కార్పొరేషన్ నుంచి అసెంబ్లీకి..


Wed,December 12, 2018 04:09 AM

-నన్నపునేనికి కలిసొచ్చిన బల్దియా
వరంగల్, నమస్తే తెలంగాణ : రాజకీయ నాయకులకు కార్పొరేషన్ రాజకీయ ఎదుగుదలకు అచ్చొస్తుంది. మున్సిపాలిటి నుంచి కార్పొరేషన్, గ్రేటర్‌స్థాయికి చేరిన ఈ కేంద్రం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వారంతా అసెంబ్లీకి వెళ్లారు. మొదటి నుంచి కార్పొరేషన్ నుంచి రాజకీయ ఓనమాలు ప్రారంభించారంటే కలిసి వస్తుందన్న ప్రచారం ఉంది. అన్నట్లుగానే కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నన్నపునేని నరేందర్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. 2005, 2016 కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందిన నన్నపునేని నరేందర్ మేయర్ పదవిని చేపట్టారు. రెండున్నర సంవత్సరాలు మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన 2018 శాసన సభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొంది అసెంబ్లీకి వెళ్లనున్నారు. అయితే 2005 కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందిన దాస్యం వినయ్‌భాస్కర్ అటు తరువాత వచ్చిన 2009 శాసనసభ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అసెంబ్లీకి వెళ్లారు. ఆయన అప్పటినుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అంతకు ముందు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా మూడుసార్లు గెలుపొందిన బస్వరాజు సారయ్య 2004 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన అసెంబ్లీకి వెళ్లారు. ఆయన వరంగల్ నుంచి వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొంది కొద్దికాలం మంత్రిగా పనిచేశారు.
ఇద్దరు రాజ్యసభకు..
వరంగల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్, కార్పొరేటర్‌గా గెలుపొందిన ఇద్దరు ఏకంగా రాజ్యసభకు వెళ్లారు. 1980 దశకంలో రాజకీయ అరంగేట్రం చేసి కౌన్సిలర్‌గా గెలుపొందిన వైస్ చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ బండా ప్రకాశ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2005లో కార్పొరేటర్‌గా గెలుపొంది కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించిన గుండు సుధారాణి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. వీరిరువురు కార్పొరేషన్ నుంచే తమ రాజకీయ అరంగేట్రం చేశారు.
మున్సిపల్ చైర్మన్లకు కలిసొచ్చింది..
ఇప్పుడు కాదు మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన వారికి రాజకీయంగా కలిసొచ్చింది. ముగ్గురు మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేలుగా గెలుపొంది రాష్ట్రస్థాయిలో కీలక నేతలుగా ఎదిగారు. మున్సిపాలిటీ తొలి చైర్మన్‌గా పనిచేసిన టీ హయగ్రీవాచారి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఆయన రాజకీయ జీవితం మున్సిపాలిటీ నుంచే మొదలైంది. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలాకాలం పనిచేశారు. మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన ఉమారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు పొందారు. అటు తరువాత మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన ఆరెల్లి బుచ్చయ్య 1977లో వరంగల్ ఎమ్మెల్యేగా గెలుపొంది, జిల్లాలో కీలక నేతగా చాలాకాలం చక్రం తిప్పారు.

274
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...