ఆటోనగర్‌లో ఐదు వాహనాలు దగ్ధం


Mon,January 21, 2019 01:44 AM

పోచమ్మమైదాన్, జనవరి 20: వరంగల్ ఆటోనగర్‌లో మరమ్మతు కోసం పార్క్‌చేసి ఉన్న ఐదు వాహనాలు దగ్ధమైన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మట్టెవాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అయితే ఇక్కడ ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సరైన ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. వరంగల్ ఆటోనగర్‌లో చాలా వరకు పాత వాహనాలను మరమ్మతు చేస్తుంటారు. మెకానిక్ షాపుల వద్ద మరమ్మతు కోసం ఐదారు కార్లు పార్క్‌చేసి ఉన్నాయి. వీటిని మెకానిక్‌లు మరమ్మతు చేసి వాహన యజమానులకు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆదివారం దాదాపు తెల్లవారుజామున 3నుంచి 4గంటల మధ్యలో పార్క్‌చేసి ఉన్న కార్లు కాలిపోతూ మంటలు లేచాయి. అక్కడ ఉన్న వాచ్‌మెన్లు నిర్వాహకులకు సమాచారం అందించడంతో వారు ఆటోనగర్‌కు చేరుకున్నారు. పరిస్థితిని గమనించి ఫైర్ ఇంజిన్ అధికారులకు ఫోన్ చేశారు. అయితే ఫైర్ సిబ్బంది ఫోన్ ఎత్తకపోవడంతో మెకానిక్‌లు నేరుగా ఫైర్ ఆఫీసుకు వెళ్లి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకవచ్చిన్పటికీ అప్పటికే చాలావరకు వాహనాల పరికాలు దగ్ధం అయ్యాయి. సుమారు రూ.ఐదు లక్షల నష్టం వాటిల్లినట్లు మెకానిక్‌లు చెబుతున్నారు.

ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు..
వాహనాలు దగ్ధమైన ఘటనపై మెకానిక్‌లు పోలీసులకు సకాలంలో సమాచారం అందించలేదు. దీంతో వారు ఆదివారం ఉదయం చేరుకుని ఈ విషయంపై ఆరా తీశారు. మట్టెవాడ సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు అక్కడి వర్కర్స్, వాచ్‌మెన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, సీసీ కెమెరాలు వారం రోజులుగా పనిచేయకపోవడంతో ఆధారాలు లభించలేదు. అయిప్పటికీ ఆటోనగర్‌లో వ్యక్తిగతంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో కూడా ఘటన జరిగిన తీరు స్పష్టంగా కన్పించకపోవడంతో పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. పలు చోట్ల పేరుకుపోయిన చెత్తకుప్పలు ఉండడంతో ఎవరైనా సిగరేట్ కాల్చి పడేయడం వల్ల జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...