ఉప ఎన్నిక ఏకగ్రీవం..


Sat,March 16, 2019 01:48 AM

వరంగల్,నమస్తేతెలంగాణ: హైడ్రామా, ఉత్కంఠ నడుమ 19వ డివిజన్ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసిం ది. టీఆర్‌ఎస్ అభ్యర్థి దిడ్డి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప ఎన్నికలో15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి దిడ్డి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉషా దయాళ్ ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు హైడ్రామా సాగింది. తూర్పు ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్ రంగంలోకి దిగి ఏకగ్రీవ ప్రణాళిక రచించి.. సత్తాచాటారు. ఉదయం నుం చి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్పొరేషన్‌లో తిష్ట వేసిన ఎమ్మెల్యే నరేందర్ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా కృషి చేసి విజయం సాధించారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక
19వ డివిజన్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దిడ్డి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారి ఆయన ఎన్నికను ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఉప ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పగడాల సతీష్ నామినేషన్ వేయడమే కాకుండా అదే రోజు కాంగ్రెస్ అధినాయకులతో కలిసి బీఫాంను సమర్పించారు. బీజేపీ అభ్యర్థులుగా ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరికి బైరి శ్యాంసుందర్‌కు బీజేపీ పార్టీ బీఫాం అందజేశారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఇద్దరు, ఆమ్ అద్మీ పార్టీ, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దిడ్డి నాగరాజుకు బీఫాం అందజేశారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన మనోజ్‌గౌడ్, శ్రీరాం రాజేశ్‌తో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దగ్గరుండి నామినేషన్లను ఉపసంహరింపజేశారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పగడాల సతీశ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన ఐదుగురితోపా టు టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో 19వ డివిజన్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడానికి మార్గం సుగమమైంది. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఎమ్మెల్యే నరేందర్ తనదైన శైలిలో చక్రం తిప్పారు.

కార్పొరేషన్ చరిత్రలో రికార్డు
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవ ఎన్నికగా రికార్డు సృష్టించారు. 1994లో కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏ డివిజన్ ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. నాలుగు పాలక మండళ్లలో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో సైతం ఎన్నికలు జరిగాయి. 1995 కార్పొరేషన్ మొదటి పాలకవర్గంలో 1వ డివిజన్ కార్పొరేటర్ యోహన్ అనారోగ్యంతో మృతి చెందగా వచ్చిన ఉప ఎన్నిక జరిగింది. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న దాస్యం వినయ్‌భాస్కర్ ఎమ్మెల్యేగా గెలువడంతో ఆ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికకు సైతం ఎన్నికలు జరిగాయి. అదే పాలక మండలిలో కార్పొరేటర్‌గా ఉన్న చింతం రమేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా వచ్చిన ఉప ఎన్నికకు సైతం ఎన్నికలు జరిగాయి. ఈ పాలక మండలిలో 44 డివిజన్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకు గురికావడంతో ఉప ఎన్నికలు జరిగాయి. అప్పు డు సైతం ఆ డివిజన్‌లో ఎన్నికలు జరిగాయి. మేయర్ నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కార్పొరేటర్ పదవికి రాజీనామాతో 19వ డివిజన్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే తూర్పు ఎమ్మెల్యే సొంత డివిజన్‌కు జరుగుతున్న ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడంలో సఫలీకృతులయ్యారు. కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవ ఎన్నికగా రికార్డును నమోదు చేశారు. కార్పొరేషన్ చరిత్రలో తొలిసారిగా ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి నాగరాజును గెలిపించుకున్నారు.

బీజేపీ హైడ్రామా
ఉప ఎన్నికలో బీజేపీ హైడ్రామా ఆడింది. చివరి వరకూ నామినేషన్‌ను ఉపసంహరించుకోకుండా బీజేపీ అభ్యర్థి బైరి శ్యామ్‌సుందర్ ఉత్కంఠకు తెరలేపారు. 15 మంది నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బీజేపీ అభ్యర్థి బైరి శ్యామ్‌సుందర్ నామినేషన్ ఉపసంహరించుకుంటే ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించారు. అప్పటికే టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ అభ్యర్థితో పాటు నాయకులతో ఏకగ్రీవానికి సహకరించాలని టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. మొత్తం సానుకూలంగా ఉందని భావిస్తున్న తరుణంలో బీజేపీ అభ్యర్థిని తీసుకొచ్చిన బీజేపీ నేతలు చింతాకుల సునీల్, కుసుమ సతీష్ రిటర్నింగ్ అధికారికి బీ ఫాం అందజేసి బరిలో ఉంటున్నామని ప్రకటించారు. దీంతో అప్పటి వరకు ఏకగ్రీవం అనుకున్న టీఆర్‌ఎస్ నేతలు ఖంగుతిన్నారు. అప్పటికీ నామినేషన్ల ఉపసంహరణకు 2 గంటల సమయమే ఉంది. ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రంగంలోకి దిగి బీజేపీ నేతలతో మాట్లాడారు. ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని కోరారు. దీంతో బీజేపీ నేతలు చివరి నిమిషంలో తమ అభ్యర్థి బైరి శ్యామ్‌సుందర్‌తో నామినేషన్‌ను ఉపసంహరింప చేశారు. దీంతో రెండు గంటల పాటు సాగిన హైడ్రామాకు తెరపడింది.

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ అభ్యర్థి
కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పగడాల సతీశ్ టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. నామినేషన్ల గడువు చివరి రోజు నామినేషన్ ఉపసంహరించుకున్న సతీశ్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను కలిశారు. ఆయన సతీశ్‌తో పాటు అనుచరులకు టీఆర్‌ఎస్ కండువాలను కప్పి పార్టీలో ఆహ్వానించారు. నామినేషన్ ఉపసంహరించుకున్న మరుక్షణమే టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీలో క్రీయాశీలకంగా పని చేసిన సతీశ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. తిరిగి ఆయన టీఆర్‌ఎస్ కండువా కప్పుకొని సొంతగూటికి చేరారు.

సత్తా చాటుకున్న ఎమ్మెల్యే నన్నపునేని
19వ డివిజన్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సత్తాచాటుకున్నారు. డివిజన్‌పై తన పట్టును నిరూపించుకున్నారు. రెండున్నర దశాబ్దాల కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవ ఎన్నికకు కృషి చేసి సక్సెస్ అయ్యారు. తన రాజీనామాతో జరుగుతున్న 19వ డివిజన్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి తనదైన శైలిలో పావులు కదిపి విజయం సాధించారు. ఎన్నికల వ్యూహ రచన చేయడంలో దిట్టగా పేరున్న తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 19వ డివిజన్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు.

టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు
19వ డివిజన్ ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నిక కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. గులాబీ రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. పెద్ద ఎత్తున పటాకులు పేల్చారు. జై తెలంగాణ, కేసీఆర్, కేటీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను కార్యకర్తలు ఎత్తుకుని నృత్యాలు చేశారు. కార్పొరేషన్ అవరణ అంతా టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలతో నిండిపోయింది. నాగరాజు కార్పొరేషన్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో వెళ్లారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...