నేడు విడుదల


Tue,December 11, 2018 03:18 AM

-ఓటరు తీర్పు ఉత్కంఠకు తెర
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ:65 రోజుల ఉత్కంఠకు తెర. ఓరుగల్లు ఓటర్ తీర్పు నేడే విడుదల. బరిలో నిలిచిన అభ్యర్థుల గుండెల్లో ఓటరు రైళ్లు పరుగెత్తిస్తున్నారు. మరికొద్ది గంటల్లో విజేతలెవరో..పరాజితులెవరో తేలిపోతుంది. ఈనెల 7న జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపు లెక్కింపు ఇవ్వాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్దన్నపేట ఈ మూడు నియోజకవర్గాల లెక్కింపు కేంద్రం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కేంద్రంలోని నాలుగో నెంబర్ గోదాం ప్రాంగణంలో ఈ లెక్కింపు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు, సూక్ష్మ పరిశీలికులు, సిబ్బంది అంతా ఎవరెవరు ఎక్కడుండాలో ఎవరెవరు ఏమీమి పనులు చేయాలో నిర్దేశించారు. పోలింగ్ పూర్తయినప్పటి నుంచి లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని పకడ్బంధీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ లెక్కింపు కేంద్రం వద్దే కాకుండా కమిషనరేట్ పరిధిలోనూ గెలుపోటముల ప్రభావ ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిణామాలపై అవసరమైన గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

* పోస్టల్ బ్యాలెట్‌తో తొలి రౌండ్
వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్దన్నపేట ఈ మూడు నియోజకవర్గాల్లోని పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓట్ల గణన ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. రిటర్నింగ్ అధికారికి అందిన పోస్టల్, సర్వీస్ ఓటర్లు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకర్గ లెక్కింపు కేంద్రానికి సోమవారం పొద్దుపోయేకల్లా చేరుతాయి. వీటి లెక్కింపు పూర్తికాగానే ఫలితాన్ని వెల్లడించిన అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు.
* 14 టేబుళ్లు 16 రౌండ్లు-వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు ఇదే లెక్క
పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓట్ల లెక్కింపు పూర్తికాగానే ఏ నియోజకర్గానికి ఆ నియోజకర్గంలో లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు ఈ రెండు నియోజకవర్గాల్లోని మొత్తం 14 టేబుళ్ల చొప్పున సిద్ధం చేశారు. మొత్తం 16వ రౌండ్లు. ఇక వర్దన్నపేటలో ఇదే 14 టేబుళ్ల చొప్పున మొత్తం 18 రౌండ్లలో తుది ఫలితం రాబోతున్నది.

*బూత్‌కో లెక్క
వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్దన్నపేట ఈ మూడు నియోజకవర్గాల్లోని 690 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను నిర్దేశిత టేబుళ్ల పై నిర్దేశిత రౌండ్ ఆధారంగా టేబుళ్ల మీదికి వస్తాయి. ఈ లెక్కన ప్రతీ బూత్‌కు బరిలో నిలిచిన అభ్యర్థి లెక్కింపు ఏజెంట్ ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు. అంటే టేబుల్‌కో ఏజెంట్ (అందరి అభ్యర్థులకు సమాన అవకాశాలు). వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలో బరిలో నిలిచిన 21 మంది అభ్యర్థుల ఎజెంట్లు, వారితోపాటు లెక్కింపు ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యేందుకు ఒక సూక్ష్మ పరిశీలకుడు, ఒక పర్యవేక్షుడు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉండేవిధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరితోపాటు నియోజకర్గ రిటర్నింగ్ అధికారి, ప్రత్యేక పరిశీలకుడి పర్యవేక్షణలో మొత్తం ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం విడియో రికార్డింగ్ చేస్తారు. ఇక ప్రతీ పోలింగ్ బూత్‌కో ఈవీఎం, వివీప్యాట్ చొప్పున స్ట్రాంగ్ రూం నుంచి బూత్‌ల వారీగా తెచ్చి పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు.

* సెంట్రల్ వెబ్‌సర్వైలెన్స్-ఎల్‌ఈడీ స్క్రీన్స్
ఏనుమాముల ఓట్ల లెక్కింపు కేంద్రం వ్యవహారం అంతా అక్కడి నుంచే నేరుగా ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ సీసీ కెమెరా, వెబ్ సర్వైలెన్స్‌కింద తెచ్చారు. అంతేకాకుండా లెక్కింపు కేంద్రం వద్ద మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియ కవరేజ్‌కు వెళ్లే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరూ అదే మీడియా సెంటర్ నుంచి కవరేజ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే లెక్కింపు ప్రక్రియకు సంబంధించి లెక్కింపు కేంద్రానికి మాత్రం మీడియాకు అనుమతిలేదని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్సష్టం చేశారు. అక్కడేర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌తోపాటు నియోజకవర్గాల వారీగా రౌండ్ రౌండ్‌కు ఫలితాలను వెల్లడిస్తామన్నారు.

* 57 మంది అభ్యర్థులు-481,912 మంది ఓటర్లు
వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు ఈ రెండు నియోకవర్గాల్లో నియోజకవర్గానికి 21 మంది చొప్పున ఎన్నికల బరిలో నిలిచారు. అదే వర్దన్నపేట నియోజకర్గంలో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి వరంగల్ తూర్పులో నన్నపునేని నరేందర్, వరంగల్ పశ్చిమలో దాస్యం వినయభాస్కర్, వర్దన్నపేట నుంచి అరూరి రమేష్, మహాకూటమి నుంచి వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర, టీజెఎస్ నుంచి గాదె ఇన్నయ్య. బీజేపీ నుంచి కుసుమ సతీష్, వరంగల్ పశ్చిమంలో టీడీపీ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి మార్తినేని ధర్మారావు, వర్దన్నపేట నుంచి టీజెఎస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య, బీజేపీ అభ్యర్థి కొత్త సారంగరావు పోనూ మిగితా వాళ్లంతా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం ఈ మూడు నియోజకవర్గాల్లో 57 మంది బరిలో నిలవగా, 4,81,912 మంది ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో తెలేది మరికొద్ది గంటలోనే, మూడు నియోజకవర్గాల్లో ఇంత బరిలో నిలిచినా బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం ద్విముఖపోటీలో నువ్వానేనా అన్నట్టు పోటీ ఉంటుందా? లేదా వార్ వన్‌సైడ్‌గా ఉంటుందా? అన్నది అత్యంత ఆసక్తికలిగించే అంశమే కాదు ఉత్కంఠను రేపుతున్న అంశం కూడా అని బరిలో నిలిచిన అభ్యర్థులు నరాలు తెగే ఉత్కంఠను నడిచలిలో ఉక్కపోతను అనుభవిస్తున్నారు.

* నియోజకవర్గాల వారీగా తుది పోలింగ్ శాతం
నియోజకవర్గం ఓటర్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం
వరంగల్ పశ్చిమ 240880 140409 58.29
వరంగల్ తూర్పు 211755 153586 72.53
వర్ధన్నపేట 225401 187917 83.37
వరంగల్ అర్బన్ 678036 481912 71.40

విజేతలెవరో... పరాజితులెవరో...!
ఎన్నికల రణ క్షేత్రంలో హోరాహోరీగా పోరాడిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. విజేతలు ఎవరో, పరాజితులెవరో అన్నది స్పష్టం కానుంది. డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. అప్పటి నుంచి అభ్యర్థులు గెలుపు లెక్కలు వేసుకుంటూ గెలుపుపై అంచనాలు వేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో మరింత టెన్షన్ పెరిగింది. ఓటరు దేవుళ్లు ఎవరికి పట్టం కడతారో అన్న టెన్షన్ పట్టుకుంది. ఓట్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి ఓటరు నాడి పట్టుకొని లెక్కలు వేసుకుంటూ గెలుపు ధీమాను ఒక వైపు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు, మరోపక్క వారిలో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన కూడా నెలకొంది.

గత నాలుగురోజులుగా అభ్యర్థుల్లో నెలకొన్న టెన్షన్ మరికొద్ది గంటల్లో వీడనుంది. ఓటరు ఎవరికి పట్టం కట్టారో అన్న తీర్పు ఈవీఎంల ద్వారా బయట పడనుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మొత్తంగా 21మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ నుంచి నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ నుంచి కుసుమ సతీష్, టీజేఎస్ నుంచి గాదె ఇన్నారెడ్డి పోటీ పడగా మరో 17మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దాస్యం వినయభాస్కర్, ప్రజాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి మార్తినేని ధర్మారావులు ప్రధాన పార్టీ అభ్యర్థులుగా పోటీ పడ్డారు. మరో 18మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అరూరి రమేష్, ప్రజా కూటమి నుంచి టీజేఎస్ అభ్యర్థిగా పగిడిపాటి దేవయ్య, బీజేపీ నుంచి కొత్త సారంగరావు పోటీ చేశారు. మరో 13మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థులకు గెలుపు ఆశలు లేనప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులే గెలుపు కోసం పోటీ పడ్డారు. మరికొద్ది గంటలలో విజేతలెవరో, పరాజితులెవరో తేలనుంది.

* వార్ వన్‌సైడే: ధీమాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న పార్టీగా, కష్టపడి సాధించుకున్న తెలంగాణను పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటేలా, తెలంగాణ గర్వపడేవిధంగా ఇష్టపూర్తిగా నాలుగున్నర సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో అద్వితీయ ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంతోపాటు సంక్షేమ పథకాల అమలులో ప్రజల మనసునెరిగిన పాలనగా తమకే ప్రజాశీర్వాదం ఉందని టీఆర్‌ఎస్ అభ్యర్థులు వార్ వన్‌సైడే అని పేర్కొంటున్నారు. అయితే మహాకూటమి అభ్యర్థులు సైతం తాము కచ్చితంగా గెలిచి తీరుతామని గంభీర ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌లు కాచినట్టు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్‌లు కడుతున్నారు. ఎవరి బెట్టింగ్ ఏది జరిగినా ఇది మరికొద్ది గంటల్లో ఉత్కంఠను తెరదించుతూ, అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ ఇదిగో అసలు సినిమా అని ఓటరు తీర్పు మరికొద్ది గంటల్లోనే తేల్చబోతున్నారు. అప్పటి దాకా ఈ ఉత్కంఠ సశేషం.

433
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...