మార్కెట్‌కు ఎర్రబంగారం కళ


Tue,March 19, 2019 03:46 AM

కాశీబుగ్గ, మార్చి18 : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ఎర్రబంగారంతో నిండిపోయింది. మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలతో కళకళలాడింది. ఈ మిర్చి సీజన్ డిసెంబర్ నుంచి ప్రా రంభం కాగా ప్రతీ రోజు 5వేల నుంచి 30వేల బస్తాలు మార్కెట్‌కు వచ్చేవి. సోమవారం లక్ష వరకు మిర్చి బస్తాలు వచ్చాయి. హోళీ పండుగ బందుతో పాటు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మార్కెట్‌కు వరుస సెలవులు వస్తున్నాయి. అలాగే గత రెండు రోజులుగా వరుసగా మార్కెట్‌కు సెలవులు వచ్చాయి. అలాగే మిర్చి ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో రైతులు తమ మిర్చిని ఇంటి దగ్గర నిల్వలు చేసుకోలేక అమ్ముకునేందుకు మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో మార్కెట్‌కు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మిర్చి వచ్చింది. సోమవారం వచ్చిన మిర్చిని రెండు రోజుల పాటు కాంటాలు పెట్టవలసి వస్తుందని మార్కెట్ అధికారులు అంటున్నారు.

42వేల 130 బస్తాలకు ధరలు కాగా మిగితా బస్తాలకు మరుసటి రోజు ధరలు నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. కొందరు రైతులు ధరలు నచ్చక తమ సరుకును కోల్డు స్టోరేజీల్లో నిల్వ చేసుకునేందుకు సరుకును వాపసు తీసుకుపోయినట్లు తెలిసింది. ఈ సీజన్‌లో అత్యధికంగా సోమవారం మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరలు మాత్రం నిలకడగానే కనబడుతున్నాయి. మార్కెట్‌లోని మిర్చియార్డు పూర్తిగా నిండిపోయి ఆపరాలయార్డు, పత్తి యార్డు, మార్కెట్ ప్రధాన కార్యాలయం చుట్టూ మిర్చి బస్తాలు నిండిపోయాయి. మార్కెట్లో ఎటు చూసిన మిర్చి బస్తాలే కనిపిస్తున్నాయి. దీంతో అడ్తి, ఖరీదు వ్యాపారులతో పాటు దడువాయి, గుమాస్తాలు, ఇతర హమాలీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు చేతి నిండా పని దొరుకుతుందని వారు అంటున్నారు. ఇప్పటి వరకు మార్కెట్‌కు 9 లక్షలకు పైగా మిర్చి బస్తాలు మార్కెట్‌కు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. సోమవారం లక్ష బస్తాల వరకు మిర్చి బస్తాలు రాగా 42వేల 130 బస్తాలకు ధరలు అయ్యాయి. అలాగే.. మంగళవారం మిగిలిన సరుకుకు ధరలు నిర్ణయించి కాంటాలు నిర్వహిస్తామని తెలిపారు.

ధరలు ఇలా ఉన్నాయి...
తేజ రకం క్వింటాల్‌కు అత్యధికంగా రూ.9వేల 100, మధ్యరకం రూ.8400, కనిష్టంగా రూ.7వేల 600, వండర్‌హాట్ అత్యధికంగా రూ.9300, మధ్యరకం రూ.8800, కనిష్టంగా రూ.8వేల 200, యూఎస్ 341 అత్యధికంగా రూ.8800, మధ్యరకం రూ.8వేల 200లు, కనిష్టంగా రూ.7300, దీపిక అత్యధికంగా రూ.9వేలు, మధ్యరకం రూ.8వేల 300, కనిష్టంగా రూ.7వేల 500, దేశీ రకం అత్యధికంగా రూ.10వేల 500, మధ్యరకం రూ.10వేలు, కనిష్టంగా రూ.9500, దేవూనూరి డీలక్స్ అత్యధికంగా రూ.8600, మధ్యరకం రూ.7వేల 800, కనిష్టంగా రూ.7100, 1048 రకం, అత్యధికంగా రూ.7400, మధ్యరకం రూ.6వేల 800, కనిష్టంగా రూ.6200, తాలు రూ.2800, మధ్యరకం రూ.2వేలు, కనిష్టంగా 1600 ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...