కొనసాగుతున్న మెడికల్ ఎగ్జిబిషన్


Tue,December 11, 2018 03:15 AM

-ఉత్సాహంగా వస్తున్న ప్రభుత్వ,పైవేట్ పాఠశాలల విద్యార్థులు
-కుటుంబ సభ్యులతో వచ్చి తిలకిస్తున్న వైనం
-శరీర దానానికి ముందుకు వస్తున్న దాతలు
-సంతోషం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
పోచమ్మమైదాన్, డిసెంబర్ 10: వరంగల్ కాకతీయ వైద్య కశాశాలలో నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ సోమవారం మూడో రోజుకు చేరింది. కళాశాల వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వం పాఠశాలలకు సెలవు రోజులు కావడంతో సోమవారం అధిక సంఖ్యలో సర్కార్ పాఠశాలల విద్యార్థులు తరలివచ్చారు. అలాగే అర్బన్ జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సైతం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్‌లో నిలబడి ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కేఎంసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేయయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జిబిషన్ కొనసాగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆసక్తిగా తిలకిస్తున్న ఎగ్జిబిట్స్
కేఎంసీలోని గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి ఫ్లోర్‌లో దాదాపు నాలుగు వేల పైన ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లను విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పీజీలు, యుజీలతో పాటు పలువురు మెడికల్ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. అన్ని రకాల ఎగ్జిబిట్స్ అందరికీ అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేయడం, ఇంగ్లీష్, తెలుగులో కూడా రాయడంతో అవగాహన పెంచుకుంటున్నారు. అలాగే మెడికల్ విద్యార్థులు సైతం తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా వివరించడంతో విద్యార్థులు సులభంగా గ్రహిస్తున్నారు. బాటనీ, జువాలనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అనాటమీ, ఫోరెన్సిక్ సంబంధించిన సబ్జెక్టులపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

ఉచిత వైద్య పరీక్షలు....
కేఎంసీలో మెడికల్ ఎగ్జిబిట్స్ ప్రదర్శనతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంరక్ష డయాబెటిక్ స్క్రీనింగ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. డాక్టర్ బత్తుల శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచితంగా మధుమేహ వ్యాధి పరీక్షలు నిర్వహించి, అప్పటికప్పుడే రిపోర్టు ఇస్తున్నారు. అలాగే కేఎంసీ విద్యార్థులు రక్త పరీక్షలు చేస్తూ, బ్లడ్ గ్రూప్‌ను నిర్థ్ధారిస్తున్నారు. దీంతో చాలా మంది కుటుంబ సభ్యులు, విద్యార్థులు తమ బ్లడ్ గ్రూపు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య....
మెడికల్ ఎగ్జిబిషన్ చూడడానికి వస్తున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పాటు జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులు వస్తున్నారు. అలాగే పూర్వ విద్యార్థులు, నగరంలో ఉన్న పలువురు వైద్యులు తిలకిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వృద్ధులు సైతం ఆసక్తి కనపరుస్తున్నారు.
3 లక్షల మంది వస్తారని అంచనా : ప్రిన్సిపాల్
పెద్ద ఎత్తున ఏర్పా టు చేసిన ఎగ్జిబిషన్ తిలికేందుకు దాదాపు 3 లక్షల మంది వస్తారని అంచనా వేశామని ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అనిల్ తెలిపారు. సామాజిక బాధ్యతగా ఆరోగ్యంపై అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. వైద్యు లు, మెడికల్ విద్యార్థులు, సిబ్బంది సహకారంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అందరికీ అవకాశం ఉందని పేర్కొన్నారు.

శరీరదానానికి ముందుకు వస్తున్న దాతలు
మెడికల్ ఎగ్జిబిషన్ స్ఫూర్తితో పలువురు నేత్ర, శరీరదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరణించిన అనంతరం శరీరాన్ని దానం చేయడానికి తాము సిద్ధ్దేమేనంటూ వీలు రాసి ఇస్తున్నారు. రెండు రోజు ల నుంచి ఇరవై దాతలు స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి శరీరాన్ని దానం చేస్తామని అంగీకార పత్రాలపై సంతకం చేశారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కూడా ఉండటం విశేషం. ఈ కుటుంబంలో బైరి మాధవి, కుమార్తె బైరి కీర్తి, కుమారుడు బైరి హరీష్‌లు ఉన్నారు. అలాగే పరికిపండ్ల పృధ్వీ, ముసుగు రాజు, కె.అరుంధతి, పాషం లాశ్వ, పి.పూ., కందగట్ల ఉజ్వల, కాసం అశ్వితారెడ్డి, సాదుగంటి తేజస్వినీ, అన్నపురుపు విశాల్, డాక్టర్ ఎ. విద్యాదేవి, కోడెం సాత్విక, సంతోష్‌రెడ్డి, పైడిపల్లి లక్ష్మి, వై.అభినవ్, బైరి స్వామిలు ఉన్నారు. అలాగే మెడికల్ ఎగ్జిబిషన్ స్ఫూర్తితో ఇద్దరి వ్యక్తుల పార్థివదేహాలు కూడా కేఎంసీ అనాటమీ విభాగానికి అప్పజెప్పడం విశేషం. తెలంగాణ నేత్ర అవయ శరీరదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోన్‌రెడ్డి మల్లారెడ్డి, రాజమౌళి పాల్గొన్నారు.

293
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...