లోక్‌సభ ఎన్నికలకు టీఆర్‌ఎస్ సమరశంఖం


Sun,March 17, 2019 03:56 AM

-నేడు కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
-కలిసొచ్చినగడ్డ నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
-రెండు లక్షల మంది జనసమీకరణ
-స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో భారీ ఏర్పాట్లు
-పరిశీలించిన మంత్రి ఈటల, ఎంపీ, ఎమ్మెల్యేలు
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాబోయే లోక్‌సభ ఎన్నికలను టీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రాష్ట్ర పునర్విభజనతో పాటు గడిచిన ఐదేళ్లలో కేంద్రం వైపు నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకొని.. భవిష్యత్‌లో ఈ సమస్యను అధిగమించేందుకు కసరత్తు చేసింది. ఇందుకోసం మొత్తం ఎంపీలను గెలిపించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా మిత్రపక్షం ఎంఐఎంకు ఒకస్థానం వదిలిపెడితే.. మిగిలిన 16 స్థానాల్లో గులాబీ అభ్యర్థులను గెలిపించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. కలిసొచ్చిన గడ్డ నుంచే నేడు శంఖారవం పూరించబోతున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రం శివారులోని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో మొదటి ప్రచార సభను నిర్వహించనున్నారు.

సాయంత్రానికి ముఖ్యమంత్రి..
ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో బయలు దేరుతారు. ముందుగా తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్‌కు వస్తారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, అక్కడి నుంచి సభా స్థలి వద్దకు రోడ్డు మార్గంలో వస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో సభ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రెండు లక్షల మంది వచ్చే ఈ సభకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి సభకు తరలిరానుండగా.. ఏ నియోజకవర్గం నుంచి ప్రజలు ఎటువైపు రావాలో ముందుగానే ప్రకటించారు. అంతేకాదు, వచ్చే భారీ వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కల్పించారు. అలాగే ద్విచక్ర వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం సభాస్థలి వద్ద డాగ్‌స్కాడ్‌తో తనిఖీలు చేశారు.

పరిశీలించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు..
స్టోర్స్ స్కూల్ మైదానంలో సభా ఏర్పాట్లను శనివారం మధ్యాహ్నం మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. రాత్రి 8గంటలకు ఎంపీ వినోద్‌కుమార్, పార్టీ ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్‌తో కలిసి మరోసారి పరిశీలించారు. సభ వేదికతోపాటు సభకు వచ్చే టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఇతర ముఖ్య నాయకులు, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. సాయంత్రం తర్వాత సభ ఉంటుందని, రాత్రి వేళ ప్రజలకు ఇబ్బంది లేకుండా లైటింగ్ ఉండాలని నాయకులు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ.. సభను కనీవిని ఎరుగని తీరులో విజయవంతం చేస్తామన్నారు. వారివెంట జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, చెన్నాడి సుధాకర్‌రావు, రాకేశ్‌రెడ్డి, కొడూరి సత్యనారాయణగౌడ్, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ముదుగంటి సుధాకర్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...