అయ్యో పాపం..


Fri,March 15, 2019 02:51 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ: మగదిక్కు లేదని ఏనాడు చింతించలేదు. మొక్కవోని ధైర్యంతో బరువు బాధ్యతలు మోసింది. ఇద్దరు చెల్లెళ్లకు వివాహం చేసింది.. భర్త ఇంట్లో నుంచి వెళ్లినా ఆమె అధైర్య పడలేదు. రెక్కాడితేనే డొక్కాడే ఆ కుటుంబాన్ని కూలీనాలీ చేసుకుంటూ పోషించింది. ఉన్న ఒక్క కుమార్తెతో గుడారంలో కాలం వెళ్లదీస్తూ కాలం చేసింది. అనాథ కుటుంబంగా బతీకిడుస్తున్న తరుణంలో అమె కుమార్తె ఒంటరిగా మిగిలింది. ఆమె తల్లిదండ్రుల బాధ్యతతో పాటు, తల్లిగా తన బాధ్యతను తీర్చి మధ్యలోనే అనంతవాయువుల్లో కలిసి పోయింది. తన తల్లి శవం వద్ద దిక్కులు పెక్కుటిల్లేలా ఒంటరిగా మారిన కుమార్తె అరణ్యరోదనను చూసి పలువురు కంటి తడి పెట్టారు. ఈ విషాద సంఘటన నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన మెడపోతుల ఐలయ్య, స్వరూప దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె కోమల తల్లి స్వరూప చిన్నతనంలో చనిపోయింది. కోమల వివాహం కాగా కుమార్తె జన్మించిన తర్వాత భర్త వదిలిపెట్టి పోయాడు. దీంతో కోమల పుట్టింటి వద్దే ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఐలయ్యని పోషిస్తూనే మిగితా ఇద్దరు చెల్లెళ్ల వివాహాలను కూడా చేసింది. ప్రస్తుతం తన కుమార్తెతో గుడారంలో కూలీపనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నది. కుమార్తె ప్రియాంకకు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం ముచ్చింపుల తండాలో నాలుగో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అనారోగ్యం బారిన కోమల వైద్యం చేయించుకునే స్థోమత కూడా లేదు. దీంతో ఆమె గురువారం మృతి చెందింది. దహన సంస్కారాల కోసం కూడా ఖర్చులు లేని ఆ నిరుపేద కుటుంబంలో తల్లి శవం పక్కన కుర్చున్న చిన్నారి మౌనంగా రోదిస్తున్నది. గ్రామస్తులు, సర్పంచ్ విరాళాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. పేదరికం ఆ కుటుంబాన్ని చిన్నాబిన్నం చేసింది. అయితే గ్రామంలో అనాథగా మారిన కుమార్తెను చిన్నమ్మలు పోషిస్తామన్నారు. కానీ ఆర్థికంగా ఆకుటుంబాలకు స్థోమత లేదు. దీంతో ఆమె పరిస్థితిపై వెంటనే సర్పంచ్ ప్రకాశ్ జిల్లా బాలిక సంరక్షణాధికారి జీ మహేందర్‌రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఆయన గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని తెలుసుకున్నారు. విషయాన్ని కలెక్టర్ హరిత దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కలెక్టర్ స్పందించి ఆ బాలికకు పూర్తి విద్యను అందించడంతో పాటుగా, పోషణ బాధ్యతను కూడా తీసుకుని వసతి గృహంలో చేర్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చైల్డ్ ప్రొడక్షన్ అధికారి హరికృష్ణ, సర్పంచ్ ప్రకాశ్ ఉన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...