతాలక్ష్మీ, డాక్టర్ ఉమశ్రీ, డాక్టర్ మల్లికార్జున్, జీఎంహెచ్ వైద్యాధికారి డాక్టర్ నవీన్, డీఎంవో రమణమూర్తి, లవరామ్, ఎపిడెమిక్ సెల్ అధికారులు రమేశ్, రాజేంద్రప్రసాద్, సుదర్శన్, రామయ్య, సోమిడి వైద్యాధికారి డాక్టర్ అర్చన, డాక్టర్ అరుణ్‌చందర్, కాజీపేట రైల్వేస్టేషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ, ఏరియా అధికారి తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...