నేడే నోటిఫికేషన్


Mon,March 18, 2019 03:10 AM

-25 వరకు నామినేషన్ల స్వీకరణ
-26న నామినేషన్ల పరిశీలన, 28న ఉప సంహరణ
-దాఖలుకు అభ్యర్థితో ఐదుగురికి మాత్రమే అవకాశం
అర్బన్ కలెక్టరేట్, మార్చి 17: లోక్ సభఎన్నికల సందర్బంగా సోమవారం నుంచి మొదటి ఘట్టం ప్రారంభం కానుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. ఎన్నికలకు సంబందించిన నోటిఫికేషన్‌ను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈనెల 18 నుంచి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉన్నప్పటికి 18,19,20, 22,25 తేదీల్లో కేవలం ఐదు రోజులు మాత్రమే నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. ఈ నెల 21న హోలీ, 23న 4వ శనివారం కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు సెలవు అమలు చేయడం, 24న ఆదివారం కావడంతో ఈ మూడు రోజులు నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గమనించాలని ప్రశాంత్‌జీవన్ పాటిల్ సూచించారు.

ఎన్నికల నామినేషన్లను హన్మకొండ సుబేదారిలోని పాత కలెక్టరేట్‌లో నెలకొల్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాంబర్ నందు స్వీకరించనున్నట్లు ఆయన చెప్పారు. నామినేషన్ల దాఖలుకు వచ్చే అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు తగు సూచనలు చేసేందుకు తన చాంబర్ ఎదుట ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను ఈ సెల్ నుంచి పొందవచ్చన్నారు. నామినేషన్ దాఖలుకు అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే కలెక్టరేట్‌లోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ అంతా ఫొటో, వీడియో రికార్డు చేయనున్నట్లు ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.

లోక్‌సభ ఎన్నికలకు ఎం-2 ఈవీఎంలు
-కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఎం-2 ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తెలిపారు. హన్మకొండలోని చైతన్య డిగ్రీ కళాశాలలో ఆదివారం వర్ధ్థన్నపేట నియోజకవర్గానికి చెందిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన మొదటి విడత శిక్షణను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ల స్టేటస్, డిస్‌ప్లే యూనిట్లును (ఐఎస్‌డీయూ) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రిసైడింగ్ అధికారుల మాన్యువల్‌ను పూర్తిగా చదవాలని స్పష్టం చేశారు.ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఎదురైతే తక్షణమే స్పందించి సెక్టోరియల్ అధికారి దృష్టికి తేవాలన్నారు. పోలింగ్‌కు ఆటంకం కలుగకుండా రీప్లేస్‌మెంట్ చేయించాలన్నారు. అప్పటి వరకు జరిగిన పోలింగ్ వివరాలను రికార్డు చేసి ప్రిసైడింగ్ అధికారులు రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. పోలింగ్ రోజు పంపాల్సిన నివేదికలపై ప్రాక్టీస్ చేయాలన్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సెక్టోరియల్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వర్ధ్థన్నపేట అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్.మహేందర్‌జీ, తహసీల్దార్లు రవీందర్, జగత్‌సింగ్, ఉమారాణి, మహబూబ్‌అలీ, మాస్టర్‌ట్రైనర్లు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...