ఎన్నికల సమరాంగణ...!


Fri,December 14, 2018 02:01 AM

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురువారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. బుధవారం పార్టీ శాసససభాపక్ష సమావేశం సందర్భంగా ఆయన రాబోయే ఆర్నెళ్లల్లోపు అన్ని స్థాయిల ఎన్నికలు పూర్తిచేయాలనే విషయాన్ని స్పష్టం చేయడంతోపాటు రాష్ట్ర హైకోర్టు కూడా జనవరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం గత కొంతకాలంగా అదే పనిలో నిమగ్నమైంది. గ్రామ పంచాయతీల్లో బీసీ ఓటర్ల లెక్క తేల్చినా, ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే పరిశీలించి మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటే చేసి ఈనెల 15 కల్లా గ్రామాల వారీగా తేల్చి తుది బీసీ ఓటర్ల జాబితాను ప్రకటించే ప్రక్రియ వేగవంతమైంది.

ఇదే సమయంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సహకార శాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వెంటనే శాసనమండలి ఉపాధ్యాయ నియోజకర్గం (ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల) ఎన్నికల కసరత్తుతోపాటు వచ్చే ఏప్రిల్ చివరి వారంలో గానీ, లేదా మే చివరినాటికి పార్లమెంట్ ఎన్నికలు. అంటే ఇప్పటి నుంచి వచ్చే ఆర్నెళ్లు అంతా ఎన్నికల వాతావరణమే. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ రద్దు అయినప్పటి నుంచి దాదాపు రెండునెలపైనే ఎన్నికల వాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్ పార్టీ స్థిరమైన ప్రగతి నమూనాతో ముందుకు సాగుతున్న నేపథ్యంలోనే ప్రజల విశ్వాసం, అభిమానం, కృతజ్ఞతలు సొంతం చేసుకున్న స్థితే రేపు అన్ని స్థాయిల ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయని ఈ అసెంబ్లీ ఫలితాలు స్పష్టం చేశాయి. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే రెండు సీట్లు పెరగడమే కాకుండా టీఆర్‌ఎస్‌కు గణనీయమైన ఓటింగ్ శాతం పెరిగింది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఛరిష్మా, ఆయన పట్ల అమితమైన విశ్వాసం వెరసి అసెంబ్లీ ఫలితాల వలె గెలుపు ఏకపక్షంగా ఉండబోతుందన్న వాతావరణం నెలకొన్నది.

పీఏసీఎస్ ఎన్నికలకు సమాయత్తం..
ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పీఏసీఎస్‌ల పాలక వర్గం పదవీకాలం ఈ ఏడాది 2018 జనవరితో ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరునెలలు పాటు అక్టోబర్ వరకు కాలపరిమితి పొడిగించింది. ఇది కూడా ముగిసి రెండు నెలలు కావొస్తున్న దరిమిలా, ఎన్నికల నిర్వహించడానికి రాష్ట్ర సహకార శాఖ సమాయత్తమైంది.

ఈమేరకు ఈనెల చివరినాటికి సభ్యు ల( ఓటర్లు) తుదిజాబితాను సొసైటీ వారీగా ఆయా పీఏసీఎస్ కార్యాలయాల ముందు ప్రకటించాలని , రాష్ట్ర సహకారశాఖ నుంచి జిల్లా సహకార శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఓటర్ల జాబితా అభ్యతరాలు, సభ్యుల సూచనలు స్వీకరించడానికి జిల్లా సహకార శాఖ అధికారి కరుణాకర్ గురువారం ప్రకటన విడుదల చేశారు. స్థానిక పీఏసీఎస్ సీఈవో ఈనెల 12 నుంచి 21 తేదీ వరకు సభ్యుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. 22వ తేదీన తుది జాబితా ప్రకటిస్తారు. 23వ తేదీన తుది జాబితా ఓటర్ల లిస్టును ఆమోదిస్తారు. పీఏసీఎస్ సీఈవోల నుంచి జిల్లా సహకార శాఖ అధికారికి వచ్చిన తుది జాబితాపై 24నుంచి 27 తేదీ వరకు డీసీవోకు సభ్యులు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అలాగే సూచనలు కూడా తెలుపవచ్చు. 27వ తేదీన జిల్లా జాబితా రిజిస్ట్రార్‌కు వెళ్తుతుంది, 28వ తేదీన రిజిస్ట్ట్రార్ తుది జాబితాను ఆమోదించి 30వ తేదీన రాష్ట్ర సహకార ఎన్నికల అదికారికి పంపిస్తారు. ఈప్రక్రియ ముగియగానే వచ్చే జనవరి చివరి వారంలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

సహకార సంఘాలివే..
వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం 12 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. ఖిలావరంగల్, ధర్మసాగర్, కాజీపేట దర్గా, ఎల్కతుర్తి, మల్లారెడ్డిపల్లి, హసన్‌పర్తి, కమలాపూర్, నందనం, వంగపహాడ్, శనిగరం, పెగడపల్లి, హన్మకొండ.

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ..
టీచర్స్ ఎమ్మెల్సీ గడువు కూడా సమీపిస్తుండటంతో రెవెన్యూ యంత్రాంగం దీనిపై దృష్టి సారించింది. ఈ నియోజకర్గం నుంచి పూల రవీందర్ ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం పూర్తి కావొస్తుండడంతో నిర్దేశిత గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన యంత్రాంగం కార్యాచరణ కొనసాగుతున్నది.

దీనిపై శుక్రవారం నల్గొండలో ఓటర్ల జాబితా, ఏర్పాట్లు మొదలైన అంశాలపై కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గతంలో ఉన్న 11 వేల ఓటర్లున్నారు. అయితే ఈనెల 20వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ, తుది జాబితా ప్రకటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై వరంగల్ అర్బన్ జిల్లాలో దాదాపు మూడు వేల మంది ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వేల కొత్త దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

పార్లమెంట్ ఎన్నికలకూ సమాయత్తం..
వచ్చే మే 31తో ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం ముగుస్తుండడంతో ఫిబ్రవరి, లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ మేరకు తలమునకైంది. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా మొదలైన అంశాలను పూర్తిచేసే అవకాశాలున్నాయి. మొత్తంగా వచ్చే ఆర్నెళ్లపాటు పోరు సమరాంగణమే కాబోతుండటం విశేషం.

పల్లెపోరుకు సమాయత్తం
వరంగల్ అర్బన్ జిల్లాలోని 130 గ్రామ పంచాయతీలకు గాను 129 గ్రామ పంచాతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అధికార యంత్రాంగం కసరత్తు ప్రక్రియ వేగవంతమైంది. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ పంచాయతీకి 2020 వరకు సంపూర్ణ పాలకవర్గం ఉన్న నేపథ్యంలో ఈ ఒక్క గ్రామంలో మినహాయిస్తే అన్ని గ్రామాల్లోనూ ప్రస్తుతం ఉన్న ఎన్నికల వాతావరణమే కొనసాగబోతున్నది. జిల్లాలోని ఏడు గ్రామీణ మండలాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మొదటి దశలో కమలాపూర్, ధర్మసాగర్, ఐనవోలు మండలాలు, రెండో దశలో హసన్‌పర్తి, వేలేరు, భీమదేవరపల్లి మండలాలకు, చివరి (మూడో) దశలో ఎల్కతుర్తి మండలంలోని గ్రామ పంచాతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓటర్ల జాబితా, జనాభా విషయంలో కొలిక్కి వచ్చినా రిజర్వేషన్ల ప్రక్రియలో అతి ముఖ్యమైన బీసీ ఓటర్ల సంఖ్య తేలింది. అయితే ఈనెల 15న తుది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కాగానే రిజర్వేషన్ల దామాషా పద్ధతి ఖరారవుతుంది. గతంలో పాటించిన రిజర్వేషన్ పద్ధతినే పాటించాలి. ఇందులో 50 శాతం మహిళా రిజర్వేషన్లతోపాటు, అర్బన్ జిల్లాలో కొత్తగా ఐదు తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన నేపథ్యంలో అక్కడ రిజర్వేషన్ ఎస్టీలకే తేలిపోయింది. అయితే గతంలో రిజర్వేషన్ల విషయంలో ఎస్టీలకు 8.69 శాతం, ఎస్టీలకు 23.63 శాతం, బీసీ వర్గాలకు 30.60శాతంతోపోనూ మిగిలినవి ఇతరులకు (జనరల్)గా ఉన్నాయి. అయితే దాదాపు ఇదే పద్ధతి అనుసరించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నా, అనుసరించే విధానం, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి వచ్చే తాజా మార్గదర్శకాల ప్రకారం ఉంటుందని, అది బహుశా ఈనెల 15వ తేదో ఆ తెల్లారో దీనిపై స్పష్టం అయ్యే అవకాశాలున్నాయి.

325
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...