స్మార్ట్‌సిటీ పనులు వేగవంతం చేయాలి


Fri,December 14, 2018 02:00 AM

వరంగల్,నమస్తేతలంగాణ, డిసెంబర్ 13 : స్మార్ట్‌సిటీ మిషన్ పథకంగా భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ అధికారులలో ఆయన స్మార్ట్‌సిటీ పనులు, వాటి పురోగతిపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నగరంలో స్మార్ట్‌సిటీ మిషన్‌లో భాగంగా రూ.1773 కోట్ల నిధులతో 75 అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. మొదటి విడుతలో రూ.1.20 కోట్లతో భద్రకాళి బండ్ పుణరుద్ధరణ, సుందరీకరణ పనులు, రూ.40 లక్షలతో 13 కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధి, ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. రూ. 80 కోట్లతో భద్రకాళి చెరువు వెంట డ్రైనేజీ, బండ్ పనులు, పద్మాక్షి ఆలయ అవరణ అభివృద్ధి పనులు మొదటి విడుత స్మార్ట్‌రోడ్డు పనులు చేస్తున్నామన్నారు. అలాగే పబ్లిక్ గార్డెన్ అభివృద్ధి పనులు, విద్యుత్ లైన్ల మార్పు, ఎంజీఎంలో ఎస్‌టీపీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులు వివిధ దశలో ఉన్నాయని అన్నారు. రూ. 26.68 కోట్లతో స్మార్ట్ ప్రాంతీయ లైబ్రరీ, స్మార్ట్ సెంట్రల్ లైబ్రరీ, కమాండ్ కంట్రోల్ రూం, వీడియో పోల్, వరంగల్ నుంచి ఖమ్మం రోడ్‌లో 5 ప్రవేశ తోరణాలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు టెండర్లు పూర్తయ్యాయని అయన తెపారు.

రూ. 421.5 కోట్లతో ఒకటో ప్యాకేజీ స్మార్ట్ రోడ్లు, ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల అభివృద్ధి, రోడ్లు పూడ్చే యంత్రాలు కొనుగోలు, ఉర్సు చెరువు అభివృద్ధి పనులు, మాస్టర్ సిస్టమ్, ఇంటిగ్రెటెడ్ పర్యావరణ పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. హట్ స్పాట్ జోన్ల ఏర్పాటు, భద్రకాళి వద్ద విహర ప్రదేశం, వెయ్యి స్తంభాల దేవాలయల, టౌన్ హల్ సుందరీకరణ, మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనుల టెండర్లకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రూ. 451 కోట్లతో 54 అభివృద్ధి పనులు సమగ్ర కార్యచరణ రూపొందించాల్సి ఉందన్నారు. రూ.391 కోట్లతో భద్రకాళి వద్ద పుష్కరణి అభివృద్ధి, స్మార్ట్ వాటర్ మీటర్స్ కొనుగోలు, వివిధ ప్రదేశాలలో పార్కింగ్ స్థలాల అభివృద్ధి, వర్షం నీటి సేకరణకు చర్యలు , ఉర్సు గుట్ట వద్ద సాంకేతిక కేంద్రం ఏర్పాటు, బంధం చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువులో నీటి అభివృద్ధి పనులు హన్మకొండ కూడలిలో ప్లాజా నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని, టెండర్ల ప్రక్రియను వారం లో చేపట్టాల్సి ఉందన్నారు. జనవరి 15వ తేదీలోగా పనులు చేయాలని, మార్చి 15 నాటికి అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో బల్దియా ఎస్‌ఈ భిక్షపతి, ఈఈ విద్యాసాగర్, ఏఈ రోజా రాణి, లీ అసోషియేట్స్ ప్రతినిధులు అనంద్, శ్రీనివాస్, సుజిత్, చలపతి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

243
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...