మేధావులనందించిన సీకేఎం


Thu,March 14, 2019 01:30 AM

కాశీబుగ్గ, మార్చి13 : భావి తెలంగాణ నిర్మాణానికి సీకేఎం కళాశాల నుంచి ఎంతో మంది మేధావులు వస్తున్నారని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. దేశాయిపేట్‌లోని సీకేఎం కళాశాలలో బుధవారం స్వర్ణోత్సవాల ముగింపు కార్యక్రమం కళాశాల పాలకమండలి ఉపాధ్యక్షుడు, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టీ సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజంలో ప్రతికూల పరిస్థితులున్న సమయంలో ఆచార్య కే జయశంకర్‌సార్ సీకేఎం కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఎంతో నేర్పు, ఓర్పును సంపాదించి తెలంగాణ సిద్ధాంతకర్తగా చరిత్రలో నిలిచారని అన్నారు. ఇలా చాలా మంది గొప్ప వ్యక్తులను అందించిన సీకేఎం కళాశాల ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పూర్వ విద్యార్థిగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. కళాశాల ప్రారంభమై 50ఏళ్లు పూర్తైన సందర్భంగా గత ఏడాది కాలంగా నిర్వహించిన స్వర్ణోత్సవాలు బుధవారం ముగిసినట్లు చెప్పారు. ఎన్నో కష్టాలను దిగమింగి సీకేఎం కళాశాలలో చదువుకుని గురువుల మార్గదర్శనంలో ముందుకెళ్లిమని, ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. కళాశాలలో నేర్చుకున్న శీలం, విజ్ఞానం, నైతికతలే జీవితంలో ఎదిగేందుకు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పారు. మరో 50 ఏళ్లలో భావి తెలంగాణకు ఇక్కడ నుంచి విభిన్న రంగాలకు చెందిన మేధావులను అందిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

విశ్వనగరంగా హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందులో సీకేఎం కళాశాల విద్యార్థులు అవకాశాలు దక్కించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో సీకేఎంలో అధ్యాపక పోస్టుల భర్తీ తన దృష్టికి తీసుకువచ్చారని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్వర్ణోత్సవ ముగింపు సమావేశాలకు మంత్రులు హాజరుకవాల్సి ఉండగా ఎన్నికలకోడ్ వల్ల వారు రాలేకపోయారని చెప్పారు. కేయూ వీసీ ఆచార్య ఆర్ సాయన్న మాట్లాడుతూ కేయూ కంటే ఏడేళ్లు సీకేఎం కళాశాల ఏర్పడిందని, గొప్ప అకాడమిక్, రీసెర్చ్ నడుస్తున్న కళాశాలల్లో సీకేఎంకు ప్రత్యేకత ఉందన్నారు. అనంతరం కళాశాలలో పదవీ విరమణ పొందిన అధ్యాపకులు, శ్రేయోభిలాషుల పేరు మీద ఏర్పాటు చేసిన స్మారక బంగారు పతకాలను వివిధ యూజీ, పిజీ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వరంగల్ సర్కిల్ ప్రధాన అటవీ సంరక్షణాధికారి ఎంజే అక్బర్, కళాశాల కార్యదర్శి డాక్టర్ చందా విజయ్‌కుమార్, కోశాధికారి సత్యకుమార్, సభ్యులు చందా శ్రీకాంత్, ఈ రామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...