ఆధునిక వైద్యం.. అభివృద్ధి పథంలో ఎంజీఎం


Mon,January 21, 2019 01:45 AM

ఎంజీఎం : నాటి ఆరొందల యాభై పడకల ధర్మాస్పత్రి ఆంధ్రా పాలకుల వివక్ష నుంచి బయటపడి నేడు వేయి పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఎంజీఎం దవాఖానగా అభివృద్ధి చెందింది. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలందిస్తోంది. కనీస సౌకర్యాల కొరత కారణంగా నాడు రోగులకు మెరుగైన సేవలందలేని పరిస్థితి నెలకొన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందే తడవు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పించారు. తెలంగాణకు పెద్ద దిక్కుగా చెప్పుకునే ఎంజీఎం దవాఖానను అందరూ గర్వపడేలా ప్రగతి పథంలో ముందుకు నడిపించారు. పేద, మధ్య తరగతి ప్రజలేగాకుండా ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ఏ చిన్న జబ్బు చేసినా ఇట్టే దవాఖాన బాట పడుతున్నారు. ఈ దవాఖానలో చికిత్స కోసం మన రాష్ట్రం నుంచే గాకుండా పొరుగు రాష్ర్టాలైన ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వందలాదిగా రోగులు వస్తుంటారు. దీంతో దవాఖాన తరచూ రోగుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులు సైతం దవాఖానలో చేరి చికిత్స అనంతరం క్షేమంగా ఇంటికెళ్తున్న సంఘటనలు ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దవాఖానను పలుమార్లు సందర్శించిన నేపథ్యంలో ఎంజీఎం దవాఖానను ఆధునిక వైద్య సదుపాయాలతో నెలకొల్పి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో దవాఖానను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇందుకోసం లక్ష్యంతో కోట్ల రూపాయల నిధులను కేటాయించారు.

కోట్లు విలువ చేసే ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతోపాటు పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగునంగా ఆధునిక హంగులతో నూతన భవన సముదాయాలను నిర్మించారు. ఇప్పటి వరకు ఎంజీఎం దవాఖానకు రోగులకు ఆధునిక వైద్య సేవలందించడం కోసం సీఎం కేసీఆర్ చొరవతో రూ. 1.30 కోట్లతో డిజిటల్ రేడియోగ్రాఫి (క్షణాల్లో శరీరంలోని ఏదేని భాగాన్ని ఎక్స్‌రే తీసే జర్మనీ నుంచి తెప్పించిన ఆధునిక యంత్రం) అత్యవసర చికిత్సా కేంద్రంలో రోడ్ల ప్రమాదాలు, ఘర్షణలు, ఛాతీ నొప్పి ఇతరత్ర పరిస్థితుల్లో ఎక్స్‌రే తీయడం కోసం వినియోగించే సుమారు రూ. 40 లక్షలు విలువ చేసే కంప్యూటర్ రెడియోగ్రఫీ (సీఆర్ మిషన్), అదేవిధంగా మొన్నటి ఆర్థిక పరిస్థితులను తాళలేక హైదరాబాద్ కెళ్లి రేడియేషన్ ఇప్పించుకుని వచ్చిన రోగుల సౌకర్యార్థం ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో ధార్మిక శక్తి (రేడియేషన్)ఇచ్చే సుమారు రూ.1. 25 కోట్ల విలువైన చెన్నయ్ నుంచి తెప్పించిన కోబాల్ట్ సిస్టమ్, గంటలో వంద జతలకుపైగా బట్టలను ఉతికి ఆరవేసే సుమారు రూ. 40 లక్షల విలువ చేసే మెకానైజ్డ్ ల్యాండ్రిని అందుబాటులోకి తెచ్చారు. తల్లీ బిడ్డల మరణాలను తగ్గించి వారిని క్షేమంగా ఇల్లు చేరే విధంగా మెరుగైన వైద్య సేవలందించడం కోసం పిల్లల వార్డుకు సమీపంలో ప్రత్యేకించి మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆధునిక వసతుల కల్పనతో ఎంసీహెచ్ భవనంతోపాటు పుట్టుకతో వచ్చే రుగ్మతల నుంచి సాధారణ స్థితికి తీసుకురావడం కోసం నిర్మించిన నూతన భవన సముదాయాలను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఖరీదైన వైద్యం పొందలేని పేద రోగుల కోసం ఆధునిక పద్ధతులతో దవాఖానలోని గుండె జబ్బుల వార్డుకు సమీపంలో సింగిల్ ఫిల్టర్ విధానంతో డయాలసిస్ సెంటర్‌ను నెలకొల్పడం రోగులకెంతో ఊరట లభిస్తోంది. ఇక్కడి వైద్యులు, సిబ్బంది వారికి నిరంతరం అందుబాటులో ఉండి వైద్య సేవలందిస్తున్నారు. కుటుంబ సభ్యుల వలే సాయపడుతుండటం రోగికి ఒకింత మానసిక భరోసా ఇచ్చినట్టవుతోంది.

240
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...