కూటమి కుదేల్..


Thu,December 13, 2018 03:14 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ:మహాగుణపాఠం. చంద్రబాబు మళ్లీ తెలంగాణకు రావడమే తమ పాలిట మరణశాసనం.. ఇదీ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల అంతర్మథనం. కూటమిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఊరు కాలిపోయినంక ఊదుకు పోయినట్టుగా ఉందని.. చంద్రబాబును నెత్తినపెట్టుకొని ప్రజల్లోకి రావడమే తమ కొంపముంచిందని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కూటమి కుదేలైందని.. పొత్తుల కుంపటి రాజేసిన కాష్టం కాంగ్రెస్ పార్టీ ఉసురు తీసిందని పేర్కొంటున్నారు. ప్రజల విశ్వాసాలు, ప్రత్యేకించి ఓరుగల్లు చైతన్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు నోట్ల కట్టలకు ఆశపడ్డాక.. ఇప్పుడేడిస్తే ఏం లాభం అని ఆ పార్టీ నాయకులు విశ్లేషించుకుంటున్నారు. మహాబుద్ధి వచ్చింది. అతివిశ్వాసానికి పోయి బొక్కాబోర్లా పడ్డామని దిగాలు చెందుతున్నది. ఎన్నికల నుంచి ఎన్నికల దాకా ప్రజల మొహం ఎరుగని నాయకులు మళ్లీ ఎన్నికలు అనగానే నోటుతో ఓటును కొనేయాలని భ్రమపడిన వాళ్లకు శృంగభంగం తప్పదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. ప్రజలకు దూరంగా ఉన్నవాళ్లను ప్రజలు ఛీత్కరించుకుంటారని ఓటుతో తగిన గుణపాఠం చెప్పారు. ప్రజల మధ్య ఉండకుండా, ప్రజల కష్టసుఖాల్లో భాగం కాకుండా కేవలం ఎన్నికలప్పుడే వచ్చిపోయే నాయకులు తమకు అక్కరలేదని ప్రజలు ఈడ్చికొట్టారు. ఇంత చేసినా ఓడిపోయిన నాయకులు హుందాతనాన్ని ప్రదర్శించకుండా ప్రజల తీర్పును గౌరవించకుండా, తప్పిదాలను గుర్తించకుండా ఓటమికి కారణం తాము కాదని బుకాయిస్తూ ఆ తప్పు ఈవీఎంలదేనని పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఎన్నికల ప్రక్రియ మొదలవగానే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అన్ని స్థాయిల్లో ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల పరిశీలన, పనితీరు, ఫలితాలు ఇలా అన్ని స్థాయిల్లో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అన్ని క్షుణ్నంగా పరిశీలించి, అభ్యంతరాలుంటే చెప్పండని కోరి వారి లిఖిత పూర్వక ఆమోదంతో ఈవీఎంలపై నిర్ణయం తీసుకోవడం సర్వసాధారణం. ఆ ప్రక్రియను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా పూర్తి చేశారు. అయినాసరే తప్పు తమదేమీ లేదన్నట్టుగా ఫలితాలపై సీనియర్, జూనియర్ అభ్యర్థులు అన్న తేడా లేకుండా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాకే మొగ్గు చూపారు. మావైపే ఉన్నారు. కానీ తీరా ఫలితాలు చూస్తే వేరేలా ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వరంగల్ పశ్చిమ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర పేర్కొనడం వారి అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని గెలిచిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపునేని నరేందర్ తిప్పికొట్టారు. కాగా, అసలు మహాకూటమి కూర్పే ఒక విఫల ప్రయోగం, విష ప్రయోగంగా ప్రజలు భావించిన నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా వ్యవహరించడం వల్లే, ఘోర పరాజయం పాలయ్యామని కాంగ్రెస్ నాయకుల అంతర్మథనం మొదలైంది.

192
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...