బాబుది నీచ రాజకీయం


Mon,March 18, 2019 03:07 AM

-కాంగ్రెస్‌ది దుర్మార్గపు విధానం
-పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో విజయఢంకా
-భారీ మెజార్టీతో ఇక్కడ రెండు సీట్లు గెలుస్తున్నాం
-వలసల్ని పెంచిపోషించిందికాంగ్రెస్ పార్టే
-ఉమ్మడి వరంగల్ జిల్లారూపురేఖలు మారుస్తాం
-త్వరలో ఎంజీఎం సేవలకు ప్రైవేట్ ఆస్పత్రుల గిరాకీ పోతుంది
-ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరు అందిస్తాం
-వరంగల్ మీట్ ది ప్రెస్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ/ న్యూశాయంపేట
చంద్రబాబువి నీచరాజకీయాలు, కాంగ్రెస్ పార్టీది దుర్మార్గపు విధానం అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని లేకుండా చేయాలని ఒకరిపై ఒకరు కుట్రలు పన్నిన వారే ఇప్పుడు పొత్తుల పేరిట అధికారం కోసం ఏకమైన స్థితిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఇదే తీరున రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ తిప్పికొట్టబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎలా ఆశీర్వదించారో, రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే తీర్పు పునరావృతమయ్యేలా ప్రజలు మద్దతు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా అన్ని రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ఆయన అన్నారు. బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై స్పందించారు.

చంద్రబాబుపై నిప్పులు
చంద్రబాబు కాలాంతకుడు. తెలంగాణలోనే కాదు ఆంధ్రాలోనూ టీడీపీని నాశనం పట్టించేదాకా ఆయన నిద్రపోడు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూపుల సంస్కృతిని పెంచి పోషించింది చంద్రబాబే. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడమే మా కొంప ముంచిదని ఆంధ్రాప్రాంతం మంత్రులే కాదు ప్రజలు కూడా చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి ఎర్రబెల్లి
దయాకర్‌రావు సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్‌టీఆర్ టీడీపీ పార్టీ పెడితే అవసరమైతే ఎన్‌టీఆర్‌పైనా పోటీచేస్తాను ప్రకటించి ఓడిపోయాక అదే ఎన్‌టీఆర్ పెట్టిన పార్టీలో చేరిన నాటికే ముఖ్యమంత్రి కేసీఆర్, తాను టీడీపీలో సీనియర్లుగా ఉన్నామని మంత్రి గుర్తుచేశారు. టీడీపీలో గ్రూపులు కట్టి తనతో వచ్చిన కాంగ్రెస్ వాళ్లను ప్రోత్సహించి టీడీపీ వ్యవస్థాపక సభ్యులను తీవ్రంగా అణచివేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు వంటి నీచ, అణచివేత రాజకీయ నాయకుడు లేరని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలోని టీడీపీ నాయకుల్లో ఎవరినీ ఎదగనీయకుండా చేసిన మోసకారి చంద్రబాబు అని పేర్కొన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా తాను ఉంటే రేవంత్‌రెడ్డితోపాటు మరికొందరిని ఎగదోసి తమలో తమకే కొట్లాట పెట్టి పార్టీ నాశనానికి కారకులయ్యారని ఆయన ఆరోపించారు.

స్వార్థం కాదు.. సాయం ముఖ్యం
నాకు స్వార్థం కంటే ఎక్కువ సాయం చేయాలనే ఉద్దేశం ఉంటుంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై మీ సూచనలు సలహాలు సైతం తీసుకుంటానని అన్నారు. సీఎం కేసీఆర్ తనపై గౌరవంతో మంచి పోర్టు పోలియే ఇచ్చారని పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. తన 35 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎవ్వరికీ ఏ హాని తలపెట్టలేదని, సాయం కోసం వచ్చిన ఏ ఒక్కరినీ కాదనకుండా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ప్రజలతో దయన్నగా పిలువబడుతున్నానన్నారు. సీఎం కేసీఆర్ కృషి వలన గ్రామాల్లో మంచి నీటి సమస్య తీరిందన్నారు. దేవాదుల పూర్తి చేస్తానన్నారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకూ నీళ్లు అందేలా చూస్తానని తెలిపారు. ఎస్సారెస్పీకి కూడా దాదాపు 10 టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్ ఉండాలని సీఎం దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వరంగల్ నుంచి తొర్రూర్ వరకు ఎక్కడైనా సరే ఒక రిజర్వాయర్ ఉండాలని తాను ప్రతిపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే మంజూరైన లింగంపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేస్తామన్నారు.

భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ గెలుస్తుంది
రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ ఈ రెండు పార్లమెంట్ స్థానాల నుంచి భారీ మెజార్టీని ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకొని వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని అన్నారు. అన్ని పార్టీల్లోనూ తనంటే గౌరవం ఉందని, జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ముందుకు సాగుతానన్నారు. విలేకరుల సమస్యలపై ఆయన స్పందిస్తూ విలేకరుల సమస్యలను తనకు తెలుసని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. అంతిమంగా జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు.

సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే చేరికలు
దేశంలో వలసల్ని ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని ఆయన స్వాగతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తమతమ నియోజకవర్గాల్లో అమలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. తెలంగాణ వాదాన్ని కించపరిచేందుకు, అణచివేసేందుకు ఆనాడు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే తాను కూడా టీడీపీలో ఉన్నప్పుడు నియోజకర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని చెప్పారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 16 స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచి తీరుతుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తేనే రాష్ర్టానికి అధిక నిధులు తెచ్చి బంగారు తెలంగాణ నిర్మాణంవైపు అడుగులు పడుతాయని ఆయన పేర్కొన్నారు.

వాటర్ ట్యాంకులపై అధికారుల ఫోన్ నంబర్లు
రాష్ట్రంలో నిర్మించే అన్ని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులపై ఆయా ప్రాంతాల ఏఈఈ, డీఈఈ నంబర్లు రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఆయన గుర్తుచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేసవిలో నీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా మిషన్ భగీరథ ద్వారా శాశ్వత నీటి ఎద్దటి నివారణ కాబోతుందన్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చరిత్రాత్మక గ్రామ పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన జరిగినట్టు తెలిస్తే ఆయా గ్రామాల కార్యదర్శులు, సర్పంచ్‌లు సస్పెండ్ అవుతారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో చెత్త కనిపించినా సరే దానికి బాధ్యులు సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులేనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్‌లు అయినా, గ్రామ కార్యదర్శులైనా ఇక నుంచి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు అధికారులను ఆదేశాలు జారీ చేశామన్నారు.

వరంగల్ ఓఆర్‌ఆర్-ఎంజీఎం
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే సంవత్సరానికి రూ. 300 కోట్ల చొప్పున ఇప్పటికే బడ్జెట్‌లో రూ.900 కోట్ల నిధులు వచ్చాయన్నారు. వాటితో వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామన్నారు. అందులో భాగంగా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నాయని చెప్పారు. రింగ్ రోడ్డు పూర్తయితే ఇండస్ట్రీస్ వస్తాయని, దాంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గత 5సంవత్సరాల నుంచి దేశం గర్వించే విధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ వంటి పథకాలను కేంద్రంతో సహా 11రాష్ర్టాలు అమలు చేయడానికి సిద్ధమయ్యాయని అన్నారు. ప్రతీ పల్లెల్లో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయం, గిడ్డంగి ఏర్పాటుకు కృషిచేస్తానన్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఎన్నికలు పూర్తికాగానే ఎంజీఎంపై దృష్టిసారిస్తామని చెప్పారు. ఎంజీఎంలో దొరికే వైద్యసేవలకు నగరంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల గిరాకీ దెబ్బతింటుందని ఆయన అన్నారు. అందరి సహకారంతో గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నకాలంలో ఎంజీఎం పట్ల ప్రజలకు నమ్మకం పెరిగిందని, రేపు అదే చరిత్ర పునరావృతం అవుతుందన్న నమ్మకం తనకుందని అన్నారు.

మంత్రికి సన్మానం..
మీట్ ది ప్రెస్ అనంతరం ప్రెస్‌క్లబ్ కార్యవర్గం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఘనంగా సన్మానించింది. ఈసందర్భంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా విజయం సాధించిన జర్నలిస్టులకు ప్రెస్‌క్లబ్ కార్యవర్గం మంత్రి చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర రైతు రుణవిమోచన సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర వికలాంగ సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, సీనియర్ జర్నలిస్టు దాసరి కృష్ణారెడ్డి, బీఆర్ లెనిన్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, సంతోష్, రమణ, కృష్ణగోవింద్, సుభాష్, అశోక్ పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...