పేదల సంజీవని


Sun,March 17, 2019 04:00 AM

-పేదలకు అందుతున్న మెరుగైన వైద్య సేవలు
-నెరవేరుతున్న ఆరోగ్య తెలంగాణ స్వప్నం
-ప్రైవేట్‌కు దీటుగా ఎంజీఎంలోఆధునిక డయాలసిస్ కేంద్రం
-ఉచిత పరీక్షలతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భరోసా
-సీఎం కేసీఆర్ సార్‌కురుణపడి ఉంటాం
-డయాలసిస్ బాధితులు
ఎంజీఎం, మార్చి 16: రోగుల ప్రాణాలకు భరోసా కల్పిస్తూ..నిరంతర వైద్య సేవలతో.. డయాలసిస్ కేంద్రాలు సంజీవనిగా వర్ధిల్లుతున్నాయి. లక్షలు ఖర్చు చేసి వైద్యం పొందలేని నిరుపేదలకు ఉచిత చికిత్స అందిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. సీఎం కేసీఆర్‌కు చేతులు జోడించి జై కొడుతున్నారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడే రోగులకు డయాలసిస్ పరీక్షలు తప్పనిసరి అవుతుంటాయి. జీవితమంతా పరీక్షల మీదే ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అయితే డయాలసిస్ చేయించుకోడానికి చేతిలో చిల్లిగవ్వలేని పేదల పరిస్థితి ఏంటీ.. వారికి ఎవరు సాయపడతారు.. వారిని ఎవరు ఆదుకుంటారు.. అనే ఆలోచనల నేపథ్యంలో మానవతా మూర్తిగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంజీఎంలో ఉచిత డయాలసిస్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య తెలంగాణ సాకారంలో భాగంగా మొదట రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటునకు శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలోని బోధన వైద్యశాలల ద్వారా వీటిని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన కేంద్రంగా ఎంజీఎం దవాఖానతోపాటు జనగామ, మహబూబాబాద్, నర్సంపేటలోని సర్కార్ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ములుగు, భూపాలపల్లి, ఏటూర్‌నాగారం ఆస్పత్రుల్లో కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ యూజ్డ్ డయాలైజర్ (కృత్రిమ మూత్ర పిండాల యంత్రం) మిషన్‌లతో రోగులకు డయాలసిస్ చికిత్స అందిస్తుండటంతో ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతున్నట్లు స్వయంగా రోగులు పేర్కొంటున్నారు. ఎంజీఎంలో నెలకొల్పిన డయాలసిస్ కేంద్రంలో 14 సింగిల్ యూజ్డ్ డయాలైజర్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరాయంగా రోగుల కు సేవలందిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచే కా కుండా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ర్టాల నుంచి కూడా ఇక్కడి వస్తున్నారు. ఇందు లో సాధారణ రోగులకే కాకుండా ఈహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం) సీఎం రిలీఫ్ ఫండ్‌తో వచ్చే వారికి కూడా డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కిందనే డయాలసిస్ వైద్య సేవలందిస్తున్నారు.

వన్ టైం యూజ్
సింగిల్ యూజ్డ్ డయాలైజర్ విధానాన్ని దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా అమ లు చేస్తుండటం విశేషం. మూత్ర పిండాల వ్యాధి తో బాధపడే రోగులకు డయాలసిస్ సమయంలో ఎటువంటి పరిస్థితి తలెత్తినా నిమిషాల్లో వచ్చి చూసేందుకు నెఫ్రాలజిస్టు డాక్టర్ కుమారస్వామి అందుబాటులో ఉంటున్నారు. అంతేగాకుండా ఇదే విభాగంపై అనుభవం ఉన్న పలువురు వైద్యులు సైతం డయాలసిస్ రోగులకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు.

రీ యూజ్డ్‌తో ప్రాణాలకు ముప్పు ?
డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు డయాలైజర్ రీ యూజ్డ్ యంత్రంతో పరీక్షలు చేయడం వల్ల రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విధానం ద్వారా రోగిలోని మూత్ర పిండాలు మరింత పాడైపోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో రోగులను చేర్చుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు సింగిల్ యూజ్డ్ డయాలైజర్‌కు బదులు డయాలేజర్ రీ యూజ్డ్ యంత్రాలను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నగరంలోని పేరున్న ఆరు కార్పొరేట్ ఆస్పత్రులలో ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలి సి కొందరు రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుం డా నేరుగా ఎంజీఎంలోని డయాలసిస్ కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఆరోగ్యసేవే అసలైన సేవ
పేద ప్రజలకు అందుబాటులో ఖరీదైన వైద్యా న్ని ఉచితంగా అందించడమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పని చేస్తుంది. మనసున్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రజల కష్టాలను చెరిపివేసింది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో అందుబాటులో ఉండే డయాలసిస్ కేంద్రాలు తెలంగాణలో పేదలందరికీ అందుబాటులోకి వచ్చింది. రోగి స్థితిని బట్టి మోతాదును ఖరారు చేసి ప్రతీ వారం వారం డయాలిస్ చేయాల్సి ఉంటుంది. కొందరికి వారానికి ఒకసారి, మరికొందరికి రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. సంవత్సర కాలంగా రోజుకు 40 మంది చొప్పున ఇప్పటి వరకు దాదాపు 15వేల మంది రోగులు ఎంజీఎంలో డయాలిస్ సేవల్ని సంపూర్ణంగా వినియోగించుకున్నారు. అత్యంత ఖరీదైన, నాణ్యమైన వైద్య పరికరాలు, నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల బృందం పర్యవేక్షణలో సేవలందిస్తున్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...