ముగిసిన నృత్త రత్నావళి సదస్సు


Fri,January 18, 2019 01:56 AM

నిట్‌క్యాంపస్, జనవరి 17 : వేదవేదాంగాల్లో నిర్వహించిన నృత్యంలో శాస్త్ర ప్రయోగాలపై ప్రత్యేకంగా నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న నాట్యశాస్త్ర పరిశోధకులు సమర్పించిన పరిశోధనాంశాలు చరిత్రకారులను, నృత్య కళాభిమానులను ఆకట్టుకున్నాయి. నక్కలగుట్టలోని హరితా హోటల్‌లో నృత్తరత్నావళిపై శాస్త్రప్రయోగ అనే అంశంపై జరిగిన సదస్సులో రెండో రోజు నాట్యశాస్త్ర ప్రముఖులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సులో భాగంగా గురువారం ప్రత్యేకించి ప్రొఫెసర్ చూడామణి నందగోపాల్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ హెడ్ డాక్టర్ అద్వైతవాదినికౌల్, ప్రముఖ నాట్యాచారులు డాక్టర్ కళాకృష్ణ నృత్యరీతుల్లో దాగిఉన్న అర్థాలను, వాటి సారాన్ని ఆవిష్కరించారు. వీరితో పాటు డాక్టర్ అరుణాభిక్షు, డాక్టర్ సంప్రీతి, డీఎల్ తేజస్విత, డాక్టర్ యశోదా ఠాకూర్ నృత్తరత్నావళిలోని పలు నృత్యరీతులపై అభినయ భావాలను వివరించారు. అనంతరం మద్రాస్ ఆర్కియాలజీ పూర్వపు డైరెక్టర్ పద్మభూషన్ నాగస్వామి మాట్లాడారు. నాట్యశాస్త్ర భంగిమల గురించి యువ కళాకారులు చాలా బాగా అభినయించారని ప్రశంసించారు. వీరిలో గొప్ప నాట్యకళ దాగి ఉందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఇంటాక్ కన్వీనర్, రిటైర్డ్ నిట్ ప్రొఫెసర్ ఎం పాండురంగారావు మాట్లాడారు. శాస్త్ర-ప్రయోగ అనేది సైన్స్ అండ్ అప్లికేషన్ అనే అర్థ్ధంలో నిర్వహించిన నృత్తరత్నావళి సదస్సుకు అపూర్వ స్పందన లభించిందని తెలిపారు. అనంతరం ఆయన సదస్సు పాల్గొన్న కళాకారులను, అతిథులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కియాలజీ విభాగం నుంచి రంగాచారి, చరిత్రకారులు, పర్యాటక శాఖ అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.

పంచాంగాలతో పేరిణికి నవ్యరీతులు
పేరిణీ-రీకన్ట్రక్షన్ పేరుతో నృత్యరీతుల్లో దాగిఉన్న అర్థ్ధాలను వివరిస్తూ ప్రముఖ నాట్యాచారులు డాక్టర్ కళాకృష్ణ పత్రసమర్పణ చేశారు. తన శిష్యురాలు సాత్వికతో పంచాంగాలను ప్రదర్శింపజేస్తూ, పేరిణి నృత్యరూపాలను పరిచయం చేశారు. ఛావల, సిరిబిరం, కళుహుళం, అలఘ్నపాఠం, పాటవం భంగిమలను అంగీకాభినయం నేపథ్యంతో వివరించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు..
రెడ్డికాలనీ : చారిత్రక వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండ్రోజుల శాస్త్ర-ప్రయోగం నృత్తరత్నావళి సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం సాయంత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథులుగా కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పద్మభూషణ్ ఆర్ నాగస్వామి, సచ్చిదానంద జోషి, ప్రొఫెసర్ పాండురంగారావు, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడారు. రెండ్రోజుల శాస్త్ర-ప్రయోగం నృత్తరత్నావళి జాతీయ సదస్సు వరంగల్‌లో నిర్వహించుకోవడం శుభసూచకమన్నారు. కవులు, కళాకారులకు వేయిస్తంభాల గుడి కళాప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శివరాత్రి వరకు అందజేస్తామన్నారు. అనంతరం పద్మభూషన్ నాగస్వామి మాట్లాడుతూ ఎంతో గొప్ప చరిత్ర కలిగిన వరంగల్ నగరంలో జాతీయ సదస్సు నిర్వహించడం చారిత్రక కట్టడాలను పరిరక్షించి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత కవులు, కళాకారులపై ఉందన్నారు.

దేశవిదేశాల్లో నృత్య ప్రదర్శనలు చేసిన శ్రీకళాకృష్ణ శివానంద ట్రస్టు నిర్వాహకులు బీ సుధీర్‌రావు పేరిణి శివతాండవం ప్రదర్శించారు. కేరళకు చెందిన డాక్టర్ దీప్తిఓంచేరి, బెంగుళూరుకు చెందిన విద్య రామప్ప దేవాలయంపై ఉన్న ప్రముఖ నృత్యరీతులను ప్రదర్శించారు. సుధీర్‌రావు బృందం కాకతీయ కళావైభవం, కుప్పా పద్మజ బృందం ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, తాడూరి రేణుక బృందం, కళాకారులు తమ బృందాలచే వివిధ రకాల నృత్య ప్రదర్శనలు చేశారు. ముందుగా కేంద్ర సంగీత నాట్యఅవార్డు గ్రహిత కళాకృష్ణ శిష్యురాలు సాత్విక పేరిణి నృత్యప్రదర్శనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వ్యాఖ్యతగా శ్రీకాంత్, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు నుంచి శ్రీధర్‌రావు, నృత్తరత్నావళిని అనువదించిన యశోదా ఠాకూర్, చూడామణి నందగోపాల్, అధ్యాయత వాదిని, డాక్టర్ దీక్షిత్ పాల్గొన్నారు. ఇంకా ఈ ప్రాంత ప్రత్యేక నాట్యమైన పేరిణి, కుండలతో దీపాలను ప్రదర్శించిన నాట్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.

229
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...