నిర్మాణాత్మక ప్రగతి..సరికొత్త దిశానిర్దేశం


Thu,December 13, 2018 03:18 AM

-త్వరలో బతుకమ్మ చీరెల పంపిణీ
-ఏప్రిల్ కల్లా భగీరథ పూర్తి చేయాలి
-గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిత్తశుద్ధితో పనిచేయాలి
-అన్ని జిల్లాల్లో మూడునెలల్లో పార్టీ కార్యాలయాలు
-కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ.. అందరి భాగస్వామ్యం
-టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలిచ్చిన తీర్పునకు అనుగుణంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవాళ్లం బాధ్యతగా వ్యవహరించాలని, జవాబుదారీతనంతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. నిర్మాణాత్మక ప్రగతి దిశగా అడుగులు వేసి ప్రజల విశ్వాసానికి అనుగుణంగా, వారి నమ్మకాలను వమ్ముచేయకుండా పనిచేయాలని ఆయన ఎమ్మెల్యేలకు హితవు పలికారు. ప్రజలిచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రజాసంక్షేమం, అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణ ప్రజల చైతన్యం చరిత్రాత్మకమైనది పేర్కొంటూనే ఆ ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు ఎవరికివారు బాధ్యతగా, భయంతో, భక్తితో పనిచేసి ప్రజల మనసులు గెలవాలని పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏకోన్ముఖంగా అన్ని స్థాయిల్లో చిత్తశుద్ధితో పనిచేయాలని స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలిచ్చిన తీర్పు అసామన్యమైనదిగా పేర్కొంటూ వారి కష్టసుఖాల్లో ప్రతీ ఒక్కరూ తాము ఎమ్మెల్యేలం అని కాకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మసలుకోవాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రత్యేక శాసనభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలకు సరికొత్త దిశానిర్దేశం చేశారు. నిర్మాణాత్మక ప్రగతికి అందరూ కష్టపడి పనిచేయాలని, ప్రజల విశ్వాసాన్ని వారి నమ్మకాలను వమ్ముచేయకుండా చేసుకోవాలని ఆయన చెప్పారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని గెలిచినం..ఇక ఐదేండ్ల దాకా మాకు ప్రజలతో పనేంటి అనే ధోరణితో కాకుండా నిరంతరం ప్రజల పక్షం వహించి వారి సాధక బాధకాల్లో భాగస్వాములు కావాలని హితవు పలికారు. స్థానిక సంస్థలు, ఆ తరువాత వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దాదాపు వచ్చే ఆర్నెళ్లల్లో పూర్తి అయ్యే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో తక్షణమే బతుకమ్మ చీరెల పంపిణీ పూర్తిచేయాలని, అంతేకాకుండా ఏప్రిల్ నెలాఖరుకల్లా ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్‌భగీరథ పనులు పూర్తిచేసి తెలంగాణ ఆడబిడ్డకు టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే అని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి పార్లమెంట్ ఎన్నికల కోసం
స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేసి రాష్ట్ర ఎన్నికల సం ఘం విధించిన నిర్దేశిత గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియకు పార్టీ శ్రేణులు సహకరించాలని, ఆ బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎక్కడిక్కడ ఎ మ్మెల్యేల సారథ్యం వహించాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు బహుశా వచ్చేనెల చివరి వారంలో నిర్వహించుకునే అవకాశం ఉన్న నేపథ్యం లో టీఆర్‌ఎస్ శ్రేణులు వాటిపై దృష్టి సారించేవిధంగా సమన్వ యం చేసుకునే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏప్రిల్ చివరినాటికి ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు
టీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి దాదాపు పూర్తి కావచ్చిన మిషన్ భగీరథ పథకం వచ్చే ఏప్రిల్ కల్లా పూర్తిచేసి తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని వందకు వందశాతం నిలబెట్టుకోవాలని, దీన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా ఎమ్మెల్యేలు గుర్తించి ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే బల్క్ వాటర్ అన్ని గ్రామాలకు చేరింది. ఇంట్రా వర్క్స్ మెజారిటీ పూర్తయింది. మిగిలిన పనుల్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, అందుకు ఎమ్మెల్యేలు అందరూ తమతమ నియోజకవర్గాల్లో వెంటపడి ఈ పనుల్ని చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రక్షాళన దిశగా పార్టీ
టీఆర్‌ఎస్ పార్టీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తుందా..? అంటే శాసనసభా పక్ష సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, సీఎం కేసీఆర్ పార్టీపై దృష్టి కేంద్రీకరించారని స్పష్టమైంది. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై ఒకవైపు దృష్టి సారిస్తూనే మరోవైపు కార్యకర్తలు, నాయకులకు శిక్షణా శిబిరాలు ఉండేవిధంగా కసరత్తు సాగుతున్నదని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతీ ఒక్కరినీ పార్టీ అధినేతగా ఆయన అందరినీ తన కడుపులో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. ఈ పనిలో ఎమ్మెల్యేలు కీలక భాగస్వామ్యం, సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం స్థలాల సేకరణ పూర్తి అయిన నేపథ్యంలో వచ్చే మూడునెలల్లో అన్ని జల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మాణం పూర్తి చేసుకుందామన్నారు.
గవర్నర్ కలిసిన
ఎమ్మెల్యేల బృందంలో దాస్యం వినయ్‌భాస్కర్
శాసనసభా పక్ష సమావేశం అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల జాబితా, శాసనసభాపక్ష నాయకుడి ఎంపిక పత్రాలను రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం అందజేసింది. ఆ బృందంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ కూడా ఉన్నారు.

తక్షణమే బతుకమ్మ చీరెల పంపిణీ
బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీకి జిల్లాలకు వచ్చిన చీరెల్ని సాధ్యమైనంత తొందరలో పంపిణీ చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. గత అక్టోబర్‌లో బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, కోర్టుకు వెళ్లి ఆపడం వల్ల జిల్లాకు చేరిన చీరెల్ని పండుగ పూట పంపిణీ చేయకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే రెండు మూడు రోజుల్లో బతుకమ్మ చీరెల పంపిణీకి సంబంధించిన నిర్ణయం తీసుకొని వాటి పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తిరుపతి దర్శనం చేసుకున్నంత సంబురం ఉంది
తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో తొలిసారి గా గెలిచి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసిన క్షణాలు తనకు అత్యంత అపూర్వమైనవి. తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని ఎల్‌వన్ దర్శనం (దేవుడిని అత్యంత దగ్గరగా చూసే భాగ్యం) చేసుకున్నప్పుడు పొందిన భా గ్యం తాను ఎల్‌పీ సమావేశంలో పొందా. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హోం వర్క్‌ను క్రమం తప్పకుండా చేసుకుని ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుం టా. ఎప్పటికప్పుడు సీఎం మార్గనిర్దేశంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తా.
- నన్నపునేని నరేందర్ , వరంగల్ తూర్పు ఎమ్మెల్యే

219
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...